close

గురువారం, డిసెంబర్ 12, 2019

ప్రధానాంశాలు

ఆత్మవిశ్వాసం వెల్లివిరియాలి

భద్రాద్రి బాలోత్సవంలో ఐటీడీఏ పీవో గౌతమ్‌

ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు

భద్రాచలం, న్యూస్‌టుడే: నేటి సమాజంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే సామర్థ్యమే నిజమైన విద్య అని ఐటీడీఏ పీవో గౌతమ్‌ అన్నారు. అక్షరాస్యతను పెంచడంతోపాటు నవీన ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మార్పులపై అవగాహన అవసరమని ఆయన పేర్కొన్నారు. తాళ్లూరి పంచాక్షరయ్య ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తానా, ఐటీసీ, భాషా సాంస్కృతిక శాఖ, సంగీత అకాడమీ, ప్రభుత్వ సహకారంతో మూడు రోజుల పాటు భద్రాద్రి బాలోత్సవం కొనసాగుతుంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో తొలి రోజైన శుక్రవారం బాలల పండుగ అట్టహాసంగా ఆరంభమైంది. గాలిబుడగలతో పాటు జెండాను ఎగురవేసి జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ చాలా మంది పిల్లల్లో ప్రతిభ ఉన్నప్పటికీ వేదికపైకి వెళ్లాలంటే తెలియని భయం ఉంటుందని దాన్ని జయించేందుకు ఇలాంటి సంబరాలు ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం వెల్లివిరియాలంటే ఇలాంటి ఉత్సవాలు అవసరమని తెలిపారు. పోటీ పడితేనే మనపై మనకు నమ్మకం కలిగి భవిష్యత్తులో రాణించేందుకు మార్గం ఏర్పడుతుందని చెప్పారు. తాను 5వ తరగతి నుంచి ఇలాంటి వేదికలపై ప్రదర్శనలు ఇవ్వడం వల్ల జీవితానికి ఎంతో మేలు చేకూరిందని పీవో వివరించారు.

నైతిక సంపదను అందించాలి: తాళ్లూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి విజ్ఞాన ప్రపంచానికి వారధులని తెలిపారు. నైతిక సంపదను చిన్నారులకు ఇవ్వగలిగితే మన దేశం సుసంపన్నం అవుతుందని వెల్లడించారు. ప్రతీ ఓటమి విజయాన్ని చేరుకునేందుకు మార్గంగా మారాలన్నారు. విలువలను నేర్చుకోవడమే నిజమైన ధనమని వెల్లడించారు. కన్వీనర్‌ ఎన్సీహెచ్‌ చక్రవర్తి ఈ ఉత్సవాల వివరాలను వెల్లడించారు. 150కి పైగా పాఠశాలల నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌ నుంచి వేలాది మంది విద్యార్థులు వచ్చారని తెలిపారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు మూడు విభాగాలలో పోటీలను ఏర్పాటు చేసినట్లు విశ్లేషించారు.

అంబరాన్నంటిన సంబరాలు

బాలోత్సవ్‌ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పొదెం వీరయ్య నిర్వాహకులను అభినందించారు. పీవోతో కలిసి ఉత్సవాల జెండాను ఎగుర వేశారు. కొత్తగూడెంలో సుదీర్ఘ కాలం బాలోత్సవాన్ని నిర్వహించిన డా.రమేశ్‌బాబు మాట్లాడుతూ జ్ఞానం అలవడాలంటే బాలల సంబరాలు దోహద పడతాయని పేర్కొన్నారు. తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌, పాకాల దుర్గాప్రసాద్‌, ఐటీసీ ప్రతినిధి చెంగల్రావు, వల్లూరిపల్లి వంశీకృష్ణ, తిప్పన సిద్దులు, అలీంఖాన్‌, అల్లం నాగేశ్వరరావు, నరసింహరావు, లక్ష్మీనారాయణ, భూపతిరావు, అజీమ్‌, మాధవరెడ్డి, ఎ.జగదీశ్‌, శ్రీనివాసరావు, శాంతమ్మ, సమ్మయ్య వేడుకల్లో పాల్గొని చిన్నారులకు ఉత్సాహం నింపారు. పలు రకాల నృత్యాలతో చిన్నారులు సందడి చేశారు. ఏక పాత్రాభినయం అలరించింది. తెలుగు భాషపై పట్టును ప్రదర్శించే రచనా పోటీలు ఆసక్తిని కలిగించాయి. సంగీతం మంత్రముగ్ధులను చేసింది. నాటికలు అదరహో అనిపించాయి. బాల కళాకారులకు చూపరులు దాసోహమయ్యారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.