close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

అపర గంగకు ఆధ్యాత్మిక వైభవం

 మహాహారతితో నదీ జలాల పరిరక్షణకు బాటలు
 ఏడేళ్లుగా ధర్మపురిలో నిర్వహణ.. ఈ నెల 24న ఉత్సవం
న్యూస్‌టుడే, ధర్మపురి

గోదావరి మహాహారతి అంటేనే ధర్మపురి క్షేత్రం స్ఫురిస్తుంది. కాశీలో గంగా నదీ తీరంలో నిర్వహించే హారతి తరహాలో అక్కడి వేద పండితులచే ధర్మపురిలో గోదావరికి ఏడేళ్లుగా మహాహారతి ఇస్తున్నారు. ఈ సారి ఉత్తరప్రదేశ్‌ నుంచి సాధువులు, కాశీ వేద పండితులు, త్రిదండి చిన్నజీయర్‌స్వామి హాజరవుతున్నారు. ఈ నెల 24న నిర్వహించే గోదావరి మహాహారతిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

మహాహారతి అంటే!
గోదావరి మహాహారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది వేడుకల నిర్వహణకు ధర్మపురిలోని నదీ తీరం ముస్తాబవుతోంది. 2012లో భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు కాశీ క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ ప్రతి రోజూ సాయంత్రం గంగాహారతి నిర్వహిస్తుండటాన్ని పరిశీలించిన ఆయన అదే తీరుగా ధర్మపురి క్షేత్రంలో ఎందుకు నిర్వహించకూడదని ఆలోచన చేశారు. ఈ విషయమై పండితులు, సాధువులతో చర్చించారు. కాశీకి వెళ్లలేని భక్తులకు అక్కడి ఉత్సవాన్ని వీక్షించిన అనుభూతి కలిగేలా అక్కడి పండితులతో ధర్మపురిలో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. వెంటనే కార్యరూపం దాల్చేలా అనుచర గణంతో చర్చించారు. ఫలితంగా 2012లో ధర్మపురిలో మొదటిసారిగా కాశీ పండితులతో మహాహారతి కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్తీకమాసంలో సాధువుల దర్శనం, వారి ప్రసంగాలు వినడం, కార్తీక హారతిని చూడటం ద్వారా గొప్ప అనుభూతి పొందారు. అప్పటి నుంచి కార్తీకమాసంలో చివరి ఆదివారం మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

హాజరైన ముఖ్యులు వీరే..
ఉమాభారతి(కేంద్ర మాజీ మంత్రి), ఆదిత్యనాథ్‌యోగీ(ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి), భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు గత ఉత్సవాలకు హాజరయ్యారు.

అన్ని జిల్లాల నుంచి భక్తుల రాక
ఈ నెల 24న నిర్వహించే మహాహారతి కార్యక్రమానికి ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. స్వచ్ఛందంగా వాహనాల్లో తరలిరానున్న వారికి వసతి, భోజన ఏర్పాట్లు చేస్తామని సభ్యులు పేర్కొన్నారు.

మంగళిగడ్డ వద్ద ఏర్పాట్లు
గోదావరి తీరంలోని మంగళిగడ్డ వద్ద ప్రధాన వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే స్వాముల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంగళిఘాట్‌ నుంచి మహాహారతి ఇస్తారు. అంతకుముందు ‘గోదావరి పరిరక్షణ, మన బాధ్యత’ అంశంపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తారు. అనంతరం వేదికపై బహుమతులు ప్రదానం చేస్తారు.

సంస్కృతిపై చైతన్యం తేవడమే లక్ష్యం: పొల్సాని మురళీధర్‌రావు, మహాహారతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు
‘ఇమంమే గంగే యమునే సరస్వతీ’ అంటూ రుగ్వేద కాలం నుంచి నదులను కీర్తిస్తున్నాం. గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మ, సింధూ, కావేరి నదులను స్మరించకుండా హిందువులు ఏ పనినీ ప్రారంభించరు. ఏ శుభ కార్యాన్నీ మొదలుపెట్టరు. ఇది కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు యుగయుగాలుగా వస్తున్న సంప్రదాయం. సంస్కృతిని వీడకుండా ప్రజలను చైతన్య పరచడమే కార్యక్రమం నిర్వహణ ప్రధాన లక్ష్యం. పర్యావరణ పరిరక్షణ కోణంలో నదిని అపవిత్రం చేయకుండా చర్యలు తీసుకోవడం లాంటి చర్యలు చేపట్టేలా ప్రజలను జాగృతపరుస్తున్నాం.

వేడుక నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు: వీరగోపాల్‌, మహాహారతి ఉత్సవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ధర్మపురిలో ఏడేళ్లుగా మహాహారతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 24న నిర్వహించే మహాహారతి ఉత్సవానికి వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. వేదిక, సాధువుల ఉపన్యాసాలు, మహాహారతి కార్యక్రమాలు ప్రధానమైనవి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం.

భక్తులు భాగస్వాములు కావాలి: పిల్లి శ్రీనివాస్‌, జిల్లా మహాహారతి కన్వీనర్‌
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో కార్యక్రమం నిర్వహించడం స్థానికుల ఆదర్శం. ఉత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. సాధువుల ఉపన్యాసాలు, కాశీ వేద పండితులచే మహాహారతి కార్యక్రమాన్ని కన్నులారా దర్శించవచ్చు. మహాహారతి తరఫున పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. మంగళిగడ్డ పుష్కరఘాట్‌ వద్ద విద్యుత్తు సౌకర్యాలు, మహాహారతిని నిర్వహిస్తారు.

ఈసారి రానున్న స్వాములు
ఈ ఏడాది గోదావరి మహాహారతి కార్యక్రమానికి త్రిదండి చిన్నజీయర్‌ స్వామి, ఉత్తర ప్రదేశ్‌లోని శ్రీ శంభు పంచ్‌ అగ్ని అకాడ మహంత్‌ సంపూర్ణానంద బ్రహ్మచారి స్వాములతో పాటు, సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మురళీధర్‌రావు, రాష్ట్ర కన్వీనర్‌ వీరగోపాల్‌, ముగ్గురు ఎంపీలు బండి సంజయ్‌కుమార్‌, ధర్మపురి అరవింద్‌, సోయన్‌ బాపురావు, మాజీ ఎంపీ వివేక్‌ హాజరు కానున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.