close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

ముళ్ల కంచెలు.. ముప్పుతిప్పలు!

  అరెస్టులతో మహాదీక్ష భగ్నం చేసిన పోలీసులు
  ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల ఇళ్ల వద్ద ఉద్రిక్తతలు
  ధర్నా చౌక్‌ చుట్టూ కర్ఫ్యూ వాతావరణం
ఈనాడు, హైదరాబాద్‌; కవాడిగూడ,
కర్మన్‌ఘాట్‌, నాచారం, న్యూస్‌టుడే

ఆర్టీసీ కార్మికుల దీక్ష నినాదం ఓ వైపు.. ససేమిరా దీక్ష జరగనివ్వమన్నట్లు ప్రభుత్వం మరో వైపు.. వెరసి ఆదివారం ధర్నా చౌక్‌ పరిసరాలు పోలీసుల చేతిలోకి వెళ్లాయి. దారులన్నీ దిగ్బంధం చేయడంతో రోజువారీ పనుల కోసం సామాన్యులూ అటు వైపు వెళ్లలేకపోయారు. వివిధ సంఘాలు ధర్నాచౌక్‌లో ఆదివారం తలపెట్టిన మహాదీక్ష నేపథ్యంలో వేకువ జాము నుంచే చుట్టూ మూడు కిలోమీటర్ల మేర రహదారులను ఇనుపకంచెలతో మూసేశారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే అరెస్టు చేశారు.

రామకృష్ణమఠం వెళ్లే భక్తులు, ఇందిరాపార్కు ఎదురుగా ఉన్న రవిహీలియోస్‌ ఆసుపత్రి, మోహన్స్‌ డయాబెటిక్‌ సెంటర్‌ తదితర ఆసుపత్రులకు వెళ్లే వారినీ అడ్డుకున్నారు. ముళ్ల కంచెలతో దారులు మూసేయడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బారికేడ్ల వద్ద ప్రజలు పోలీసులతో వాగ్వివాదాలకు దిగారు. ఎన్‌టీఆర్‌ స్టేడియంలో కార్తీక దీపోత్సవానికి వెళ్లాలనుకునే భక్తులనూ అడ్డుకున్నారు. చివరికి సాయంత్రం 4.40 గంటలకు బారికేడ్లను తొలగించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

హస్తినాపురంలో రెండు రోజులుగా ఉద్రిక్తత
హస్తినాపురంలోని జయకృష్ణ ఎన్‌క్లేవ్‌ కాలనీలోని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి నివాస పరిసరాల్లో రెండురోజుల పాటు హైడ్రామా నడిచింది. ఆర్టీసీ ఐకాస రిలే దీక్షలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో సాధారణ దుస్తులో పోలీసులు అశ్వత్థామరెడ్డి ఇంటికి చేరుకున్నారు. అశ్వత్థామరెడ్డి ఇంట్లోనే దీక్షకు దిగారు. సాగర్‌ రింగురోడ్డులోని ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్‌ రాజిరెడ్డి నివాసం వద్దా ఇదే పరిస్థితి నెలకొంది. శనివారం ఇంటిలోనే దీక్షకు దిగిన రాజిరెడ్డిని అరెస్టు చేశారు. మళ్లీ ఆదివారం కూడా దీక్ష చేపట్టడంతో ఇంటి తలుపులు బలవంతంగా తీసి అరెస్టు చేశారు. దీంతో ఆయా నివాసాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులుగా అశ్వత్థామరెడ్డి నివాసం, పక్క అపార్ట్‌మెంట్లు, కాలనీలో పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు చేరుకున్నాయి. బ్యారికేడ్లు పెట్టి కాలనీ వాసులతో పాటు ఇతరులనూ కాలనీకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అశ్వత్థామరెడ్డి విలేకరుల మాట్లాడుతూ... ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా దీక్షను విరమించేది లేదని తెగేసి చెప్పారు. శాంతియుతంగా దీక్షకు దిగితే అరెస్టు చేయడం ఏంటని రాజిరెడ్డి నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ.. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు దౌర్జన్యంగా భగ్నం చేయడం మంచి పరిణామం కాదు. కార్మికులను ఇబ్బంది పెట్డడమే బంగారు  తెలంగాణా అని ప్రశ్నించారు.

చర్చలు చేపట్టాలి.. చర్చలతో కార్మికుల సాధ్యమైన సమస్యలు పరిష్కరించాలని భాజపా నేతలు, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌ అన్నారు. అశ్వత్థామరెడ్డి దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చిన వారిని పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అశ్వత్థామరెడ్డిని కలసి దీక్షపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి లేరని కేవలం కేసీఆర్‌, కేటీఆర్‌ ఆదేశాలను పాటిస్తూ వారికి ఊడిగం చేస్తున్నారని పోలీసులపై ఆరోపించారు. మందకృష్ణను అదుపులోకి తీసుకుని ఘట్‌కేసర్‌ ఠాణాకు తరలించారు.

గట్టి బందోబస్తు
ఇటీవల ఆర్టీసీ కార్మికుల ‘చలో ట్యాంక్‌బండ్‌’ సఫలం కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆదివారం ఇందిరాపార్కు వద్ద పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.