బుధవారం, డిసెంబర్ 11, 2019
కలెక్టర్ డాక్టర్ శరత్
జగిత్యాల, న్యూస్టుడే: వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో వివిధ ప్రభుత్వ పథకాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలశాఖ ద్వారా 503 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్త్రీనిధి ద్వారా ప్రతి గ్రామైక్య సంఘాల్లో అర్హులైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆయా సంఘాల్లో 351 మంది వి.ఓ.లకు ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున 702 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందని తెలిపారు. ఈ నెల 22 నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి నియోజకవర్గాల వారీగా బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ బి.రాజేశం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, పరిశ్రమలశాఖ జీఎం శ్రీనివాస్, మైనార్టీ అధికారి సుందరవరదరాజన్, బ్యాంకు అధికారులు గౌతం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
కేసులను త్వరగా పరిష్కరించాలి
పలు శాఖలలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును రికవరీ చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనింగ్, పంచాయతీ, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ శాఖలలో ఉన్న పెండింగ్లో ఉన్న కేసులపై సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో సమన్వయం చేసుకొని కేసులను పరిష్కరించడంతోపాటు ఈ నెల 25 నాటికి 50 శాతం సొమ్మును రికవరీ చేయాలని కలెక్టర్ అన్నారు. కార్యక్రమం సంయుక్త కలెక్టర్ బి.రాజేశం, జడ్పీ సీఈవో ఎ.శ్రీనివాస్, డీఆర్వో అరుణశ్రీ పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు