శనివారం, డిసెంబర్ 07, 2019
● మంత్రుల ఇళ్లను ముట్టడించిన విద్యార్థి నాయకులు
ఆలూరులో బైఠాయించిన విద్యార్థులు, నాయకులు
ఆలూరు, న్యూస్‌టుడే : రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ రాయలసీమకు న్యాయం చేయాలని రాయలసీమ విద్యార్థి, యువజన సంఘ జిల్లా నాయకులు ప్రకాశ్, కృష్ణ కోరారు. రాయలసీమలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ శనివారం విద్యార్థులతో కలసి ఆలూరులోని మంత్రి గుమ్మనూరు జయరాం ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటి వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేసినా అభివృద్ధి చేయలేకపోయారని అన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టుతో పాటు రాయలసీమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇదే విధంగా కృష్ణ, తుంగభద్ర నదుల్లో రాయలసీమకు పది సంవత్సరాల పాటు నీటి వాటా హక్కు కల్పించాలని, అసెంబ్లీ స్థానాలు పెంచాలని, కేంద్ర, రాష్ట్ర విద్యా సంస్థలు పెట్టాలని డిమాండు చేశారు. అనంతరం గుమ్మనూరు నారాయణస్వామి, గుమ్మనూరు శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.
మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి
బేతంచెర్ల, న్యూస్‌టుడే: కర్నూలులో రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ చేయాలని రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులు శ్రీరాములు, మహేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. శనివారం రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. పట్టణంలోని వివేకానంద, శ్రీతేజ జూనియర్ కళాశాలల విద్యార్థులు పాతబస్టాండు నుంచి ర్యాలీగా వెళ్లి మంత్రి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు రాజధాని లేదా హైకోర్టు కోరే హక్కు ఉందన్నారు. కృష్ణ, తుంగభద్ర నదుల్లో రాయలసీమకు 10 సంవత్సరాల పాటు నీటివాటా హక్కు కల్పించాలని, ఆంధ్రకు సరిసమానంగా రాయలసీమలో శాసనసభ స్థానాలు పెంచాలని, కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థలు పెట్టాలని డిమాండు చేశారు. ఈనెల 22న తాడేపల్లె గూడెంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ కేశవరెడ్డి, ఎస్సై సురేశ్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
బేతంచెర్లలో ధర్నా చేస్తున్న విద్యార్థులు
తాజా వార్తలు
జిల్లా వార్తలు