close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

సోయా...కన్నీళ్లేనయా!

కొనుగోలు కేంద్రం జాడేది?
రైతులకు రూ.4 కోట్ల నష్టం

మద్దతు ధర పెరిగింది. ఈ ఏడాదయినా కలిసొస్తుందని ఆశించిన జిల్లాలోని సోయా రైతులకు నిరాశే మిగిలింది. మార్కెట్‌ మాయాజాలానికి తీవ్రంగా నష్టపోయారు. దళారులు రూ.లక్షలు ఆర్జించగా ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు రైతులు పెట్టుబడి కూడా దక్కించుకోలేక పోయారు.అందుబాటులో ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడాన్ని దళారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గ్రామాల్లో తిష్టవేసి తక్కువ ధరకు కొనుగోలు చేసి కోట్ల రూపాయలు పోగేసుకున్నారు.

మెట్‌పల్లి, న్యూస్‌టుడే

జిల్లాలో సోయా పంట ఉత్పత్తి తక్కువగా ఉందని ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. పొరుగున గల నిజామాబాద్‌ జిల్లాలో మార్క్‌ఫెడ్‌ శాఖ సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నిజామాబాద్‌ జిల్లా మెట్‌పల్లి నుంచి 65 కిలోమీటర్లు, జగిత్యాల నుంచి 100 కిలో మీటర్లు ఉండడంతో అక్కడికి వెళ్లి పంటను విక్రయించాలంటే ప్రయాసతో కూడుకోవడం, రవాణా ఖర్చులు మరింత భారం కావడంతో గ్రామాల్లోకి వచ్చిన దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. దళారులు సిండికేటై ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేశారు.

రూ.311 పెరిగిన మద్దతు ధర
గతంలో జిల్లాలో 30 వేల ఎకరాలకు పైగా సోయాబీన్‌ సాగుచేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, దళారులు నిండా ముంచుతుండడం, పెట్టుబడి ఖర్చులు దక్కకపోవడంతో రైతులు సాగు విస్తీర్ణాన్ని తగించారు.ఈ ఏడాది జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల్లో మాత్రమే సోయాబీన్‌ సాగు చేశారు. గత ఏడాది క్వింటాలుకు రూ.3,399 ఉండగా ఈ ఏడాది ప్రభుత్వం మద్దతు ధర రూ.311లు పెంచింది. దీని ప్రకారం రైతుకు క్వింటాలుకు రూ.3,710 దక్కాల్సి ఉండగా దళారులు ఏకమై ధరను తగ్గించారు. క్వింటాలుకు రూ.3,310కు మించి కొనుగోలు చేయలేకపోవడంతో రైతులు రూ.400ల వరకు నష్టపోయారు. ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున 10వేల ఎకరాలకు సగటున లక్ష క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. రైతులు క్వింటాలుకు రూ.400ల వంతున లక్ష క్వింటాళ్లకు రూ.4 కోట్ల వరకు నష్టపోయారు.

రైతుల పేరిట..
రైతుల నుంచి తక్కువ ధరకు సోయా ఉత్పత్తులను కొనుగోలు చేసి నిల్వ చేశారు. తమ వద్ద ఉన్న నిల్వలను దళారులు రైతుల పేరిట ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి.

రూ.5,200 వరకు నష్ట పోయా
- అల్లూరి లింగారెడ్డి, వేంపేట
ప్రభుత్వమద్దతు ధర రూ.3,710. కానీ విక్రయించడానికి కొనుగోలు కేంద్రం అందుబాటులో లేదు. మరో జిల్లాకు వెళ్లి విక్రయించడానికి ఖర్చులు తడిసి మోపెడు కావడంతో దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. వారు చెప్పిన ధరకు అమ్ముకున్నా. క్వింటాలుకు రూ.400ల వంతున 13 క్వింటాళ్లకు రూ.5,200ల వరకు నష్టపోయా.

పెట్టుబడి ఖర్చులూ రాలేదు
- కొమ్ముల శేఖర్‌, వేంపేట
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర విని సంతోషించా. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో దళారులు చెప్పిన ధరకే అమ్మాల్సి వచ్చింది. సోయా సాగుకు ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేశా. దళారులకు అమ్ముకోవడం వల్ల పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.