close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

మాయదారి యాప్‌లు!

 ధర తక్కువని ఆశపడితే.. దిగాలు పడాల్సిందే
 నాసిరకం వస్తువులతో జేబులు గుల్ల
 కొనేముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

* యూసుఫ్‌గూడ నివాసి మల్లేష్‌ మొబైల్‌ఫోన్‌ కొనాలనుకున్నాడు. ఓ యాప్‌లో రూ.26,000 విలువచేసే ప్రముఖ కంపెనీ ఫోన్‌ రూ.13,000లకే ఇస్తామంటూ ఆఫర్‌ ఇవ్వడంతో వెంటనే కొనుగోలు చేశాడు. రెండోరోజు నుంచే మొబైల్‌లో లైటింగ్‌, బ్యాటరీ సమస్యలు గుర్తించాడు. వెంటనే చరవాణి విక్రయించిన వ్యక్తికి ఫోన్‌ చేసి అడిగితే.. వస్తువు అమ్మాక తనకు సంబంధం లేదంటూ తేల్చిచెప్పాడు. నీ ఇష్టం వచ్చింది చేసుకోమంటూ సమాధానమిచ్చాడు. దీంతో సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
* మియాపూర్‌కు చెందిన నితిన్‌ ల్యాప్‌టాప్‌ కొనుగోలు కోసం యాప్‌లలో వెతకడం ప్రారంభించాడు. తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌ ఆఫర్‌ చూసి సదరు వ్యక్తిని సంప్రదించి కొనుగోలు చేశాడు. వారానికే అది మొరాయించడం మొదలు పెట్టింది. మరమ్మతుల దుకాణంకు తీసుకెళ్తే ‘‘హార్డ్‌ డిస్క్‌’’ మార్చాలని, సాంకేతిక సమస్య కూడా ఉందని..రూ.3 వేలు వెచ్చించాల్సి వస్తుందని సూచించారు.

న్యూస్‌టుడే, హైదరాబాద్‌

ఏది కొనాలన్నా.. విక్రయించాలనుకున్నా.. క్లిక్‌ కొడితే చాలు. ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు లావాదేవీలకు వేదికగా మారాయి. మార్కెట్‌లోకి కొత్త మోడల్‌ రాగానే పాతవాటిని తక్కువ ధరకు విక్రయించేందుకు యువత, కార్పొరేట్‌ ఉద్యోగులు ఆసక్తిచూపుతున్నారు.  ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లు మరమ్మతులు ఉన్న చరవాణులు, ల్యాప్‌టాప్‌లు రీఫర్బిష్డ్‌ (పునరుద్ధరించినవి) విక్రయిస్తుంటాయి. కొత్త వాటితో పోల్చితే ధరలో సుమారు 30శాతం తేడా ఉంటుంది. ఈ సంస్థలు వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విక్రయానికి సిద్ధంగా ఉంచుతాయి. కొనుగోలు చేసిన అనంతరం ఏదైన సమస్య వస్తే సదరు సంస్థలకు ఫిర్యాదు చేస్తే రిప్లెస్‌మెంట్‌(మరో వస్తువు) చేస్తారు. ఈ నిబంధన ఆరు నెలల పాటు ఉంటుంది.

నాసిరకం పరికరాలతో

లాభసాటి వ్యాపారంగా మారటంతో కొందరు యాప్‌లను తయారు చేసి ఎలక్ట్రానిక్‌ వస్తువుల క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ బ్రాండ్‌ వస్తువులను సెకండ్‌ సేల్‌్్స పేరిట యాప్‌లలో విక్రయిస్తున్నాయి. నగరంలో ఎక్కువ మంది ఈ యాప్‌లను ఉపయోగించి ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు కొనడం.. అమ్మడం చేస్తుంటారు. దీన్ని అవకాశం చేసుకుని కొంతమంది ముఠాలుగా ఏర్పడి నాసిరకం పరికరాలను ఉపయోగించి ఫోన్‌లను విక్రయిస్తున్నారు. మొబైల్‌ ఫోన్ల మరమ్మతు కేంద్రాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. వాటికి తెర, టచ్‌, బ్యాటరీ లాంటి నాసిరకం పరికరాలను అమర్చుతారు. ఏ మాత్రం అనుమానం రాకుండా స్క్రీన్‌ గార్డ్‌, పౌచ్‌లను ఏర్పాటు చేస్తారు. చూసేందుకు కొత్త చరవాణిగా ఇట్టే ఆకట్టుకుంటుంది. కొత్త మోడల్‌ రావటంతో అమ్మేస్తున్నామంటూ బురిడీ కొట్టిస్తారు. ఇలా వారి బుట్టలో పడిన వారికి అంటగట్టి చేతులు దులుపుకొంటున్నారు.

ఆర్మీ ఉద్యోగుల పేరుతో

కొందరు మాయగాళ్లు ఆర్మీ ఉద్యోగులమంటూ అంతర్జాలం వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్మీ క్యాంటీన్‌లో తాము కొనుగోలు చేసిన విలువైన చరవాణిలు, ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరకే ఇస్తామంటూ యాప్‌లలో ప్రకటనలిస్తున్నారు. ఇది నిజమని భావించిన ఎంతోమంది తేలికగా మోసపోతున్నారు.

ఇవి పరిశీలించాలి..

* ఫోన్‌, ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి.
* వస్తువులను క్షుణ్నంగా పరిశీలించాలి.
* తక్కువ ధరకే విక్రయాలు అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
* కెమెరా పనితీరు సరిచూసుకోవాలి

నిర్ధారించుకోవాలి
సుమిత్‌ రెడ్డి, సాంకేతిక నిపుణులు

ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసే వారు ముందుగా వాటి పనితీరును నిర్ధారించుకోవాలి. యాప్‌ల ద్వారా కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం పోస్టులో పొందుపరిచిన వివరాల ఆధారంగా కొనుగోలు చేస్తారు. విక్రయించే వ్యక్తితో ఎలాంటి పరిచయం ఉండదు. ఏదైనా సమస్య వస్తే విక్రయించిన వారిని సంప్రదించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. చరవాణి కొనుగోలు చేసేటపుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. కొంత మంది చోరీ చేసిన ఫోన్‌లను సైతం విక్రయిస్తుంటారు. అలాంటి వాటితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

గుర్తించడం కష్టం
శేఖర్‌, చరవాణి నిపుణుడు

సాధారణంగా అంతర్జాలం వేదికగా విక్రయించే చరవాణిలు మరమ్మతులకు గురైనవే ఉంటాయి. కొంత మంది ముఠాలుగా ఏర్పడి ఫోన్‌లను రీమోడలింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేస్తే.. సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇందులో ఎక్కువగా నాసిరకం తెరలు, బ్యాటరీ బ్యాకప్‌, నెట్‌వర్క్‌ సమస్య, కెమెరా పనితీరు, అపరేటింగ్‌ సిస్టం తదితర సమస్యలు వస్తాయి. ఇవి సాధారణ వ్యక్తులు గుర్తించడం కష్టం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.