close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

‘వసతి’ వణుకుతోంది..!

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల అవస్థలు
ఏళ్లుగా అద్దె భవనాల్లోనే కొనసాగింపు
అంతటా తాండవిస్తున్న అపరిశుభ్రత
చలి వణికిస్తున్నా అందని రగ్గులు
అరకొరగా కాస్మోటిక్స్‌ ఛార్జీలు విడుదల
ఈనాడు, హైదరాబాద్‌

చలికి వణికిపోయే చిన్నారి ప్రాణాలు.. ఒకే దుప్పటి కింద ముగ్గురు తలదాచుకునే పరిస్థితులు.. సరిపడా విడుదల కాని నిధులు.. విరిగిన కిటికీలు.. పరదాలతో కప్పిన మరుగుదొడ్లు.. చాలీచాలని గదులు.. అందని కాస్మోటిక్‌ ఛార్జీలు.. ప్రభుత్వ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. తల్లిదండ్రులకు దూరంగా.. ప్రభుత్వం అందించే ఆసరాతో చదువుకుందామని ముందుకు వచ్చే చిన్నారులకు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. అరకొర వసతుల మధ్య ఉండలేక తీవ్ర అగచాట్లు పడుతున్నారు. పలుచోట్ల నీటి వసతి కూడా సరిగా లేని పరిస్థితి కొనసాగుతోంది. గ్రేటర్‌ నగర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో పరిస్థితులపై ‘ఈనాడు’ పరిశీలన చేసింది. వివరాలివీ....

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగంలో సుమారు లక్ష మంది విద్యార్థులు వసతిగృహాల్లో ఉంటున్నారు. వీటిలో వసతులు లేక పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా బీసీ వసతిగృహాల్లో సమస్యలు పేరుకుపోయాయి. కిటికీలు విరిగిపోయి.. తలుపులు సరిగా లేక విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రభుత్వం రెండు విభాగాల్లో వసతిగృహాలను నడుపుతోంది. పోస్ట్‌మెట్రిక్‌ విభాగంలో వసతిగృహాలు ఏ మాత్రం అనువుగా లేవు. మూడు జిల్లాల్లో వసతిగృహాలు ఏర్పాటు చేసినప్పటిన్నుంచి సొంత భవనాలు లేవు. సంవత్సరాలుగా అద్దె భవనాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. అద్దె భవనాల్లో సరిపడా వసతలు ఉండవు. ఉన్నంతలోనే సరిపెట్టుకుని విద్యార్థులు ఉంచుతున్నారు. నగరంలోని జీడిమెట్లలో కొనసాగుతున్న ఎస్సీ వసతిగృహంలో కనీస వసతులు మృగ్యమయ్యాయి. అధికారులు మరో భవనానికి వసతిగృహాన్ని తరలించాలని భావిస్తున్నా అనువైంది దొరకని పరిస్థితి నెలకొంది.

విద్యార్థులకు నెలకు అందించే కాస్మోటిక్‌ ఛార్జీలు
బాలురు రూ.62
బాలికలు (7వ తరగతి వరకు) రూ.50
బాలికలు (8-10వ తరగతి) రూ.90

కాస్మోటిక్స్‌ అందవు..

ఈ విద్యా సంవత్సరంలో కాస్మోటిక్స్‌ పూర్తిస్థాయిలో అందలేదు. అవసరమైన మేర బడ్జెట్‌ ఇవ్వకపోవడంతో సరిపడా అందించలేదు. విద్యార్థులకు సబ్బులు, పేస్టులు, నూనె అందించాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ప్రభుత్వం నిధులు పూర్తిగా ఇవ్వకపోవడంతో అయిదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. రెండు రోజుల కిందట నిధులు విడుదలైనా విద్యార్థులకు కాస్మోటిక్స్‌ చేరలేదు. ఉదాహరణకు మేడ్చల్‌ జిల్లాలో జూన్‌ నుంచి అక్టోబరు చివరికి నాటికి రూ.3కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.1.35కోట్లే ప్రభుత్వం విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాదీ ఇదే పరిస్థితి. రూ.1.89కోట్లు మాత్రమే అందించింది. ఈ నిధులు రెండు నెలలకు మాత్రమే సరిపోతాయి. మరో మూడు నెలలకు అవసరమైన నిధులు విడుదల కావాల్సి ఉంది.

తాండవిస్తున్న అపరిశుభ్రత

వసతిగృహాల్లో అపరిశుభ్రత తాండవించి విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. చాలాచోట్ల విద్యార్థులు పడుకునే ప్రదేశం పక్కనే మరుగుదొడ్లు ఉంటున్నాయి. మరుగుదొడ్లకు ప్రత్యేకంగా తలుపులు ఉండటం లేదు. పరదాలు కట్టి వినియోగిస్తున్నారు. వాటిని సకాలంలో శుభ్రం చేయించడం లేదు. తీవ్ర దుర్వాసన వెలువడుతోంది. అక్కడే నిద్రిస్తుండటంతో చిన్నారులు కంపు భరించలేకపోతున్నారు.

నల్లా రాకుంటే నీరు బంద్‌

నీటి సదుపాయం విషయంలోనూ అధికారులు శ్రద్ధ పెట్టడం లేదు. అద్దె భవనాలు కావడంతో నీటి వసతి అంతంత మాత్రమే. ఏదైనా కారణంతో నల్లా నీరు రాకపోతే తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. చలికాలంలో వేడినీరందించాలని నిబంధనలు సూచిస్తున్నాయి. వసతిగృహాల్లో ఎక్కడా గీజర్లు, హీటర్ల సదుపాయం లేక చన్నీళ్లే దిక్కవుతున్నాయి. ఉదయం గజగజ వణికించే చలిలో చన్నీళ్లే పోసుకుని స్నానం కానిస్తున్నారు. వసతిగృహాల్లో గీజర్లు ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నా పట్టించుకోని పరిస్థితి.

ఇవీ ప్రధాన సమస్యలు

* అధిక భాగం వసతిగృహాల్లో కిటికీలు విరిగిపోయాయి.
* తలుపులు సరిగా లేవు. గడియ పెట్టేందుకు వీల్లేక భయం భయంగా రాత్రిళ్లు గడుపుతున్నారు.
* ఫ్లోరింగ్‌ దెబ్బతిన్న గదుల్లోనే విద్యార్థులు నిద్రించాల్సి వస్తోంది.
* గిరిజన, ఎస్సీ హాస్టళ్లలో పరుపుల నుంచి పీచులు ఊడి వస్తున్నాయి. కంపు కొడుతున్నాయి.
* వార్డెన్లు స్థానికంగా ఉండటం లేదు.
* పలు హాస్టళ్లలో దొడ్డు బియ్యం, నీళ్ల చారే దిక్కవుతోంది.

అందని రగ్గులు.. తప్పని అవస్థలు

ఏటా శీతాకాలం కంటే ముందే విద్యార్థులకు రగ్గులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటికే చలిగాలులు మొదలై రాత్రి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. కిటికీలు, తలుపులు సరిగా లేకపోవడంతో చలిగాలులు లోపలికి వచ్చి విద్యార్థులు వణికిపోతున్నారు. అక్టోబరులోనే విద్యార్థులకు రగ్గులు పంపిణీ చేయాల్సిఉంది. ఈ ఏడాది నిధులు లేవని టెండర్లు పిలవడంలో జాప్యం జరిగింది. నవంబరు నెల సగం గడిచినా విద్యార్థులకు రగ్గులు అందలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. బీసీ వసతిగృహాల్లో మరో వింత సమస్య నెలకొంది. పోస్ట్‌మెట్రిక్‌ విద్యార్థులకు రగ్గులు అందించడం లేదు. ఇళ్ల నుంచే దుప్పట్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఏళ్లుగా రగ్గులు అందించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. చెప్పులు, పరుపులు కూడా ఇవ్వడం లేదు.

