బుధవారం, డిసెంబర్ 11, 2019
1972లో జాతీయ జంతువుగా గుర్తింపు
నేడు పెద్దపులిని జాతీయ జంతువుగా ప్రకటించిన రోజు
దేశానికే తలమానికం ఎన్ఎస్టీఆర్
న్యూస్‌టుడే, ఆత్మకూరు
ఉట్టిపడే గాంభీర్యం...రూపంలో రాజసం.. అణువణువునా హుందాతనం ఇలా ఎన్నో లక్షణాలు పెద్ద పులి సొంతం. పులుల సంతతి పెంపునకు నల్లమల ఓ రక్షణ ఛత్రంగా నిలుస్తోంది. సోమవారం పెద్ద పులిని జాతీయ జంతువుగా ప్రకటించిన రోజు
దేశంలో 1972కు ముందు సింహం జాతీయ జంతువుగా ఉండేది. 1972 నవంబర్ 18 తేదీన పెద్దపులిని ప్రకటించారు. దేశంలో పులులను సంరక్షించటానికి ప్రభుత్వం 1973 ఏప్రిల్ 1న ఇందిరాగాంధీ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టును ప్రారంభించింది. 1973లో రాజీవ్‌గాందీ పులుల అభయారణ్యం ఏర్పాటై ప్రస్తుతం నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా పేరు మార్చుకుంది.
పులి ఉంటే సమతుల్యం: పులి ఉంటే అండవి సమతుల్యంగా ఉంటుంది. భౌగోళిక పిరమిడ్‌లోనూ అగ్రస్థానంలో ఉన్న పులి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అడవి బాగుంటే మనం బాగుంటాం. వర్షాలు కురుస్తాయి.
పులుల రక్షణ ఛత్రం: దేశ వ్యాప్తంగా 50 పులుల సంరక్షణా కేంద్రాలుండగా వాటిలో నల్లమల నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అతి పెద్దది గుర్తింపు పొందింది. రాష్ట్రంలో కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో నల్లమల విస్తరించింది. నల్లమలలో పులుల సంరక్షణకు అటవీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
పులుల సంరక్షణకు చర్యలు
* సరైన ఆహారం, ఆవాసం అవసరం.
* ఆహారంగా ఉపయోగ పడే జింకలు, దుప్పులు, అడవి పందుల పెరుగుదలకు అనుకూల ఆవాసం కల్పించడంతో అటవీ అధికారులు సఫలీకృతమయ్యారు.
* పెద్ద పులి చాలా వరకు మాటేసి ఆహారాన్వేషణ చేస్తుంది. పొదల్లో దాక్కుని, నీటి వనరులున్న ప్రాంతాల్లో నీరు తాగేందుకు వచ్చే జంతువులను మాటేసి పట్టుకుంటుంది.
* అడవిలోని నిషిద్ధ ప్రాంతాల్లోకి జనం వెళ్లకుండా అటవీ అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.
రారాజు రక్షణ దినదిన గండం
పులుల సంరక్షణకు అటవీ అధికారులు ఎన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నా వేటగాళ్లు పన్నిన ఉచ్చులు, పంట పొలాల రక్షణకు ఏర్పాటు చేసి తీగలు ప్రాణసంకటంగా మారుతున్నాయి. వేటగాళ్లు, చడీ చప్పుడు కాకుండా వాటిని హతమారుస్తున్నారు. వన్యప్రాణులు, అటవీ సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం 1972లో ప్రత్యేక చట్టాన్ని ప్రవేశ పెట్టింది. 1973 మార్చి 1న వైల్్్డలైఫ్ యాక్ట్ అమల్లోకి తీసుకువచ్చింది.
కొన్ని ఘటనలు
1. ఇటీవల కాలంలో నల్లమల అటవీ సమీప గ్రామాల్లో పులుల సంచారం, పలు ఘటనలు భీతిగొలుపుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ 1న రుద్రవరం రేంజి పరిధిలోని టీజీపీ ఉపకాలువలో గుర్తించిన పులి మృతికి కారణాలు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలాయి.
2. 2017 నవంబర్‌లో వెలుగోడులో రెండు పిల్లలతో పంట పొలాల్లోకి ప్రవేశించిన పెద్దపులి హల్చల్ సృష్టించింది. తల్లి పులి అడవిలోకి పారిపోగా పిల్లల్లో ఒకటి సజీవంగా అటవీ అధికారులకు పట్టుబడింది. మరొకటి మృత కళేబరంగా అధికారులకు చిక్కింది. పిల్ల పులి మృతిపై సందేహాలు ఇంతవరకూ నివృత్తి కాలేదు.
