close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

పంట నేలపాలు.. ధరలతో బేజారు

పెరిగిన కూరగాయల రేట్లు

దెబ్బతిన్న తీగజాతి

దళారులకే లాభం

న్యూస్‌టుడే, పూడూరు

దిగుబడులు తగ్గడంతో కూరగాయల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. గతనెలలో అధికంగా వర్షాలు కురవటంతో వేసిన పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఉత్పత్తులు విపణికి రాకపోవడంతో డిమాండ్‌ పెరిగింది. ఇదే అదునుగా దళారులు రంగప్రవేశర చేసి కొని తమ ఇష్టానుసారం ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వినియోగించే టమాటా ధర తగ్గుతూ పెరుగుతోంది. బీరకాయ కిలో రూ.70కి చేరింది. క్యారెట్‌, దొండకాయ కొనె పరిస్థితి లేకుండా పోయింది. అన్ని కూరగాయల ధరలు రూ.40 దాటడంతో అరకొరగానే వినియోగిస్తున్నారు...

జిల్లాలో నవాబుపేట, పూడూరు, మోమిన్‌పేట్‌, వికారాబాద్‌, ధారూరు, మర్పల్లి, పరిగి తదితర మండలాల్లో రైతులు వర్షాధారంపై అధికంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. వీటిలో అధికంగా టమాటా సాగు చేస్తున్నారు. ఎకరానికి పెట్టుబడి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చవుతుంది. పంట వారంలో రెండు, మూడు సార్లు చేతికి అందుతుంది. సాధారణంగా ఎకరానికి 25 కిలోల పెట్టెలు సుమారు 500 నుంచి 600 వరకు వస్తాయి. మూడు వారాల కిందట మార్కెట్‌లో కిలో రూ.10 పలికిన టమాటా ప్రస్తుతం రూ.40కి చేరుకుంది. రైతులకు లాభమే ఉన్నా దిగుబడులు విపరీతంగా తగ్గాయి.

గత నెల వర్షాలు కురవడంతో టమాటా పంట దెబ్బతింది. మొక్కలు నేలకు ఒరగటంతో కాయలు భూమికి తాకి పాడవుతున్నాయి. మొక్కకు నీరు ఎక్కువయ్యి కుళ్లు తెగులు సోకటంతో పిందెలు సైతం గట్టిపడకుండానే నేలరాలుతున్నాయి. తెగులు నివారణకు రైతులు వివిధ రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఖరీదైన క్రిమిసంహారక మందులు పిచికారీ చేయిస్తున్నారు. అయినా లాభం కనిపించటం లేదు. పంట దాదాపు ఒకనెల నుంచి నెలన్నర వరకు దిగుబడులు రావాల్సి ఉండగా పంట చేకితి వచ్చే మొదట్లోనే నాణ్యత కోల్పోయి విపణిలో డిమాండ్‌ తగ్గుతోంది. ఉన్న కొద్దిపాటి పంటకు ధర ఉన్నా, పెద్దగా ప్రయోజనం కలిగించటం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఇటీవల క్యారెట్‌ ధర పెరిగింది. వర్షాలతో పాటు ఇటీవల కురిసిన మంచు ప్రభావంతో పంట దెబ్బతిని నలుపు రంగుగా మారుతోంది. భూమిలో గడ్డ పరిమాణం తగ్గటంతో పాటు బురుజు ఊడిపోవటంతో తీసేందుకు కష్టపడుతున్నారు. ఇవే కాకుండా ప్రస్తుతం బీరకాయ, బెండకాయ, కాకర, దొండ వంటి అన్ని కూరగాయలకు ధరలు విపరీతంగా పలుకుతున్నాయి.

మార్కెట్‌కు పంటను సిద్దం చేస్తున్న రైతులు

దళారులకే ప్రయోజనం

పంట పండించిన రైతుల కంటే దళారులకే ప్రయోజనం చేకూరుతోంది. పూడూరు ప్రాంతంలో పండించిన వివిధ కూరగాయలను సమీపంలోని మన్నెగూడ, పరిగి, వికారాబాద్‌, చేవెళ్లలో జరిగే వారాంతపు సంతకు తరలిస్తారు. కమీషన్‌ ఏజెంట్లు వందకు రూ.10 పట్టుకుని రైతుకు పట్టీలు ఇస్తారు. రవాణా ఛార్జీలు, సంచులు, కూలీల ఖర్చులు అన్నిపోను పెద్దగా గిట్టుబాటు కావటం లేదు. దళారులు కమీషన్‌ ఏజెంటు వద్ద కూరగాయలు కొనుగోలు చేసుకుని చిల్లర అమ్మకాలు చేస్తూ లాభం పొందుతున్నారు. పంటకు సరియైన గిట్టుబాటు ధర లేనప్పుడు కొంత కాలంపాటు నిల్వ ఉంచుకునేందుకు శీతలగిడ్డంగులు లేవు. గోదాంలు అందుబాటులో లేకపోవటంతో రైతులు ఎప్పటికప్పుడు అమ్మకానికి తరలించాల్సిందే. ఈ ప్రాంతంలో కూరగాయల సాగు అధికంగా ఉన్నప్పటికీ అన్నదాతలను ఆదుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి.

కిలోకు కూరగాయ ధరలు రూపాయల్లో

పప్పుచారే తినాల్సి వస్తోంది

సాయన్న దినసరి కూలీ, బాకాపూర్‌

మార్కెట్‌లో ప్రస్తుతం కూరగాయల ధరలు విపరీతంగా ఉన్నాయి. సామాన్య కుటుంబాలు కూరగాయలను కొనలేని పరిస్థితి ఉంది. సొంతంగా పొలం లేకపోవటంతో కూరగాయలు కరవయ్యాయి. పొలం ఉంటే ఇంటికి సరిపడా సాగుచేసుకునేది. ఇతరుల వద్ద ఉన్నా, ధర ఉండటంతో ఎవరు పెట్టరు. దీంతో భారంగా మారింది మార్కెట్‌లో ధరలు అధికంగా పలుకుతుండటంతో కొనేందుకు వెళ్లటం లేదు. తినేందుకు పప్పుచారే దిక్కవుతోంది. యాసంగి పంటలు వస్తే తప్పా ఇప్పుడే ధరలు దిగేట్లు లేదు.

ధర ఉన్నా సగం పంట పోయింది

జంగయ్య, కండ్లపల్లి

మార్కెట్‌లో క్యారెట్‌కు ధర బాగున్నా సగం పంట పాడయింది. గత ఖరీఫ్‌ ప్రారంభంలోనే సాగు చేశాం. ప్రస్తుతం పంట చేతికి వచ్చింది. వర్షాలు నిత్యం కురవటంతో తేమ ఎక్కువయి అడుగు భాగంలో కుళ్లి పోతోంది. ఆకులు నల్లబారి రాలిపోయాయి. పంటను తీయటానికి రావటం లేదు. ఎక్కువ మంది కూలీలను పెట్టి తీయిస్తున్నా. లాభం వస్తుందనుకుంటే ఈ సారి నష్టాలే వస్తున్నాయి. ఉన్న కొద్దిపాటి పంటకు పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయి.

రూ.500 వెచ్చించినా వారానికి సరిపోవడంలేదు

పార్వతమ్మ, గృహిణి, మన్నెగూడ

ప్రతివారం మన్నెగూడలో జరిగే సంతలో వారానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేసుకునేది. ధరలు అదుపులో ఉంటే రూ.300 వచ్చేవి. ప్రస్తుతం రూ.500 పెట్టినా సరిపడా రావటం లేదు. ప్రతి కూరగాయలకు ధరలు ఉండటంతో కొన్నింటిని తక్కువ తీసుకోవటంతో పాటు కొన్నింటిని అసలే తీసుకోవటం లేదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.