నీటి ఎద్దడి.. సౌకర్యాల లేమి

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతిగృహంలో వివిధ జిల్లాలకు చెందిన 44మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతుండగా దసరా సెలవులకు వెళ్లిన 25మంది తిరిగి రాలేదు. ప్రస్తుతం 19మందే ఉన్నారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. సరైన భోజన వసతి కూడా లేదని విద్యార్థులు వాపోతున్నారు. పూర్తి స్థాయిలో ఫ్యాన్లు లేకపోవడం, దోమల బెడదతో రాత్రి వేళ అవస్థలు వర్ణనాతీతం. డ్రైనేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. పలువురు విద్యార్థులు సుమారు 3కిలోమీటర్ల దూరంలో నడిచి వెళ్లి మడ్‌ఫోర్ట్‌ ఉన్నత పాఠశాల, బాపూజీనగర్‌లోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు.

-కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే

పాడైన పడకలు.. తలుపుల్లేని స్నానాల గదులు

కంటోన్మెంట్‌ బాపూజీనగర్‌లోని గిరిజన బాలుర, బాలికల వసతి గృహాల్లో దాదాపు 220మంది ఉన్నారు. బాలుర హాస్టల్‌లో పడకలు పాడైపోయాయి. దుస్తులు ఉతికేందుకు, స్నానం చేసేందుకు సబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సొంత డబ్బుతో కొనుక్కుంటున్నామని విద్యార్థులు తెలిపారు. స్నానపుగదుల తలుపులు విరిగి ఉన్నాయి. మూత్రశాలలు శుభ్రంగా లేక కంపుకొడుతున్నాయి. బాలిక వసతి గృహంలో 130మంది బాలికలు ఉన్నారు. ఫ్లోరింగ్‌ దెబ్బతిని పలు చోట్ల ప్రమాదకరంగా ఉంది. స్నానపు గదుల తలుపులు ధ్వంసమయ్యాయి.

-కార్ఖానా, న్యూస్‌టుడే

విరిగిన తలుపులు, కిటికీలు.. విద్యార్థులకు జ్వరాలు

విరిగిన గదుల ద్వారాలు, తలుపుల్లేని కిటికీల నుంచి వస్తున్న చల్లని గాలులకు విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు. మంచాల్లేక నేలపైనే పడుకుంటున్నారు. ఈ వాతావారణంతో కార్వాన్‌ దూద్‌బౌలిలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో దాదాపు 115 మంది విద్యార్థులు తరచూ జ్వరాల పాలవుతున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, నివాసముండే గదులు, కిటికీలకు తలుపులు సరిగా లేవు. దోమల బెడదతో కంటిమీద కునుకు ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. గదులను వారే శుభ్రం చేసుకుంటూ అవస్థలు పడుతున్నారు.

-కార్వాన్‌, న్యూస్‌టుడే

దోమల బెడద తీవ్రం..  మంచాల్లేవ్‌

మహేంద్రహిల్స్‌ ప్రభుత్వ బీసీ వసతిగృహం వెనుక వైపు స్థలమంతా అడవిని తలపిస్తోంది. ఉండే విద్యార్థులు దాదాపు 180మంది. ఆర్‌వో మంచినీటి ప్లాంటు పాడై ఏడాదవుతోంది. గదుల్లో మంచాలు లేక పిల్లలు నేలపైనే పడుకొంటున్నారు. దోమలు విపరీతంగా ఉన్నాయి. కొన్ని ఫ్యాన్లు తిరగడం లేదు. శుభ్రత లేక మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. మెనూ ప్రకారం భోజన వసతి ఉంది. బస్సు సౌకర్యం లేక  ఇక్కడి విద్యార్థులు 5 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళుతున్నారు.

-మారేడుపల్లి, న్యూస్‌టుడే

మరికొన్ని హాస్టళ్లలో ఇలా...

