close

సోమవారం, డిసెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు

 ఎల్‌ఎండీ చెంతన మార్కెట్‌ నిర్మిస్తాం
 సబ్బండవర్గాల సంక్షేమమే లక్ష్యం
 మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌ న్యూస్‌టుడే- కరీంనగర్‌ పట్టణం

పేదవర్గాల ప్రజల్లో సంపదను సృష్టించే అవకాశాల్ని కల్పించాలని..మత్స్య కారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతోనే తమ సర్కారు ఎన్నో సంక్షేమ పథకాల్ని అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్థక,మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌ సమీపంలోని ఎల్‌ఎండీలో 30లక్షల రొయ్య పిల్లలని నీటిలో విడుదల చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన ఎల్‌ఎండీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా జలాశయంలో రొయ్యల్ని వదిలారు.అనంతరం మానేరు ఆనకట్టపై నుంచి నీటి నిల్వ తీరుని గమనించారు. తరువాత లేక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద మత్స్యకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ రొయ్యల పెంపకాన్ని మొదటి సారిగా కరీంనగర్‌ నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి మేలు జరుగుతుందనేందుకు సీఎం కేసీఆర్‌ పాలనే నిదర్శనమన్నారు. ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ద్వారా కళ్ల ముందర జలవనరుల్ని కళకళలాడేలా చేసిన ఘనత సీఎందేనన్నారు. కాశ్వేరంపై విమర్శలు చేసే నాయకులు ఒక్కసారి కరీంనగర్‌కు వచ్చి ఎల్‌ఎండీలోని జలకళను చూడాలని ఆయన హితవు పలికారు. సమృద్ధిగా జలాలు ఉంటే మత్స్యకారులకు ఊహించని మేలు జరుగుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభత్వాలు వీరిని పూర్తిగా విస్మరించాయని తమ ప్రభుత్వ హయంలో ఈ సారి 61 కోట్ల చేప పిల్లల్ని చెరువుల్లో పెంచేందుకు ఉచితంగా అందించామని చెప్పారు. అంతేకాకుండా మార్కెటింగ్‌ సదుపాయాల్ని కల్పిస్తున్నామని 75 శాతం రాయితీతో వాహనాల్ని అందించిన విషయాన్ని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో మునుపెన్నడు లేనివిధంగా మత్స్యశాఖలో పలు ప్రజోపయోగ పథకాల్ని అమలు చేస్తున్న తీరుని చూసి ఇటీవలే హైద్రాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కితాబునిచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. గొల్లకుర్మ సంఘాల మాదిరిగానే త్వరలో మత్స్యకారుల సంఘాలకు ఎన్నికల్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంలోనే తమకు చేపలను పట్టే విషయంలో ఇబ్బందులవుతున్నాయని గంగపుత్ర, ముదిరాజ్‌ సంఘాల నాయకులు మంత్రి ఎదుట తమ వేదనను విన్నవించే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి కల్పించుకుని ఇక మీదట ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని కొందరు వ్యక్తుల స్వార్థం వల్లనే గతంలో ఇబ్బందులు తలెత్తాయని ఇక మీదట ఇలాంటి చర్యల్ని ఉపేక్షించమని, అన్నింటా పారదర్శకత పెంచుతామని మంత్రి తెలిపారు. దళారులపై క్రిమినల్‌ కేసుల్ని పెడతామన్నారు.

కరీంనగర్‌ కేంద్రంగా ప్రగతి..
కరీంనగర్‌ జిల్లా కేంద్రంగా మత్స్య, పాడిపరిశ్రమల పురోగతికి తమవంతు సహకారాన్ని అందిస్తామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే కరీంనగర్‌ ఎల్‌ఎండీ చెంతన ఒక ఎకరం స్థలాన్ని కేటాయిస్తే వెంటనే ఇక్కడ మార్కెట్‌ని నిర్మించేందుకు నిధుల్ని మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ విషయమై అనువైన స్థలాన్ని పరిశీలించాలని పక్కనే ఉన్న పాలనాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ను ఆదేశించారు. ఇదే సమయంలో చేపల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. అంతకుముందు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగాలని, కులవృత్తులకు చేయూతనివ్వాలనేదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. నిండుకుండలా మారిన ఎల్‌ఎండీ ఏడాదిపాటు కాళేశ్వరం జలాలతో కళకళలాడుతుందని అన్నారు.  గతానికి భిన్నంగా చేపల ఉత్పత్తుల విషయంలో జిల్లా సమీప భవిష్యత్తులోనే ఆదర్శంగా నిలువబోతుందని మంత్రి ప్రకటించారు.మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఏడాది గణనీయంగా చేప పిల్లల పెంపకం విషయంలో పురోగతి కనిపిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు దరిచేరుతుండటంతో అన్నివర్గాల ప్రజలు ఆనందంగా ఉంటున్నారని అన్నారు. పాలనాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ జిల్లాలో మత్స్యశాఖ ద్వారా అమలవుతున్న పథకాల్ని పక్కాగా లబ్ధిదారులకు చేరవయ్యేలా చూస్తున్నామన్నారు. సమావేశం అనంతరం పలువురు రైతులకు పాడిగేదెల్ని పంపిణీ చేశారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి అధికారులు శ్రీనివాస్‌రావు, రాంచందర్‌రావు, అశోక్‌, ఖాదీర్‌పాషతోపాటు పలువురు గంగపుత్ర, ముదిరాజ్‌ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.