వీవీల భవితవ్యమేమిటి..?నూతన ఉపాధ్యాయుల రాకతో సందిగ్ధం
ఖాళీలు ఎక్కువగా ఉండటంతో సర్దుబాటు
తదుపరి చర్యలపై స్పష్టత కరవు
కామారెడ్డి విద్యా విభాగం, న్యూస్‌టుడే:

నూతన ఉపాధ్యాయుల రాకతో విద్యా వాలంటీర్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. బోధకులు లేని చోట వీవీలు అండగా నిలిచారు. ఇటీవల కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరడంతో వీవీలను తొలగించాలా..? లేక అధికంగా ఉన్న ఖాళీల దృష్ట్యా కొనసాగించాలా..? అన్న విషయంలో స్పష్టత కరవైంది. ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కువగా ఉండటంతో వీవీలను సర్దుబాటు చేస్తామని అధికారులు చెబుతున్నటికీ అభ్యర్థులో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు 540 పోస్టుల భర్తీకి రెండేళ్ల క్రితం ప్రకటన విడుదలైంది. ప్రవేశ పరీక్ష, ఫలితాల వెల్లడి, నియామకాలు చేపట్టే సరికి రెండేళ్లు గడిచింది. వాస్తవానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 1100లకు పైగా ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. మొదట రాష్ట్ర వ్యాప్తంగా 16వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామన్నా తీరా 8,792 పోస్టుల భర్తీకి కసరత్తు చేశారు. ఇందులో 380 పోస్టులు కామారెడ్డి జిల్లాకు కేటాయించారు. మిగతా 160 పోస్టులు నిజామాబాద్‌కు అందుబాటులో ఉంచారు. ఉపాధ్యాయుల భర్తీ ఆలస్యం దృష్ట్యా విద్యా వాలంటీర్ల నియామకాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో బోధకులు లేని చోట వీవీలు సేవలందించారు. వీరికి వేతనాలు రూ.8,500 నుంచి రూ.12 వేలకు పెంచారు. దీంతో వారు ఉత్సాహంగా విధుల్లో చేరారు.
తొలగింపా.. కొనసాగింపా..?
ప్రస్తుతం ఉన్న వీవీలను విద్యా సంవత్సరం మధ్యలో తొలగించాలా.. లేక కొనసాగించాలా..? అన్న సందిగ్ధం నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 300 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. ఈ సారి ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు కొత్తగా గురువులు బాధ్యతలు స్వీకరించారు. మారుమాల ప్రాంతాల్లో ఉపాధ్యాయుల ఆవశ్యకత ఉంది. విద్యార్థులు అధికంగా ఉన్న చోట బోధకులు తక్కువగా ఉన్నారు. బోధకులు ఎక్కువగా ఉన్న చోట విద్యార్థులు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో
విద్యార్థులను సర్దుబాటు చేయడం జరిగితే పాఠశాలల సంఖ్య కుదించే అవకాశాలున్నాయి.
ప్రాథమికోన్నత ఉండదిక
ఉమ్మడి జిల్లాలో ప్రాథమికోన్నత పాఠశాలలను విలీనం చేసే దిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 350 పాఠశాలల వరకు ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఉపాధ్యాయుల అవసరం తగ్గనుంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని ప్రకటించిన యంత్రాంగం విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వీవీలు విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు విధుల్లో కొనసాగుతారో లేదో సందిగ్ధం నెలకొంది.
పాత వారిని తొలగించొద్దు
-నాగరాజు, వీవీల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఈ విద్యా సంవత్సరం వీవీలను విధుల్లో నుంచి తొలగించొద్ధు హైకోర్టు తీర్పు మేరకు గత ఏడాది పని చేసిన వారికి అవకాశం కల్పించారు. ఉపాధ్యాయులు విధుల్లో చేరిన చోట వీవీలను సర్దుబాటు చేయాలి. నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేయొద్ధు.
-రాజు, డీఈవో, కామారెడ్డి

ఇప్పటి వరకు విద్యా వాలంటీర్లను ఎవరినీ తొలగించలేదు. కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరినా అవసరం ఉన్న చోట వీవీలను సర్దుబాటు చేస్తాం. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్న చోట పాత వారిని కొనసాగిస్తాం. ప్రభుత్వం నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
ఉమ్మడి జిల్లాలో విధుల్లో చేరిన వారు
ఎస్జీటీలు 142
ఎస్ఏ 62
విద్యా వాలంటీర్లు
కామారెడ్డి: 701
నిజామాబాద్: 430