close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

సొంతిల్లు.. ఎంతోదూరం

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన’ దరఖాస్తులకు రెండేళ్లు

అవి ఏమయ్యాయోనని లబ్ధిదారుల్లో అయోమయం

పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే

2022 నాటికి దేశంలోని ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై)ను ప్రారంభించింది. పల్లె, పట్టణం, పేద, మధ్యతరగతి, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఉద్యోగులనే తేడా లేదు. వారి స్థోమత ఆధారంగా ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను మార్చడంతో రెండేళ్ల క్రితం నుంచి ఆశించిన విధంగా స్పందన ఉండటం లేదు. కనీసం ప్రచారం కూడా కరవైంది. గ్రామీణ ప్రాంతాల్లో దీని ఊసే వినిపించడం లేదు. ఉద్యోగులు, అక్షరాస్యులు ఎక్కువగా ఉన్న పట్టణాల్లో సైతం దరఖాస్తులు రావడం లేదు. రెండు జిల్లాల్లో కలిపి కనీసం 25 వేల దరఖాస్తులు కూడా రాలేదు. స్వీకరించిన దరఖాస్తులు ఎవరు తీసుకెళ్లారు? ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయి? ఏ దశలో ఆగాయి? ఇంటి నిర్మాణాలను ఎప్పుడు ప్రారంభిస్తారు? అసలు జరుగుతాయా? జరగవా? అన్న సందేహాలు ప్రస్తుతం దరఖాస్తుదారుల్లో నెలకొన్నాయి. ‘సొంతింటి కల’ నెరవేర్చుకోవాలన్న తపన ఉన్న వారి దుస్థితి ఇది. కేంద్రం నేరుగా ఇళ్ల నిర్మాణం పర్యవేక్షించే పరిస్థితి లేకపోవడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇందులో భాగస్వాములు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే గృహ నిర్మాణ పథకాలకు దీన్ని అనుసంధానం చేసి లక్ష్యసాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు.

స్లాబులు.. 3 రకాలు

సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ముఖ్యంగా పథకాన్ని 3 భాగాలుగా విభజించారు. మొదటిది.. ‘క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ స్కీం’. రెండు.. ‘ఎఫర్టబుల్‌ హౌజింగ్‌ ఆన్‌ పార్టనర్‌షిప్‌’, మూడు.. ‘సెల్ఫ్‌ కన్‌స్ట్రక్షన్‌’.

* క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ స్కీం: ఇంటిని నిర్మించుకోవడానికి స్థలం ఉండి, ఆర్థికంగా వెనుకబడిన వారికి వర్తిస్తుంది. మెప్మాలు బ్యాంకుల ద్వారా ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే రుణాన్ని అందజేస్తారు. రుణాలను తీసుకున్న వారికి వడ్డీ రాయితీ ఉంటుంది.

ఉదా: రూ.3 లక్షలు రుణం అవసరమైతే రూ.1.50 లక్షల వరకు రాయితీ వర్తిస్తుంది. ప్రస్తుతం ఇంటి నిర్మాణాలకు బ్యాంకు వడ్డీ రేటు రూ.10 అనుకుంటే.. ఈ పథకం కింది రుణానికి 6.5 శాతం వడ్డీ అమలు చేస్తారు.

ఎఫర్టబుల్‌ హౌజింగ్‌ ఆన్‌ పార్టనర్‌షిప్‌: ఈ పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రెండు పడక గదుల పథకంలా ఉంటుంది. ఇందులో లబ్ధి పొందాలంటే కేవలం అద్దె ఇళ్లలో నివాసం ఉన్నవారు మాత్రమే అర్హులు. ప్రభుత్వమే స్థలాన్ని గుర్తించి, అర్హులైన వారికి అపార్ట్‌మెంట్లను నిర్మిస్తుంది. లబ్ధిదారుల వివరాల ప్రకారం ప్లాట్లను పంపిణీ చేస్తారు. ఈ పద్ధతిలో ఇల్లు సొందాలంటూ చాలా సమయం పడుతుంది.

సెల్ఫ్‌ కన్‌స్ట్రక్షన్‌...: కొంతమేర ఇంటిని నిర్మించుకుని లేదా కేంద్రం ఇచ్చే రూ.లక్షన్నరతో ఇంటిని నిర్మించుకోవాలనుకునే వారికి సదావకాశం. వీరికి బ్యాంకులు రుణాలు అంటూ ఏమీ ఉండవు. నేరుగా కేంద్రం ఇచ్చే నగదుతోనే ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది.

నిధుల రాయితీ.. మౌలిక వసతులు

పట్టణాల్లో ఇళ్లకు ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(అర్బన్‌) లేదా ‘పీఎంయూవై(యూ)’, పల్లెల్లో నిర్మాణాలకు ‘పీఎంఏవై గ్రామీణ్‌’ పేరుతో పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. పీఎంఏవై(యూ)లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులను ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈడబ్ల్యూఎస్‌), అల్పాదాయ వర్గాలు(ఎల్‌ఐజీ), మధ్య ఆదాయ వర్గం-1(ఎంఐజీ-1), మధ్య ఆదాయ వర్గం-2(ఎంఐజీ-2)గా వర్గీకరించారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.6 లక్షల వరకు రుణ సదుపాయం బ్యాంకుల ద్వారా కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈడబ్ల్యూఎస్‌కు రూ.3 లక్షల వరకు, అల్పాదాయ వర్గానికి రూ.2.67 లక్షలు, ఎంఐజీ-1కి రూ.2.35 లక్షలు, ఎంఐజీ-2కి రూ.2.30 లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. మిగతా రుణాన్ని 6.5 శాతం వడ్డీతో 15 - 20 ఏళ్ల పాటు చెల్లించే వెసులుబాటును కల్పించారు. ‘పీఎంఏవై’లో నిర్మించే ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.12 ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేసి 90 రోజుల పనిని కేటాయిస్తారు. దీంతో రూ.18 వేలు అదనంగా లబ్ధి కలుగుతుంది.

23,700 దరఖాస్తులు

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి పట్టణ పరిధిలో దరఖాస్తులను స్వీకరించే బాధ్యతలను మెప్మాకు అప్పగించారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి స్లాబుల వారీగా విభజించి భద్రపరచాలని ఆదేశించారు. ఉభయ జిల్లాల్లోని ఆరు పురపాలక సంఘాలు.. ఒక కార్పొరేషన్‌ పరిధిలో 2017లో మొత్తం 23,700 దరఖాస్తులను స్వీకరించారు. ఏడాది క్రితం హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఓ కన్సల్టెన్సీ ప్రతినిధులు దరఖాస్తులన్నింటినీ గోనే సంచుల్లో మూటకట్టి తీసుకెళ్లినట్లు ఇక్కడి అధికారులు చెబుతున్నారు. రెండేళ్లు గడుస్తున్నా వాటి పురోగతిపై ఎలాంటి స్పందనలు లేవు. ఇంటి నిర్మాణానికి సంబంధించి సూచనలు అందలేదు.

‘రెండు పడక గదులూ’ ఆలస్యమే!

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణంలో రూ.1.50 లక్షలు రాయితీ ఇవ్వనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో దీనిని కలిపేసింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రూ.5.04 లక్షలు కేటాయిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్ని ఇందులో కలిపితే ఒక్కో ఇంటిపై రాష్ట్ర ప్రభుత్వానికి పడే భారం మూడోవంతు తగ్గిపోతుంది. గ్రామీణంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడం.. స్థల సేకరణ, లబ్ధిదారుల ఎంపికలో తీవ్ర జాప్యంతో అందరికీ ఇళ్లు లక్ష్య సాధన ఆలస్యమవుతోంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.