శుక్రవారం, డిసెంబర్ 06, 2019
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
కవాడిగూడ, న్యూస్‌టుడే: సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో భక్తిటీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివార్చన చేసి మాట్లాడారు. కార్తికమాసంలో దీపారాధన, వనభోజనాలు చేయడం గొప్ప సంప్రదాయమన్నారు. ఆసుపత్రులకు వెళ్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆలయాలకు వెళ్తే మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. పూరి శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి మాట్లాడుతూ వేలాది సంవత్సరాల హైందవ ప్రాచీన పరంపరను కాపాడుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. అన్నవరం రమాసత్యనారాయణ స్వామి కల్యాణం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ఊరేగించారు. డా.శోభరాజు అన్నమయ్య కీర్తనలు ఆలపించగా, గరికపాటి ప్రవచనం చెప్పారు. నాగసాధువులు మహారుద్రాభిషేకం నిర్వహించారు. భక్తి టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సంతోశ్‌కుమార్ శాస్త్రి, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు