close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

ఒక్క అడుగు...

ఆరోగ్యానికి.. అనారోగ్యానికి దూరం
50 మీటర్లలోపు పాఠశాలల వద్ద ఆహార పదార్థాలపై నిషేధం
నిబంధనలు పాటిస్తే చిన్నారులకు ప్రయోజనం

గన్నవరానికి చెందిన శ్రీను కుమారుడు ఓ పాఠశాలలో చదువుతున్నాడు. రోజూ ఇంటి నుంచి డబ్బులు తీసుకెళ్లి తినుబండారాలు కొనుగోలు చేసి తినేవాడు. ఇది తెలిసిన తండ్రి పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు. నాసిరకం, నకిలీవి ఉన్నట్లు గుర్తించారు. పైగా అధిక ధర వసూలు చేయడం ఆయన దృష్టికి వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదని.. విద్యాలయంలో యాజమాన్యమే ఇలా వ్యాపారం చేయడం కూడదని హితవు పలికారు. పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు.

అమరావతి ఫీచర్స్‌, న్యూస్‌టుడే

పిల్లలకు మంచి ఆహారం అందిస్తున్నాం.. అయినా అనారోగ్యంగా ఉండటం ఏంటి.. అనే అనుమానం తల్లిదండ్రుల్ని వెంటాడుతోంది. వైద్యుడి వద్దకు వెళ్తే పోషకాహారం, రక్తహీనత లోపం ఉందని చెప్పడంతో వారికి ఏం జరుగుతుందో కూడా అర్థమవ్వని పరిస్థితి. జంక్‌ఫుడ్‌ కారణంగా ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతున్నారని కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ ద్వారా నియమించిన కమిటీ నిశిత పరిశీలనలో వెల్లడైంది. పాఠశాలలకు సమీపంలో ఆహార పదార్థాల అమ్మకాలు లేకుండా చేస్తే బాలల ఆరోగ్యం మెరుగుపడుతుందనే అభిప్రాయాన్ని ఈ కమిటీ వ్యక్తం చేస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చింది.

ఆ రెండు పట్టణాల్లో ఏం చేశారంటే..
జాతీయ మధుమేహ పరిశోధనా సంస్థ విద్యార్థుల్లో జంక్‌ఫుడ్‌ అలవాటును దూరం చేసేందుకు చెన్నైలో ప్రయోగాత్మక చర్యలు చేపట్టింది. అదే విధానాన్ని తిరువళ్లూర్‌ పట్టణంలోనూ అమలు చేసింది.
* ఈ రెండు పట్టణాల్లోని వెయ్యి మంది ఉపాధ్యాయులకు ముందుగా ప్యాకింగ్‌ ఆహారంతో పిల్లలకు కలిగే చేటు.. అలవాటును దూరం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు అర్థమయ్యేలా ఆరోగ్య నిపుణులు వివరించారు.
* ఇవే అంశాలపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థుల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. జాగ్రత్తలను కూడా తల్లిదండ్రులకు వివరించారు.
* అవగాహన కార్యక్రమాలకు ముందు.. తర్వాత పిల్లల్లో వచ్చిన ఆరోగ్య మార్పులను పరిశీలించారు. పాఠశాలల వద్ద ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఉండేలా చూశారు. జంక్‌ఫుడ్‌ను పూర్తిగా బడుల వద్ద నుంచి తొలగింపజేశారు. ఇలాంటి కృషి మన ఉపాధ్యాయుల నుంచి జరగాల్సి ఉంది.

రెండు జిల్లాల్లో ఇదీ పరిస్థితి..
* గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చిన్నారుల్లో ఊబకాయం సమస్య ఎక్కువగా ఉంది. ఒకటి నుంచి 18 ఏళ్లలోపు వారిలో 9 నుంచి 11 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
* పోషకాహారలేమి బాల్యాన్ని పట్టిపీడిస్తోంది. 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు అంగ్‌న్‌వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్నారు. రెండు జిల్లాల్లో 3.50 లక్షల మంది ఉంటే వారిలో 30 శాతం మందికి ప్రత్యేక పోషకాహారాన్ని అందించాల్సిన పరిస్థితి. 7 నుంచి 14 ఏళ్లలోపు వారిలోనూ 4 నుంచి 7 శాతం మందికి సమస్య ఉంది.
* మధుమేహం అంటే పెద్దలకు సంబంధించిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యగా గతంలో భావించేవారు. ఇప్పుడు టైప్‌-1తోపాటు టైప్‌-2 మధుమేహం బారిన చిన్నారులు ఎక్కువ మంది పడుతన్నారు. రాజధాని జిల్లాల్లో మధుమేహం వ్యాప్తి పిల్లల్లో ఎక్కువగా ఉంది.
* చిరుతిండి ఆహారం జీర్ణం అవ్వడానికి ఎంతో సమయం పడుతుంది. జీర్ణకోశ సంబంధ వ్యాధులు సంభవించే అవకాశాలు పెరుగుతాయి.
* గతంతో జవహర్‌ బాల ఆరోగ్యరక్ష పథకం కింద నిర్వహించిన సర్వేలో ప్రతి 100 మంది చిన్నారులకు గుంటూరు జిల్లాలో 66 మంది, కృష్ణాలో 64 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఇందులోనూ 10 నుంచి 11 శాతం మంది తీవ్ర రక్తహీనత బారినపడి విలవిల్లాడుతున్నారు.
* దంత సంబంధ వ్యాధులు గుంటూరు జిల్లాలో ప్రతి 100 మంది చిన్నారుల్లో 11 మందికి ఉంటే కృష్ణా జిల్లాలో 9 మంది ఉన్నారు. శ్వాసకోశ సంబంధ వ్యాధులతో 3 నుంచి 5 శాతం చిన్నారులు బాధపడుతున్నారు.
* గœుంటూరు, కృష్ణా జిల్లాల్లో చిరుతిళ్ల వ్యాపారం నెలకు రూ.కోట్లలో జరుగుతోంది. వీటిని నియంత్రించే శాఖ ఏ ఒక్కటీ లేదు. దీంతో పాఠశాలల చిన్నారులను లక్ష్యంగా చేసుకొని పుట్టగొడుగుల్లా దుకాణాలు వెలుస్తున్నాయి.   ఎటువంటి ఆరోగ్య నిబంధనలు పాటించని తయారీ కేంద్రాలు కూడా వెలుస్తున్నాయి. ఒక్కో చిన్నారి చిరుతిండికి రోజుకు రూ.10 వరకు వెచ్చిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారి ఖర్చు ఉంటుంది.

50 మీటర్లలోపే.. ఇలా కట్టడి చేయవచ్చు..
పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలను పాఠశాలల్లోనూ, వాటి పరిసరాల్లో అమ్మకుండా.. ప్రచారం చేయకుండా కట్టడి చేయాలని ది ఫుడ్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనలతో కూడిన ముసాయిదాను రూపొందించి ఈ నెల 6న విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం పాఠశాలల్లోనే కాకుండా.. చుట్టుపక్కల 50 మీటర్లలోపు కూడా జంక్‌ఫుడ్‌ అమ్మడం.. ప్రచారం చేయడం నిషిద్ధం. కొవ్వు.. ఉప్పు.. చక్కెర అధికంగా ఉండే ఆహారాలను విక్రయించకుండా చూడటమే లక్ష్యంగా నిబంధనల్ని రూపొందించారు. ఆహార కల్తీ తనిఖీ అధికారులు.. వైద్యఆరోగ్యశాఖ.. మాతా శిశుసంరక్షణ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తే విక్రయాలకు కట్టడి పడే అవకాశం ఉంటుంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్గదర్శకాల అమలుకు చర్యలు తీసుకుంటామని ఆహార కల్తీ తనిఖీ అధికారి పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.