close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

పరిశోధన.. జల వేదన!

 కీలక పరిశోధన స్థానాన్ని వేధిస్తోన్న నీటి కష్టాలు

సాగు, తాగునీటి అవసరాలకు శాస్త్రవేత్తలకు ఇబ్బందులు

ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దైన్యం

తెలుగుగంగ సమీపంలో వెళుతున్నా తప్పని అవస్థలు


పొదలకూరులోని వ్యవసాయ పరిశోధన స్థానం

పరిశోధనకు జల కష్టాలతో అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా అవసరమైన భూములు పుష్కలంగా ఉన్నా, నిధులు విరివిగా అందుతున్నా పూర్తిస్థాయిలో ప్రయోగాలు చేయలేని దుస్థితి నెలకొంది. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు ఉత్సాహంగా అడుగులు వేసే అవకాశం ఉన్నా వసతులు కరవవడం సమస్యగా మారింది. సాగుకే కాదు చివరకు తాగునీటికీ తంటాలు పడాల్సి రావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లాలోని పొదలకూరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ చిరుధాన్యాల పరిశోధన స్థానంలో ఈ దుర్భర పరిస్థితి ఏర్పడింది. దీంతో శాస్త్రవేత్తలు, విద్యార్థుల అవస్థలు అన్నీఇన్నీకావు.

ఈనాడు, నెల్లూరు, న్యూస్‌టుడే, పొదలకూరు : ఐదు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో పొదలకూరులో పరిశోధన స్థానాన్ని ఏర్పాటు చేసింది. జొన్నసాగు విరివిగా ఉండే సింహపురి జిల్లాలో ఆ పంట సాగు చేసే రైతుల సమస్యలను అర్థం చేసుకోవడంతో పాటు.. కొత్త రకం వంగడాలను ఉత్పత్తి చేసేందుకు 1966లో దీన్ని నెలకొల్పారు. మెట్ట ప్రాంతమైన ఇక్కడ వర్షాభావ పరిస్థితులను అధ్యయనం చేస్తూ జొన్నపై పరిశోధనలు చేయాలని నిర్ణయించారు. అలా ఆరంభంలో ప్రయోగాల పరంపర సాగింది. 7 జొన్న రకాలను ఉత్పత్తి చేయగా.. అందులో 4 రకాలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయి. అనంతరం రైతులు జొన్నసాగుపై విముఖత చూపడం.. మినుము, పెసర వంటి చిరుధాన్యాల వైపు మొగ్గు చూపడంతో ఆ దిశగా ప్రభుత్వం ఇక్కడి శాస్త్రవేత్తలను ప్రోత్సహించింది. అలా మినుములో 2 రకాల కొత్త వంగడాలను ఉత్పత్తి చేశారు. పీబీజీ-1, పీబీజీ-26 రకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. మెట్ట ప్రాంత రైతులే వీటిని విరివిగా సాగు చేసే స్థాయికి చేరాయి. 2006లో ఇక్కడే వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇంతలా పరిశోధనల్లో పేరెన్నికగన్న ఈ కేంద్రానికి ఇటీవలే అదనపు హంగులు సమకూరాయి. ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి దామోదర్‌నాయుడు ఇటీవల కేంద్రాన్ని సందర్శించి ఇక్కడి పరిశోధనలపై శాస్త్రవేత్తలకు కితాబు ఇచ్చారు. ఈ క్రమంలో వసతుల కల్పనపైనా దృష్టి పెట్టారు. అలా పాలిటెక్నిక్‌ విద్యార్థుల కోసం సుమారు రూ.కోటి వెచ్చించి భవనాన్ని నిర్మించేందుకు మొగ్గు చూపారు. ప్రస్తుతం ఆ పనులు జోరుగా సాగుతున్నాయి. అలాగే ప్రహరీ ఏర్పాటుకు సమ్మతించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య నెలకొంది.

