శుక్రవారం, డిసెంబర్ 13, 2019
మహానగరంలో షీ టాయిలెట్లు 28 మాత్రమే
మహిళల్లో చెప్పుకోలేని బాధ.. తీరని వ్యథ
పాఠశాలల్లో ఉగ్గబట్టుకుంటున్న విద్యార్థినులు
కొత్తవి నిర్మించరు.. ఉన్నవాటి నిర్వహణ కరవు
నేడు ‘ప్రపంచ మూత్ర శాలల దినోత్సవం’
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
బయటికి చెప్పుకోలేని బాధ.. ప్రాణాలు లాగేసే నొప్పిని పంటి బిగువన అదిమిపట్టి అడుగులో అడుగేయడం వారికి అలవాటుగా మారింది. బడికెళితే చదువు మీదికి మళ్లాల్సిన మనసు.. మూత్రశాలకు వెళ్తే ఖాళీ ఉంటుందో లేదోనని ఆలోచిస్తోంది. పదే నిమిషాల వ్యవధిలో వందల మందిలో పని పూర్తవుతుందో లేదోననే భయం రోజంతా తాగునీటిని ముట్టుకోకుండా చేస్తోంది.
- ఇదీ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినుల దుస్థితి
ఈ బాధ కేవలం విద్యార్థినులదే కాదు నగరంలో బయటకెళ్లాలంటే వణుకుతున్న మహిళలది కూడా. పంటి బిగువన బాధను భరిస్తున్నారు. ఎందుకంటే మహానగరంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘షీ టాయిలెట్లు’ 28 మాత్రమే అంటే ఎంత దారుణం? నగరవాసులకు ఇంట్లోంచి బయటకి వెళ్లాలంటే ఎక్కువమందిని భయపెట్టే విషయాలు.. రోడ్లపై ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం మాత్రమే కాదు.. మూత్ర సమస్య కూడా. ముఖ్యంగా నగరంలో మహిళలు, యువతలు ఇంటి నుంచి ఎటైనా వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడా ప్రజా శౌచాలయాలు లేకపోవడం.. ఉన్న వాటిలో నిర్వహణ అధ్వానంగా మారడంతో ఇబ్బందులు తలెత్తుతోంది. నగరంలో ప్రధాన కేంద్రాల్లో అవసరమున్న చోట ప్రజా మరగుదొడ్లు నిర్మిచడంలో బల్దియా విఫలమవుతోంది.
నగరమంతా అదే పరిస్థితి
స్వచ్ఛ నగరంగా మార్చేందుకు నగరమంతటా మరుగుదొడ్లు నిర్మిస్తోంది బల్దియా. కానీ కొన్నాళ్లకే అవి మరుగున పడుతున్నాయి. తక్కువ నీటి వినియోగం, దుర్వాసన రాకుండా పర్యావరణహిత రసాయనాల వినియోగం ఉంటుందంటూ నగరంలోని రవీంద్రభారతి ప్రహరీ పక్కన, ఐమాక్స్ కూడలి, తదితర ప్రాంతాల్లో హరిత టాయిలెట్లను నిర్మించింది బల్దియా. నిర్వహణ సరిగా లేక వినియోగానికి దూరమయ్యాయి. ప్రముఖులు వచ్చే సమయంలో మాత్రం శుభ్రం చేస్తున్నారు. ప్రైవేటు గుత్తేదారుల చేతుల్లో నడుస్తున్న బీఓటీ, సులభ్ టాయిలెట్లు అంతంతమాత్రంగా నెట్టుకొస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘లూకేఫ్’ నిర్మాణాలు సైతం నాలుగు ప్రాంతాలకే పరిమితమయ్యాయి. నీటి సరఫరా లేక ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, అమీర్‌పేట, సత్యం థియేటర్ రోడ్డు, ఉప్పల్ కూడలి తదితర ప్రాంతాల్లో సుమారు 200 మరుగుదొడ్లు మూతబడ్డాయి.
నీళ్లు ముట్టుకోవట్లేదు..
నగరంలో ఏదైనా పని ఉండి బయటికి వెళ్లాల్సి వస్తే మహిళలకు మూత్రశాలలు ప్రధాన సమస్యగా మారాయి. ప్రజా మరుగుదొడ్ల జాడ కనిపించకపోవడంతో ఉగ్గబట్టుకొని నెట్టుకొస్తున్నారు. ఫలితంగా అనారోగ్యం పాలవుతున్నారు. ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు నీళ్లు తాగకుండానే రోజు గడిపేస్తున్నారు. ఎక్కువ తాగితే ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని ముందుగానే నీటిని దూరం పెడుతున్నారు. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యల్ని కొనితెచ్చుకుంటున్నారు.
పాఠశాలల్లో అధ్వానం..
నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. దాదాపు అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్యకు తగినన్ని లేకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. ఒక్కో పాఠశాలలో వందలమంది విద్యార్థులుంటే అందుబాటులో ఒకటో రెండో మరుగుదొడ్లు మాత్రమే ఉంటున్నాయి. విరామ సమయం కేవలం పదినిమిషాలే ఉండటంతో వందలమంది బారులు తీరాల్సిన వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది యూసుఫ్‌గూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల.. ఇందులో దాదాపు 500 మంది బాలికలు చదువుతున్నారు. ఈ పాఠశాలలో 5 టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. ఆ ఐదింటినే విద్యార్థినులతోపాటు ఉపాధ్యాయినులు వినియోగిస్తున్నారు. ప్రాంగణంలో ఉన్న బాలుర మూత్రశాలలకు పలు కారణాల వల్ల తాళం వేసి ఉంచడంతో పిల్లలు బహిరంగప్రదేశంలో మూత్ర విసర్జన చేస్తున్నారు.
ఈ చిత్రం బాలాపూర్ పరిధిలోని బబ్బుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనిది. ఇందులోనే ప్రాథమిక పాఠశాల కలిసి ఉంది. ఈ రెండింట్లో దాదాపు 700 మంది బాలికలు, 600 మంది బాలురు చదువుకుంటున్నారు. ఈ రెండు గదుల్లోనే విద్యార్థులు విసర్జన చేయాల్సి వస్తోంది.
ఇంట్లోనూ శుభ్రత ముఖ్యం..
‘ప్రపంచ మూత్రశాలల దినోత్సవం’ సందర్భంగా పరిశుభ్రత కూడా పరిశీలించాల్సిన అంశం. కొందరు ఇళ్లలో సైతం టాయిలెట్లను శుభ్రం చేసుకునేందుకు బద్ధకంగా వ్యవహరిస్తుంటారు. ఇందుకు కొన్ని అంశాలను తప్పనిసరి చేయాలని నిపుణులు చెబుతున్నారు. గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు శానిటైజర్లను తప్పకుండా వాడటం, ఎప్పటికప్పుడు ఫ్లషర్లను వాడటం మరిచిపోవద్దని సూచిస్తున్నారు. ఎక్కువ అనారోగ్య సమస్యలకు ఇంట్లోని అపరిశుభ్రతే కారణమవుతోందని హెచ్చరిస్తున్నారు.
గ్రేటర్ జనాభా: 1.2 కోట్లు
ప్రస్తుతం నగరంలో కనిపించే ప్రజా మరుగుదొడ్లు
*సులభ్ టాయిలెట్లు : 33
*బీఓటీ (గుత్తేదారులకు ఇచ్చినవి) మరుగుదొడ్లు : 157
*ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు : 77
*షీ టాయిలెట్లు : 28
*స్మార్ట్ టాయిలెట్లు : 4
*మొత్తం : 304
హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు : 690
*మొత్తం శౌచాలయాలు : 2,774
*వాటిలో పనిచేస్తున్న వి : 2,612 (విద్యాశాఖ వివరాల ప్రకారం)
తాజా వార్తలు
జిల్లా వార్తలు