close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

సామాజిక మాధ్యమాలు సమస్యలపై ఉద్యమాలు..!

ట్విట్టర్‌ వేదికగా నిత్యం వందల ఫిర్యాదులు
నగర అభివృద్ధిపై యంత్రాంగానికి సూచనలు
నగరంలో జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్‌ ఖాతాకు రోజు వస్తున్న ఫిర్యాదులు 100
ఈ ఒక్కవారంలోనే వచ్చిన సూచనల సంఖ్య 300
నగరంలో సిటీ ట్రాఫిక్‌ పోలీస్‌ ఖాతాకు ప్రతిరోజు వస్తున్న ఫిర్యాదులు 30నుంచి 40
ఈ వారంలో ఈ ఫిర్యాదుల సంఖ్య 100
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

ఇలా నగర యువత తమ ప్రాంతంలో సమస్యలపై సామాజిక మాధ్యమాలు వేదికగా స్పందిస్తున్నారు. వినకపోతే ప్రశ్నిస్తున్నారు. కదలిక లేకపోతే నిలదీస్తున్నారు. ఎంతకు పరిష్కరించకపోతే జట్టు కట్టి ప్రపంచానికి చాటిచెబుతున్నారు. అయినా.. మేల్కొనకపోతే జీహెచ్‌ఎంసీ, నగర ట్రాఫిక్‌ పోలీస్‌, మంత్రి కేటీర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అందర్నీ సామాజిక వేదికలపై కలుపుకొని ఒకరకంగా ఉద్యమమే చేస్తున్నారు.

పరిష్కారం లభిస్తుండటంతో..
సమాచార వ్యాప్తికి, సమస్యల పరిష్కారంలోనూ కీలకంగా నిలుస్తోంది ట్విట్టర్‌. ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు దీన్నే ఎక్కువగా వాడుతున్నారు. పెట్టిన పోస్టుకు స్పందించడంతో యువతలో ఆసక్తి పెరుగుతోంది. జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్‌, హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ పోలీస్‌ ఖాతాలు 24గంటలూ సేవలందిస్తున్నాయి. ఈ ఖాతాలే ఇప్పుడు ట్విట్టర్‌లో ఎక్కువ క్రేజు సంపాదిస్తున్నాయి.
*సార్‌.. పాత బస్తీలో ప్రతి పని అసంపూర్తే. డబీర్‌పురా నాలా పనులు నెలల తరబడి సాగుతూనే ఉన్నాయి. ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు.’
- ఇది పాతబస్తీకి చెందిన ఓ కుర్రాడు.
* ‘కూకట్‌పల్లి సర్కిల్‌ 24లో హైదర్‌నగర్‌, అల్విన్‌ కాలనీ డివిజన్లలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆధారాలన్నీ ఉన్నాయి. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి.’
-కూకట్‌పల్లికి చెందిన ఓ యువకుడు.
* ‘మా ప్రాంతంలో రాత్రయితే విపరీతమైన దోమలు. మా కుటుంబ సభ్యులు ఇప్పటికే డెంగీతో బాధపడుతున్నారు. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ ఫాగింగ్‌ వాహనం ఇక్కడ చూడలేదు. చర్యలెందుకు తీసుకోవడం లేదు..?’
- జూబ్లీహిల్స్‌లో నివాసముండే ఓ యువతి.
* ‘బర్కత్‌పుర కూడలిలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పనిచేయడం లేదు. వెంటనే చర్యలు చేపట్టండి’
- ఓ వాహనదారుడు 

ఆర్టీసీ ఉద్యోగి కుమార్తె ఆవేదన..
మంత్రికి నివేదన

రాణిగంజ్‌ డిపోకి చెందిన ఓ ఆర్టీసీ మహిళా కండక్టర్‌ కుమార్తె ట్విట్టర్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. మంత్రి కేటీఆర్‌ని సాయం కోరుతూ పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్లు మద్దతిస్తున్నారు. ‘సార్‌.. మీరు ఎవరు సాయమడిగినా చేస్తారని విన్నాను. అందుకే ఈ పోస్టు. మా అమ్మ ఆర్టీసీ కండక్టర్‌. ఆమె జీతంతోనే ఇల్లు గడుస్తుంది. సమ్మె వల్ల విధుల్లోకి వెళ్లక, జీతం లేదు. నా పరీక్ష ఫీజూ చెల్లించలేని స్థితిలో ఉన్నాం. మీరే ఆదుకోవాలి’ అంటూ ఆవేదనను పంచుకుంది. 


మేం సిద్ధం.. మీరు సిద్ధమా..?

‘నగర రోడ్లపై గుంత కనిపిస్తే.. ఆ గుంతతో ఓ స్వీయచిత్రం తీసి మాకు పంపించండి.. రూ.500 నజరానా అందుకోండి’ అని ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అక్కడి వారికి ఓ సవాల్‌ విసిరింది. దీనిపై హైదరాబాద్‌ వాసులు ట్విట్టర్‌లో జీహెచ్‌ఎంసీ, మంత్రి కేటీఆర్‌ ఖాతాలను జోడించి ‘ఈ సవాలుకు మేం సిద్ధమే మీరు సిద్ధమా’ అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.