తీరని సమస్య

మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పొదలకూరు పరిశోధన స్థానంలో సుమారు 3 ఎకరాల్లో భవనాలు, కార్యాలయ సముదాయం ఉంది. మిగిలిన 27 ఎకరాల్లో వ్యవసాయ పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కేంద్రాన్ని ప్రస్తుతం నీటి సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. సాగు అవసరాలకే కాదు.. చివరకు తాగునీటికీ అవస్థలు ఉండటంతో అటు అధికారులు, ఇటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సాగు పరంగా చూస్తే.. కేవలం రెండు పంటకుంటలు మాత్రమే దిక్కయ్యాయి. అందులో ఒకటి ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినది కాగా.. మరొకటి తాజాగా రూ.40 లక్షల వ్యయంతో నిర్మించారు. మెట్ట ప్రాంతం కావడం.. ఇక్కడ వర్షాభావ పరిస్థితులు ఉండటంతో నీటికి కొరత ఉంటోంది. భూగర్భజలాలు సైతం అడుగంటాయి. జిల్లా మొత్తం జలసిరులు ఉన్నా ఈ ప్రాంత భూమిలో మాత్రం పాతాళానికి జలమట్టం చేరింది. ఫలితంగా 6 బోర్లు వేసినా చుక్కనీరు కనిపించలేదు. ప్రత్యామ్నాయ మార్గంలో చెరువులు, జలాశయాల నుంచి నీరు తెచ్చే అవకాశం కరవైంది. ఈ స్థితిలో లభ్యమయ్యే నీటిని ఒడిసిపట్టుకునే క్రమంలో అధికారులు పంట కుంటల ఏర్పాటుకు పని చెప్పారు. వాటి ద్వారా లభ్యమయ్యే నీరు ఇక్కడి అవసరాలకు సరిపోదు. శాశ్వత పరిష్కారం అవసరం.

గంగతోనే బెంగ తీరేది! : ఈ కేంద్రానికి శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం కావాలంటే ఒకే ఒక్క మార్గం కనిపిస్తోంది. భూగర్భజలాలు సైతం అడుగంటిన క్రమంలో సమీపంలో వెళ్లే తెలుగుగంగ పథకంలోని కండలేరు ఉపకాల్వే దిక్కవుతోంది. పొదలకూరు నుంచి బిరదవోలు వెళ్లే 18ఆర్‌ ఉపకాల్వ ప్రస్తుతం వినియోగంలో ఉంది. ఇక్కడి నుంచి పరిశోధన స్థానానికి ప్రత్యేక కాల్వ లేదా పైపులైను ఏర్పాటు చేస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ేరైతుల ప్రయోజనాల కోసమే ప్రయోగాలు జరుగుతున్న క్రమంలో దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. తాగునీటికీ తద్వారా పరిష్కారం చూపొచ్ఛు ప్రస్తుతం చుక్కనీటి కోసం విద్యార్థులు పడుతున్న వ్యథ అంతా ఇంతా కాదు.. సమీపంలోని వాటర్‌ ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేసి తెచ్చి వాడుకుంటుండగా.. అవసరాల కోసం క్లిష్ట పరిస్థితుల్లో ట్యాంకర్లు తెప్పించుకుంటుండడం గమనార్హం. ఈ స్థితిలో కండలేరు ఉపకాల్వ ద్వారా కనెక్షన్‌ అందిస్తే సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి. అలాగే ఈ పరిశోధన స్థానం ప్రయోగాల పరంగా మరింత బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది.

‘చిరు’ ప్రయత్నమే కీలకం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చిరు ధాన్యాల వినియోగంపై ప్రజలు మొగ్గు చూపుతుండటం.. రాష్ట్రప్రభుత్వం సైతం చిరు ధాన్యాల సాగును విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో ఈ కేంద్రాన్ని పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపితే బాగుంటుంది. ఈ విషయమై పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త, బాధ్యులు సుజాతతో ‘ఈనాడు’ మాట్లాడగా.. పరిశోధనల పరంగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు తాము పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్లు చెప్పారు. నీటి సమస్య కొంత ఇబ్బంది పెడుతోందని వివరించారు. ఈ విషయాన్ని ఉన్నత అధికారులకు నివేదించినట్లు తెలిపారు.

ప్రయోగాత్మకంగా చేపట్టిన చిరుధాన్యాల సాగు  

ఈ పంటకుంట మాత్రమే సాగుకు దిక్కు

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.