శుక్రవారం, డిసెంబర్ 13, 2019
ప్రాంగణ ఎంపికల్లో 750 మంది ఎంపిక
ప్రాంగణ ఎంపికల్లో ఏర్పాటు చేసిన స్టాళ్ల వివరాలు తెలుసుకుంటున్న అభ్యర్థులు
జగన్నాథపురం, న్యూస్‌టుడే: చదువుకునే సమయంలో ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే, ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేకేసీ, వికాస, ద్వారంపూడి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన ఉద్యోగమేళాను ఆయన ప్రారంభించారు. విద్యార్థి దశలోనే ఉద్యోగాలు పొందడానికి ప్రాంగణ ఎంపికలు చక్కని వేదికలన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మూడు లక్షల వాలంటీర్లు, 1.40 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. కలెక్టర్ మురళీధర్‌రెడ్డి వివిధ సంస్థల ప్రాంగణ ఎంపికలను ప్రారంభించిన తరువాత మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగమేళాకు 3,000 మంది హాజరవ్వగా 750 మంది వివిధ సంస్థలకు ఎంపికయ్యారన్నారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చప్పిడి కృష్ణ, జేకేసీ సమన్వయకర్త పి.వి.కృష్ణారావు, ద్వారంపూడి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కార్పొరేటర్లు చంద్రకళాదీప్తి, సుజాత, మాజీ మేయర్ కె.సరోజ తదితరులు పాల్గొన్నారు.
ఎంపికలకు వస్తున్న యువత
తాజా వార్తలు
జిల్లా వార్తలు