close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

అసలేం జరుగుతోంది

●ఆర్‌యూ ఉప కులపతి రాజీనామా

 ●ఇటీవలే తప్పుకున్న రిజిస్ట్రార్‌

 

 

 

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : రాయలసీమ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎ.వరప్రసాదరావు రాజీనామా చేశారు. ఆయన తన పదవీకాలం పూర్తి కాకముందే తప్పుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ఉప కులపతుల్లో చివరిగా మిగిలినవారిలో ఈయనొక్కరే. వరప్రసాదరావును గత ప్రభుత్వం 2018లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా ఆగస్టు 3న విధుల్లో చేరారు. నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. కాగా పదవి నుంచి తప్పుకోవాలంటూ రెండు నెలల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట నగరంలో ఆర్‌యూకు చెందిన ఇంటిని ఖాళీ చేసి సొంత జిల్లాకు వెళ్లిపోయారు. ముందుగానే రాసుకున్న రాజీనామా లేఖను ఉన్నతాధికారులకు అందించేందుకు ప్రయత్నించగా నిబంధనల ప్రకారం ఫ్యాక్స్‌ ద్వారా పంపాలని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం గవర్నరు, ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్‌, ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఫ్యాక్స్‌ ద్వారా తన రాజీనామా లేఖను పంపనున్నారు. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో రిజిస్ట్రార్‌ రాజీనామా చేసిన విషయం తెలిసింది. వారం గడవక ముందే ఉప కులపతి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పరిణామాలతో వర్సిటీలో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

రూసా నిధులు వచ్చేలా కృషి: వీసీగా వరప్రసాదరావు బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే మంచిపేరు తెచ్చుకున్నారు. వర్సిటీ అనుబంధంగా ఇంజినీరింగ్‌ కళాశాల వచ్చేలా ప్రముఖ పాత్ర వహించారు. వర్సిటీకి వచ్చినప్పటి నుంచి ఆర్‌యూ కళాశాలను ఆర్ట్స్‌, సైన్సు, ఇంజినీరింగ్‌ కళాశాలలుగా విభజించారు. వర్సిటీకి రూసా నిధులు తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. సౌమ్యుడిగా గుర్తింపు పొందుతూనే పరిపాలనపరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యారు. వర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పలేకపోయారన్న విమర్శలున్నాయి. వర్సిటీ అభివృద్ధికి సరికొత్త నిర్ణయాలు తీసుకోవాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవడంతో దానిని విరమించుకున్నారు. ఆయన సోమవారం విజయవాడ నుంచి ఫ్యాక్స్‌ ద్వారా రాజీనామా పత్రాన్ని పంపిన అనంతరం ఆమోదం పొందాల్సి ఉంది. కొత్త ఉప కులపతి నియామకం జరిగేంతవరకు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ పాలనలో వర్సిటీ కొనసాగనుంది.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.