* శంకర్‌పల్లిలో బాలికల వసతిగృహంలో 93 మంది, బాలుర వసతిగృహంలో 30 మంది, బీసీ బాలుర వసతిగృహంలో 58 మంది ఉన్నారు. ఎస్సీ బాలుర వసతిగృహం కిటికీలకు తలుపులు సరిగా లేక అడ్డంగా దుప్పట్లు కట్టారు. చలిగాలులకు అవస్థలు పడుతున్నారు. స్నానాల గదులు సరిగా లేక ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. ఆవరణ పిచ్చిమొక్కలతో అపరిశుభ్రంగా ఉంది. దోమల సమస్య వేధిస్తోంది. బాలికల వసతిగృహం ముందు మురుగు నీరు, సంపులోని నీరు కలుస్తుండటంతో అవస్థలు పడుతున్నారు. బీసీ బాలుర వసతిగృహంలో మూత్రశాలలు, మురుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి.

* దుండిగల్‌లోని బీసీ బాలుర వసతిగృహానికి రెండేళ్ల కిందట శాశ్వత భవనాన్ని నిర్మించారు. విద్యార్థుల సంఖ్య 80 మాత్రమే. మంచాలు లేక నేలపైనే నిద్రించాల్సి వస్తోంది. సరిపడా రగ్గులు, దుప్పట్లు అందుబాటులో ఉన్నాయి. నర్సాపూర్‌-బాలానగర్‌ ప్రధాన రహదారి నుంచి దుండిగల్‌కు వెళ్లే రోడ్డులో వసతిగృహం ఉంది. విద్యార్థులు ఎప్పుడుపడితే అప్పుడు నేరుగా రోడ్డుమీదకు వస్తుండటంతో ప్రమాదాల బారినపడే అవకాశముంది. చుట్టు ప్రహరీని నిర్మించాలి. ప్రతినెల విద్యార్థులకు కాస్మోటిక్స్‌ కింద అందించే నగదు మూడు నెలలుగా నిలిచిపోయింది.

* చేవెళ్ల ఎస్సీ బాలుర వసతిగృహంలో 75 మంది విద్యార్థులకు నాలుగు గదులే ఉన్నాయి. ఒక్కో గదిలో 15-20 మంది కిక్కిరిసి ఉంటున్నారు. రెండు గదుల పైకప్పు రేకులతోనే ఉంది. 1971లో నిర్మించిన భవనం కావడంతో శిథిలావస్థకు చేరింది. కిటికీల తలుపులు విరిగిపోయాయి. మరుగుదొడ్లు, స్నానపు గదులున్నా శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు వినియోగించడం లేదు. రెండు మరుగుదొడ్లు మాత్రమే వినియోగిస్తుండగా కొందరు విద్యార్థులు ఆరు బయటకు వెళుతున్నారు.

* చేవెళ్ల బీసీ బాలుర వసతిగృహంలో 120 మందికి పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందగా తగినన్ని గదులు లేక ప్రస్తుతం 77 మందే ఉంటున్నారు. పది స్నానపు గదులు, పది మరుగుదొడ్లను నిర్మించారు. నీటి వసతి లేక నాలుగింటిని మాత్రమే వినియోగిస్తున్నారు. కొన్నేళ్లుగా వాడకపోవడంతో మిగతావి శిథిలావస్థకు చేరాయి. కొన్ని గదులకు తలుపులు, కిటికీలు లేవు. కళాశాల విద్యార్థుల కోసం ఎస్సీ బాలుర వసతి గృహాన్ని అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు.

దుండిగల్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి - న్యూస్‌టుడే

వానొస్తే భవనం నీటిలోనే..

కాచిగూడకు చెందిన కళాశాల విద్యార్థినుల వసతిగృహంలో దాదాపు 100మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు. భవనం రహదారి కన్నా దిగువ ప్రాంతంలో ఉంది. పక్కనే జీహెచ్‌ఎంసీ కచ్చా నాలా కొనసాగుతోంది. దీంతో ఇటీవల వర్షాలకు రెండు సార్లు భవనం నీట మునిగింది. మోకాలు లోతు వరదతో విద్యారినులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భనవం కూడా శిథిలావస్థకు చేరింది.

* భోలక్‌పూర్‌ డివిజన్‌ దేవునితోట భవాని శంకరాలయం సమీపంలో జమిస్తాన్‌పూర్‌, అడ్డగుట్టలకు చెందిన ఎస్సీ బాలికల వసతిగృహం కొనసాగుతోంది. 106 మంది చిన్నారులు వసతి పొందుతున్నారు. స్నానాలకు వేడి నీరు లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. భవనంపై సోలార్‌ సిస్టం ఏర్పాటు చేసినా కనెక్షన్‌ ఇవ్వక నిరుపయోగంగా ఉంటోంది.

* ముషీరాబాద్‌ డివిజన్‌ మొరంబొందలో ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్‌ శిథిల భవనంలో కొనసాగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.

ముషీరాబాద్‌, బాగ్‌లింగంపల్లి -న్యూస్‌టుడే

నల్లా నీరే ఆధారం.. సమస్యలు అధికం

గోపీనగర్‌లోని శేరిలింగంపల్లి బాలుర బీసీ హాస్టల్‌ విద్యార్థులు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. కొందరు విద్యార్థులకు దుప్పట్లు సరిగా లేవు. ఒకే పొడవాటి గదిలో 60 మంది విద్యార్థులు ఉంటున్నారు. భవన నిర్మాణ సమయంలో బోరు వేసినా నీళ్లు పడకపోవడంతో వదిలేశారు. మళ్లీ బోరు ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోదు. నల్లా నీటిపైనే ఆధారపడి హాస్టల్‌ సాగుతోంది. ఈ నీటి సరఫరా ఆగితే ప్రత్యామ్నాయం లేదు. భవనంలో చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పిట్టగోడ లేక ప్రమాదకర పరిస్థితులున్నాయి. విద్యార్థులకు కాస్మోటిక్‌ వస్తువులు అరకొరగా అందుతున్నాయి.

-శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే

పాలిష్‌ బియ్యం అన్నం.. నీళ్ల చారు

అద్దె భవనాలు, అరకొర వసతులు, దొడ్డు బియ్యం అన్నం, నీళ్ల పప్పు, చారు... ఇదీ ట్రూప్‌బజార్‌లోని బీసీ బాలుర కళాశాల సంక్షేమ వసతి గృహాల పరిస్థితి. ఇక్కడ అద్దె భవనంలో వేర్వేరుగా సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌ హాస్టళ్లు కొనసాగుతున్నాయి. 250 చొప్పున విద్యార్థులు ఉండాల్సి ఉన్నా ఎక్కువ మంది ఉంటున్నారు. కనీసం దుస్తులు పెట్టుకోవడానికి సెల్ఫ్‌లు కూడా లేవు. పారిశుద్ధ్య నిర్వహణ లేక ఆవరణంతా చెత్తతో నిండిపోయింది. వార్డెన్‌ నెలకోసారి కూడా రారని విద్యార్థులు వాపోతున్నారు. మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. గుడ్డు వారానికోసారి కూడా ఇవ్వడం లేదు.

-సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే

అపరిశుభ్రతకు చిరునామా

మలక్‌పేట - 1, 2 బాలుర వసతిగృహం సరూర్‌నగర్‌ డివిజన్‌లోని కొత్తపేట లక్ష్మీనగర్‌లో కొనసాగుతోంది. స్నానపుగదులు, మరుగుదొడ్లను సరిగా శుభ్రం చేయడంలేదు. గదుల పక్కనే ఉండటంతో చిన్నారులకు తీవ్ర దుర్వాసన వస్తోంది. లైట్లు లేక కొందరు చిన్నారులు రాత్రివేళ బాత్రూంలకు వెళ్లాలంటే జంకుతున్నారు. అపరిశుభ్రత ఎక్కువై దోమలు వ్యాప్తి చెందాయి. ఫ్యాన్ల మరమ్మతులనూ పట్టించుకోవడం లేదు. స్విచ్‌ బోర్డులూ పాడయ్యాయి. లైట్లు, ఫ్యాన్లు వేస్తూ చిన్నారులు తరచూ స్వల్పంగా షాక్‌కు గురవుతున్నారు. ఇద్దరు వార్డెన్లూ రాత్రి ఉండటంలేదు.

-సరూర్‌నగర్‌, న్యూస్‌టుడే

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.