close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

దగాఖానాలు

సగానికిపైగా ఆస్పత్రులకు అనుమతుల్లేవు, భద్రత కరవు
జీహెచ్‌ఎంసీ నోటీసులతో లోపాలు బట్టబయలు
ఈనాడు, హైదరాబాద్‌

ప్రజలకు ప్రాణం పోయాల్సిన ఆస్పత్రులు.. ఆయువు తీసే యమపురిలుగా మారాయి. సంపాదనే పరమావధిగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. అక్రమ నిర్మాణాల్లో, పార్కింగ్‌ సదుపాయం లేకుండా, అగ్ని ప్రమాదం జరిగితే బయటకు వెళ్లే దారి లేకుండా, నివారణ చర్యలకు తిలోదకాలిచ్చి, అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోపాటు  భాగ్యనగరంలోని ప్రైవేటు దవాఖానాల దుస్థితి ఇది.

మహానగరంలో గల్లీకో నర్సింగ్‌ హోమ్‌, రోడ్డుకో మల్టీ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు వెలుస్తున్నాయి. తాజాగా మెజార్టీ దవాఖానాలకు అనుమతుల్లేవని తేలుతోంది. ఇటీవల ఎల్బీనగర్‌లోని షైన్‌  ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు నిర్మాణాన్ని పరిశీలించగా అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే లోపలున్న వారు తప్పించుకుని బయటికి వెళ్లే మార్గం లేదని,  ఇతర లోపాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం దుర్ఘటనను తీవ్రంగా పరిగణించి.. నగరవ్యాప్తంగా ఆస్పత్రుల్లోని పరిస్థితులపై తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు బల్దియా ఎన్‌పోర్స్‌మెంట్‌ గుర్తించిన 1823 ఆస్పత్రులకు నోటీసులిచ్చింది. నివాస సముదాయాల్లో అక్రమంగా ఆస్పత్రుల నిర్వహణ, పార్కింగ్‌ స్థలాన్ని ఆక్రమించి గదులు నిర్మించడం, పైకప్పుపై అదనపు అంతస్తులు,  అనుమతిలేని నిర్మాణాల్లో ఆస్పత్రుల నిర్వహణ, ట్రేడ్‌ లైసెన్సు లేకపోవడం, అత్యవసర మెట్ల మార్గం, అగ్నిమాపక పరికరాలు, నీటి స్ప్రింక్లర్లు లేకపోవడం,  ఆస్తిపన్ను చెల్లించని యాజమాన్యాలు,  ఇతరత్రా ఉల్లంఘనలను అధికారులు  గుర్తించారు.

ఈ-నోటీసులు ఇలా.. నగరవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులకు ముందుగా జీహెచ్‌ఎంసీ చట్టంలోని 635 సెక్షన్‌ ప్రకారం యాజమాన్యాలు అనుమతులు, అగ్నిమాపక చర్యలు, ఇతరత్రా వివరాలు తెలియజేయాలని నోటీసులు వెళ్లాయి. అందుకు మూడు రోజుల గడువు ఉంటుంది. లేనిపక్షంలో అనుమతుల్లేవని భావిస్తూ చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలని సెక్షన్‌ 452(1) తాఖీదు వెళ్తుంది. వారంలో స్పందించాలి. లేదంటే చర్యలు తీసుకుంటామని, అందుకు సిద్ధమవ్వాలని తెలుపుతూ సెక్షన్‌ 452(2) నోటీసు వెళ్తుంది. అందుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌కు లేఖను పంపుతుంది. పంపిన ఏ ఒక్క నోటీసుకూ ఫలాన ఆస్పత్రి స్పందించలేదని, దాంతో వాళ్లకు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంటూ చర్యలకు అనుమతివ్వాలని కోరుతుంది. అలా వచ్చిన లేఖలన్నింటిని పరిశీలించాక డైరెక్టర్‌ 24 గంటల్లో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తారు.

వేర్వేరు రకాలుగా చర్యలు..: ‘‘రోగులు చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రులను వెంటనే మూసేయడం కుదరదు. వ్యాధిగ్రస్థులకు ఇబ్బంది కలగకుండా యాజమాన్యంపై వేటు వేయాలి.అలాంటి పరిస్థితులు ఉన్న వైద్యశాలల పరిపాలన గదులను, రుసుములు స్వీకరించే గదులను మూసేయాలని నిర్ణయించాం. రోజువారీ చికిత్సలు జరిగే ఆస్పత్రులను అక్రమ నిర్మాణాలుగా పేర్కొని తాళం వేస్తాం. ప్రమాదకర నిర్మాణాలను కూల్చేయాలని లేదా నీరు, విద్యుత్తు, నిలిపేయాలని ఆదేశిస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌విభాగం తెలిపింది.

* సెక్షన్‌ 635 నోటీసులు అందుకున్నవి.. 1823
సెక్షన్‌ 452(1) నోటీసులు..          963
* సెక్షన్‌ 452(2) నోటీసులు..         237
* అంటే మంగళవారం నాటికి 237 ఆస్పత్రులు వేటుకు సిద్ధంగా ఉన్నాయి. క్రమంగా వీటి సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే మొదటి నోటీసుకు స్పందించని వైద్యశాలలు ప్రస్తుతానికి 963 ఉండటం గమనార్హం.

లెక్కల్లోలేని వాటిని గుర్తిస్తాం..
విశ్వజిత్‌ కంపాటి, డైరెక్టర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం
ప్రస్తుతానికి బల్దియా పరిధిలో 1823 ఆస్పత్రులను గుర్తించి నోటీసులిచ్చాం. క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారుల సాయంతో వైద్యశాలలను గుర్తించే ప్రక్రియను కొనసాగిస్తున్నాం. దాంతో ఒక్కో ఆస్పత్రికి ఒక్కో తేదీన నోటీసులు వెళ్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు వెంటనే వివరాలు పంపిస్తుంటే, మరికొందరు నోరు మెదపట్లేదు. జవాబివ్వని వారిపై  చర్యలుంటాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.