close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

తరుగు పేరిట.. స్వాహా!

 మార్కెట్లలో యథేచ్ఛగా దోపిడీ
 వేల క్వింటాళ్లు పక్కదారి.. నగదు కోత
 మోసాలకు గురవుతున్న అన్నదాత
న్యూస్‌టుడే, కరీంనగర్‌ వ్యవసాయం

అక్షరాలా వేల క్వింటాళ్లలో దోపిడీ జరుగుతోంది.. అదేదో దళారులో, ఖరీదుదారులో అనుకుంటే పొరపాటే.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు,  వ్యవసాయ మార్కెట్లలోనే దర్జాగా దందా సాగుతోంది. తరుగు పేరిట రైతుల శ్రమను పిండేస్తుండగా, సొమ్ము ఎవరి ఖాతాకు వెళ్తుందో మరి.. అసలే అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నకు వ్యవసాయ మార్కెట్లు సాంత్వనగా నిలవాల్సిందిపోయి దోపిడీలో ఆరితేరడం విడ్డూరం.. చిల్లర పేరుతో జరుగుతున్న మహాదోపిడీ ఇది. ఇందులో పలువురి హస్తం ఉండగా, ఎవరికి వారికి   వాటాలుంటాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తా 40.580 కిలోలు తూకం వేయాలి. కానీ 40.800 కిలోలు తూకం వేస్తున్నారు. ఇక రైతు ఆదమరిస్తే 41 కిలోల వరకు తూకం వేస్తున్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో 41, 42 కిలోలు తూకం వేస్తున్నారు. ఒక్కొ బస్తాకు 40.800 కిలోలు లెక్కకట్టినా 220 గ్రాములు అదనం కాగా, క్వింటాలుకు 550 గ్రాములు దోచేస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటికే 77,700 క్వింటాళ్ల వరకు ధాన్యం కొనుగోళ్లు జరగ్గా.. 42,735 కిలోలు అంటే 4,273 క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లే.. కనీస మద్దతు రూ.1835 కాగా, రూ.78.40 లక్షలు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నట్లు..?

అదనపు తూకం.. ఎవరికి లాభం: మక్కలు, ధాన్యం, పత్తి తూకం వేసే ఖాళీ బస్తా బరువు కేవలం 450-500 గ్రాములే.. కానీ 300, 500ల గ్రాములు అదనంగా తూకం వేస్తున్నారు. జిల్లాలో కరీంనగర్‌, జమ్మికుంట, చొప్పదండి, గోపాల్‌రావుపేట, హుజూరాబాద్‌ వ్యవసాయ మార్కెట్లలో ప్రాథమిక సహకార సంఘాలు ధాన్యం కొనుగోలు చేస్తుండగా జిల్లా అంతటా దాదాపు రెండు, మూడు గ్రామాలకొకటి చొప్పున ఐకేపీ నిర్వాహకులు ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ‘న్యూస్‌టుడే’ తూకం తీరును పరిశీలించగా బస్తా 40.800 కిలోలు తూకం వేస్తుండగా ఎవరూ లేకుంటే 41 కిలోలు తూకం వేస్తున్నారు. ఇదేంటని తూకం వేసేవారిని ప్రశ్నిస్తే గతంలోనూ ఇలాగే తూకం వేశామని, ఇప్పుడు అలాగే చేస్తున్నామని బహిరంగంగా చెబుతున్నారు. ఐకేపీ 72 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించగా పీఏసీఎస్‌ 91 కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోంది. కొనుగోళ్లు ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు జరిగిన లెక్క ప్రకారం కనిష్ఠంగా లెక్క వేసినా అక్షరాల రూ.70 లక్షలు దోచుకున్నారు. బస్తా బరువు 40.580 కిలోలు తూకం వేయాలని సిబ్బందిని ఆదేశించామని, అంతకుమించి తూకం వేయరాదని ఐకేపీ డీపీయం పద్మయ్య వివరించారు. ఇదిలాఉండగా తేమశాతం ఉంటేనే కొనుగోలు చేస్తున్నారు.నిబంధనల ప్రకారం తేమ ఉన్నప్పుడు ఎన్ని రోజులు నిల్వ చేసిన తరుగు పోదన్నది పౌరసరఫరాలశాఖలోని నిపుణుల మాట. మరి అలాంటపుడు ఎందుకీ తరుగు.. ఎవరి కోసం..?

ఈనామ్‌ సాక్షిగా దందా - ఆగని నగదు కోత
వ్యవసాయ మార్కెట్లలో మక్కలు, పత్తి కొనుగోళ్లలోనూ ఇదే పరిస్థితి. మక్కల కొనుగోలులో 60.580 కిలోలు తూకం వేయాల్సి ఉండగా 60.800, 60.900 కిలోలు తూకం వేస్తున్నారు. మక్కలు, పత్తి కలిపి 60వేల క్వింటాళ్ల వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ లెక్కన రూ.40లక్షల వరకు ఎవరికి చేరుతాయన్నది శేషప్రశ్న. ఈనామ్‌లో వివరాలు నమోదవుతుండగా బలవుతున్నది రైతు మాత్రమే.. తూకానికి మించి తూకం వేస్తుండగా వేల క్వింటాళ్లు అప్పనంగా కోల్పోతున్నారు. కరీంనగర్‌, జమ్మికుంట, చొప్పదండి మార్కెట్లలో వ్యాపారులు పత్తి, మక్కలు కొనుగోలు చేస్తున్నారు. పత్తికి బస్తాకు కిలో తరుగు తీసేస్తుండగా నగదు కోత విధిస్తున్నారు. వందకు రూపాయి చొప్పున కోత విధిస్తుండగా వ్యవసాయ అధికారులు కిమ్మనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పత్తికి తరుగుతో పాటు నగదు కోతతో రైతు ఖర్చు తడిసిమోపెడవుతోంది.

చర్యలు తీసుకుంటాం - పద్మావతి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి
నగదు కోత పెడితే సహించేదిలేదు. రైతులొచ్చి ఫిర్యాదు చేస్తే ఆ వ్యాపారి లైసెన్స్‌ రద్దు చేస్తాం. అదనపు తూకం వల్ల రైతుకు లాభమే.. అయినా పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.