బుధవారం, డిసెంబర్ 11, 2019
● తేమ పేరుతో రైతులకు కుచ్చుటోపీ
● అన్నదాతలకు రూ. 53 కోట్లు నష్టం
న్యూస్‌టుడే, కమ్మర్పల్లి
జిల్లాలో అన్నదాతల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. ఓ వైపు అకాల వర్షాలు అతలాకుతలం చేస్తే.. మరోవైపు దళారులు ధర తగ్గించి దగా చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపంతో నిండా మునుగుతున్న కర్షకులు దళారుల మాయాజాలంతో మరోసారి తీవ్రంగా నష్టపోతున్నారు. వారి దోపిడీని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని పాలకులు హామీలు ఇస్తున్నా... క్షేత్రస్థాయిలో కానరావడం లేదు.. నెల రోజుల క్రితమే మొక్కజొన్న దిగుబడులు చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాల ఊసెత్తలేదు. దీనిని ఆసరాగా చేసుకున్న దళారులు తేమ పరీక్షల పేరుతో మక్క రైతులను నిండా ముంచారు. కోట్ల రూపాయలు పోగేసుకున్నారు. మరోసారి మక్కరైతుకు ఓటమి తప్పలేదు.
జిల్లాలో మొక్కజొన్న చేతికొచ్చి 40 రోజులవుతోంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలు రూ.1760 కంటే బయట మార్కెట్లో (రూ.2100) ఎక్కువ ధర ఉందని సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ పరిస్థితిని దళారులు అనుకూలంగా మల్చుకున్నారు. గ్రామాల్లో తిష్ఠవేసి అన్నదాతలకు మాయమాటలు చెప్పి ధర తగ్గిస్తూ 70 శాతం పంటను కొనుగోలు చేశారు. బయట మార్కెట్లో మక్కలకు డిమాండ్ ఉన్నా.. తేమ పేరుతో క్వింటాకు రూ.1800 మించి చెల్లించలేదు. ప్రస్తుతం మిగిలిన 30 శాతం పంటను కొనుగోలు చేయడానికి రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. మద్దతు ధర మాటే లేకుండా క్వింటాకు రూ. 1700 చెల్లించి రైతులను నిండా ముంచుతున్నారు.
దళారులకు దక్కింది రూ.41.21 కోట్లు
జిల్లాలో ఈ ఖరీప్‌లో 60,870 ఎకరాల్లో మక్క సాగైంది. 15.21 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం రూ.1760 మద్దతు ధర నిర్ణయించింది. వర్షాలతో పంటను కాపాడుకోలేని అన్నదాతల దుస్థితిని దళారులు పక్కాగా సొమ్ము చేసుకున్నారు. తేమ పేరుతో మక్కలకు డిమాండ్ ఉన్నా క్వింటాలుకు రూ.1800కు మించి చెల్లించలేదు. అదే క్వింటాలు మక్కల బస్తాను తీసుకెళ్లి రూ.2100కు వ్యాపారికి విక్రయించి రూ. 300 లాభం పొందారు. క్వింటాలుకు రూ.300 చొప్పున 15.21 లక్షల క్వింటాళ్ల దిగుబడికి రూ 41.21 కోట్లు సంపాదించారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతకు మాత్రం నోట్లో మట్టి కొట్టారు.
కడ్తాతో 30.420 క్వింటాళ్లు మిగులు
బస్తా బరువును కలుపుకొని 50 కిలోలకు బదులుగా 51 కిలోలకు తూకం వేస్తారు. బస్తా పేరుతో కిలో మక్కలను అదనంగా తీసుకుంటారు. 15.21 లక్షల క్వింటాళ్ల దిగుబడిని తూకం వేయడానికి 30.42 లక్షల బస్తాలు అవసరం. బస్తాకు కిలో చొప్పున 30,420 క్వింటాళ్ల మక్కలను అదనంగా కాజేశారు. వీటిని క్వింటాలు రూ 2100 చొప్పున వ్యాపారులకు విక్రయించి మరో రూ.6.38 కోట్లు కొల్లగొట్టారు.
వడ్డీ రూ.5.47 కోట్లు లాభం
గతంలో దళారులు పంటలను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా రైతులను మోసగించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో రైతులు పంటను దళారీకి ఇవ్వగానే వెంటనే డబ్బులు వసూలు చేసుకోవడం జరుగుతోంది. దీనికి దళారులు వందకు రూ.రెండు వడ్డీ చొప్పున తీసుకుని పంట మొత్తాన్ని అన్నదాతలకు ఇస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో దళారులు క్వింటాలుకు రూ.1800 చొప్పున 15.21 లక్షల క్వింటాళ్లకు రూ. 274 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. వందకు రూ.2 చొప్పున వడ్డీ తీసుకుని రూ.5.47 కోట్లు అర్జించారు.
లారీకి రూ.3 వేలు కమీషన్
దళారులు మక్కలను కొనుగోలు చేసి వ్యాపారికి పంపిస్తారు. వ్యాపారి దళారీకి ఒక లారీ (100 క్వింటాళ్లు)కి రూ.2500 నుంచి 3 వేల వరకు కమీషన్ ఇస్తారు. ఈ లెక్క 15.21 లక్షల దిగుబడికి రూ 4.5 కోట్ల వరకు కమీషన్ రూపంలో సంపాదిస్తున్నారు. జిల్లాలో కర్షకులు వడ్డీ, కడ్తాతో కలిపి రూ.53 కోట్లు నష్టపోయారు.
రూ.1800 మాత్రమే చెల్లించారు
- చింతకుంట శ్రీను, రైతు, ఉప్లూర్
ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలు రూ. 1760 ఉన్నా మార్కెట్లో రూ.2100 వరకు డిమాండు పలికింది. కొనుగోలు కేంద్రాలు లేక వర్షాలతో పంట దాచేందుకు స్థలం లేక దళారులు ధరను తగ్గించారు. గత్యంతరం లేక రూ. 1800కు విక్రయించా. తేమ పేరుతో నష్టపోవాల్సి వచ్చింది. వచ్చిన డబ్బులకు రూ 2 చొప్పున వడ్డీ కోల్పోయా.
దళారులు సిండికేట్ అయ్యారు
- దుప్పల శ్రీను, రైతు, కమ్మర్పల్లి
మక్కలకు దళారులంతా సిండికేట్‌గా మారి ధర తగ్గించారు. కనీస మద్దతు ధర రూ. 1760 చెల్లించడం లేదు. దళారులను పలకరిస్తే కన్నెత్తి చూడడం లేదు. గత్యంతరం లేక క్వింటాలుకు రూ.1700కే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
తాజా వార్తలు
జిల్లా వార్తలు