3. 2012లో ఆత్మకూరు మండలం సిద్ధాపురంలోకి ప్రవేశించిన రెండు పెద్దపులులు జంతువులను ఎత్తుకెళ్తూ రెండు నెలలకు పైగా హల్చల్ సృష్టించాయి. వాటిని అడవిలోకి పంపేందుకు అధికారులు విశ్వ ప్రయత్నం చేశారు. బోనులు ఏర్పాటు చేసినా చిక్కలేదు. నెలల తరబడి అలజడి సృష్టించిన పెద్దపులులు ఉన్నట్టుండి ఒక్కసారిగా గ్రామం వైపు రావటం మానేశాయి. అడవిలోకి వెళ్లాయని అధికారులు చెబుతుండగా వాటిని కొందరు ఆగంతకులు హతమార్చారని వాదనలు అప్పట్లో వినిపించాయి.
4.2015లో మండలంలోని వెంకటాపురం వద్ద పొదల్లోకి వచ్చిన బక్కచిక్కిన పులిని అటవీ అధికారులు తిరుపతి జూకు తరలించారు.
5. 2013లో ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని ముష్టపల్లి బీట్, శివపురం బీట్లలో ఒక్కొక్కటి చొప్పున రెండు పెద్దపులులు మృతి చెందాయి. రైతులు అడవి పందులు రాకుండా పొలాలకు పెట్టిన ఉచ్చుల్లో చిక్కి ఇవి మృతి చెందాయి. పులి వధ కేసు తమ మెడకు చుట్టుకుంటుందని రైతులు గుట్టుచప్పుడు కాకుండా వాటిని కాల్చివేశారు.
ఆవాసం ప్రాణ సంకటం
నల్లమల అటవీ పరిధిలోని శ్రీశైలం రేంజ్ పెచ్చెర్వు బీట్ నరమామిడి చెరువు ప్రాంతంలో మార్చి 27న గుర్తించిన ఓ పెద్ద పులి జీవన పోరాటంలో ఓడి మృతి చెందినట్లు అధికారులు సూచించారు. రెండు పులుల మధ్య ఆవాసం కోసం ఆధిపత్య పోరాటంలో గాయపడిన పెద్ద పులి కోలుకోలేక మృతి చెందింది. తల్లి చాటు బిడ్డగా పెరిగిన పులులకు యుక్తవయస్సులో ఆవాసం ఎంపికే ప్రాణ సంకటం. తాను ఎంచుకున్న ప్రాంతంలో మరో పులి తిరగకుండా అడ్డుకోవాల్సి ఉంటుంది. ఇంకో పులి తిరుగుతున్న ప్రాంతాన్ని ఆక్రమించాలంటే దాని కంటే బలమైనదై ఉండాలి. ఎదుటి పులిపై దాడి చేసి దాన్ని బెదిరించి పంపివేయడమో.. పోరాటంలో ఏదో ఒకటి చావటమో జరగాలి. అలాంటి ఘటనే ఈ ఏడాది మార్చి 27న గుర్తించిన పులి విషయంలో జరిగింది. 2016-17 మార్కాపురం ఆత్మకూరు అటవీ పరిధిలోని పులిచెరువు జంక్షన్ ప్రాంతంలో కెమెరాట్రాప్లో చిక్కిన రెండు పులి పిలల్లో మృతి చెందిన పులిని చారల ఆధారంగా గుర్తించారు.
పులుల సంరక్షణ అందరి బాధ]్యత
- సంబాగి వెంకటేష్ డీఎఫ్ఓ
అనుమతుల్లేనిదే అడవిలోకి ప్రవేశించరాదు. బేస్ క్యాంప్‌ల సంఖ్య పెంచాం. స్ట్రైకింగ్ ఫోర్స్, రిస్క్యూ బృందం, రివర్ టీమ్, డాగ్టీంలతో నిరంతర గస్తీ ఏర్పాటు చేశాం. 2014 తర్వాత పులి వధ వంటి కేసులు నమోదుకాలేదు. మూడేళ్లుగా నల్లమలలో పులుల సంతతి రెట్టింపైంది. 2018లో నల్లమలలో 48 పులులున్నట్లు నిర్దారించారు. సంతతి పెరుగుదలతో ప్రస్తుతం 55 పులులున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య: 3900 (దాదాపు)
మన దేశంలో పులుల సంఖ్య: 2,967 (2018 గణన ప్రకారం)
నల్లమలలో .. : 74 (ఏపీ-48, తెలంగాణా-26)
శ్రీశైలం- నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ పరిధిలో: 48
ఆత్మకూరు డివిజన్లో ..: 20 (దాదాపు)
తాజా వార్తలు
జిల్లా వార్తలు