శుక్రవారం, డిసెంబర్ 13, 2019
బషీర్‌బాగ్, న్యూస్‌టుడే: వికారాబాద్ జిల్లాలో 2900 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న నేవీ రాడార్ బేస్ స్టేషన్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని భారతీయ బౌద్ధ సంఘ్ డిమాండ్ చేసింది. ఈ రాడర్ స్టేషన్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ ద్వారా జీవ రాశులు, మానవులకు ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. వికారాబాద్ అనంతగిరి కొండల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం వల్ల గ్రామీణ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఆదివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.నర్సింగ్‌రావు, రాష్ట్ర అధ్యక్షులు పెండ్యాల అనంతయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మయూర్ సర్సర్, మైనార్టీ విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహ్మద్ గౌస్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, ఐకాస నేతలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్స్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దుర్వినియోగం అవుతుండటం వల్ల శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు