close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

అభివృద్ధే అందరి అజెండా కావాలి: కోరం

స్థాయీ సంఘాల సమావేశంలో సమస్యలపై సభ్యుల ఏకరవు

డీఈవో సరోజినీదేవి, డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్‌కు సూచనలు చేస్తున్న జడ్పీ అధ్యక్షుడు కోరం కనకయ్య

కొత్తగూడెం రామవరం, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమం, అభివృద్ధే అజెండాగా సమావేశాల్లో సమగ్ర చర్చ, తీర్మానాలు జరపాలని జడ్పీ అధ్యక్షుడు కోరం కనకయ్య సభ్యులు, అధికారులకు సూచించారు. శుక్రవారం కొత్తగూడెం జడ్పీ కార్యాలయంలో జడ్పీ సీఈవో మధుసూదన్‌రాజు అధ్యక్షతన ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పనుల స్థాయీ సంఘాల కమిటీల సమావేశాలను వేర్వేరుగా నిర్వహించారు. సంఘాల అధ్యక్షుల సమక్షంలో విభాగాల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షలు జరిపారు. గత మూడు నెలల లక్ష్యాలు, ప్రగతిపై ఆయా శాఖల అధికారులు నివేదికలను సమర్పించారు. పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా స్థాయీ సంఘాల సమావేశాలనుద్దేశించి జడ్పీ అధ్యక్షుడు కోరం మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. మెనూపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపరచాలన్నారు. ‘ట్రైకార్‌’ రుణాల ద్వారా అందిస్తున్న కార్లతో యువత ఉపాధి పొందేలా చూడాలన్నారు. గీత కార్మికులకు అందించే పింఛన్ల విషయంలో ఉన్న ఇబ్బందులను తొలగించాలన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో భద్రాచలంలో సబ్బులు, పాల్వంచలో పల్లీ పట్టికల తయారీ తరహాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలన్నారు. జడ్పీ ఉపాధ్యక్షుడు కంచర్ల చంద్రశేఖర్‌రావు, డీపీఆర్‌వో పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, జడ్పీటీసీలు మేరెడ్డి వసంత (లక్ష్మీదేవిపల్లి), సులక్షణ (అశ్వాపురం), ఉమాదేవి(ఇల్లెందు), వెంకటరెడ్డి (చండ్రుగొండ), వరలక్ష్మి (అశ్వారావుపేట), కళావతి (జూలూరుపాడు), కొమురం కాంతారావు (కరకగూడెం), కో ఆప్షన్‌ సభ్యులు రసూల్‌, షరీఫ్‌ పాల్గొన్నారు.

సభ్యుల ఆవేదన

అనర్హులకు ‘ఆసరా’ పింఛన్లు ఇస్తున్నారని, సదరం ధ్రువీకరణ పత్రాల జారీలో పారదర్శకత లోపిస్తోందని జడ్పీటీసీ మేరెడ్డి వసంత అన్నారు. డీఆర్‌డీఏ పీడీ జగత్‌కుమార్‌రెడ్డి వివరణ ఇస్తూ అక్రమాల వివరాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ములకలపల్లిలో డెంగీ జ్వరాల నిర్ధారణకు ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, గైనకాలజిస్టును నియమించాలని సభ్యురాలు నాగమణి కోరారు. జిల్లా వైద్యాధికారులు భాస్కర్‌నాయక్‌, శ్రీనివాస్‌ సమాధానమిస్తూ ఉన్నతాధికారులతో చర్చించి డెంగీ నిర్ధారణ కేంద్రం ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు.

వసతి గృహాల్లో చిన్నారులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేయకపోవడంతో చలికి ఇబ్బంది పడుతున్నారని, తాగునీటి శుద్ధి యంత్రాలు మరమ్మతులకు గురయ్యాయని ఆ స్థాయీ సంఘం అధ్యక్షురాలు కళావతి అన్నారు. ఎస్సీ అభివృద్ధి అధికారిణి సల్మాభాను సమాధామిస్తూ.. విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆర్వో ప్లాంట్ల మరమ్మతులకు నివేదికలను సమర్పించామన్నారు. అంతకు ముందు సంఘాల వారీగా నివేదికలను సమావేశాల్లో సమర్పించారు.

ఆర్థిక - ప్రణాళిక సంఘం: జిల్లాలో గత సంవత్సరం కంటే 315.1 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయిందని, ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 1,35,742 హెక్టార్లలో వివిధ పంటలు సేద్యంలో ఉన్నాయని ప్రణాళిక సంఘం జిల్లా అధికారి వెల్లడించారు. ఖరీఫ్‌ సీజన్‌లో 3,78,112 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పౌరసరఫరాల శాఖ 115 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తుందన్నారు.

గ్రామీణాభివృద్ధి సమావేశంలో పీడీ జగత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అడిగిన ప్రతి వ్యక్తీకి జాబ్‌కార్డులను అందజేస్తున్నామన్నారు. పంట చేలల్లో నీటి కుంటలు, ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. హరితహారంలో 1.38 కోట్ల మొక్కల పెంపకాన్ని జిల్లాకు లక్ష్యంగా ఇచ్చారన్నారు.

సహకార శాఖ అధికారి మైఖేల్‌బోస్‌ మాట్లాడుతూ 20 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రూ.747.36 లక్షల ఎరువులను పంపిణీ చేశామన్నారు. రూ.279.65 లక్షల విలువైన విత్తనాలను పంపిణీ చేశామన్నారు.

జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సీతారాం మాట్లాడుతూ టీఎస్‌ ఐపాస్‌లో వివిధ శాఖల పరిధిలో 50 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిచ్చినట్లు చెప్పారు.

పశు సంవర్దక శాఖాధికారి వేణుగోపాలరావు మాట్లాడుతూ సిబ్బంది కొరత ఉన్న ప్రాంతాల్లో గోపాల మిత్రలతో పశు సంపదకు సేవలందిస్తున్నామన్నారు. సంచార వాహనాలతో పశువులకు ఇళ్ల వద్దే వైద్యం అందేలా చూస్తున్నామన్నారు.

ఎస్సీ కార్పొరేషన్‌ పులిరాజు మాట్లాడుతూ జిల్లాలో 331 యూనిట్ల లక్ష్యంగా రూ.5.7 కోట్ల సబ్సిడీతో రూ.2.8 కోట్ల యూనిట్లకు ఆమోదం లభించిందన్నారు. 102 మంది లబ్ధిదారులను ఎంపికచేశామన్నారు. గుడుంబాపై ఆధారపడిన వారిలో 224 మందికి యూనిట్లను మంజూరు చేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.