close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

హక్కు... భవితకు దిక్కు

పిల్లలకు పెద్దలే అండాదండా

నేడు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం

బాల్యం.. ఓ అద్భుతవరం.. లేత బుగ్గలతో అమాయకత్వమే తప్ప అన్యాయ మెరుకగ ఆప్యాయతలు కోరుకునే వయసు. బంగారు బాల్యానికి మారుతున్న కాలం కష్టాలనే మోసుకొస్తోంది. పేదరికం.. వారి బతుకుల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ఆరోగ్యం, పోషణ, విద్య తదితరాలను బాల్య దశ నుంచే కొందరికి దూరం చేస్తోంది. వారి కోసం చట్టం రూపొందించిన హక్కుల్ని కాలరాస్తోంది. రేపటి తరానికి జ్ఞాన, శక్తిమంతమైన భారతదేశాన్ని అందించే గురుతర బాధ్యతలో ఒక అడుగు ముందుకు..రెండు అడుగులు వెనక్కి పడుతోంది. నేడు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో బాలల దైన్యస్థితి, వారికి అందుతున్న హక్కులు, పొందుతున్న సేవలు, తీసుకురావాల్సిన మార్పులు తదితరాలపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం..

న్యూస్‌టుడే, వికారాబాద్‌

వికారాబాద్‌ జిల్లాలో బాలబాలికల వికాసం కోసం ఈ దశలో వారి హక్కుల సద్వినియోగం కోసం గడిచిన పదేళ్లుగా ఆయా తరహాల్లో ప్రయత్నాలు ముమ్మరంగానే సాగుతున్నాయి. ఏయేటికాయేడు వస్తున్న విద్యా సంస్కరణలు, బాలల ప్రయోజనకర పథకాలు, పునరావాస చర్యలు చేపడుతూ ప్రభుత్వ యంత్రాంగం సహా పలు స్వచ్ఛంద సంస్థలు బాల్యదశ చీడల్ని రూపుమాపే తరహాలో చేపడుతున్న చర్యలు ఒకింత సత్ఫలితాల్నే అందిస్తున్నాయి.

విద్యా హక్కుతో ప్రయోగం..

విద్యా హక్కు చట్టం- 2010 అన్ని పాఠశాలల్లో అమలు అవుతోంది. దీని ద్వారా బడిబయట చదువుకు దూరంగా ఉన్న చాలా మందిని పాఠశాలల్లో చేర్పించడమే కాకుండా 8-14 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరికీ నిర్భంధ ఉచిత విద్యని అందించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.

బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్న చిత్రం

జిల్లాలో 2.86 లక్షల మంది బాలబాలికలు..

జిల్లాలో 2.86 లక్షల మంది బాలబాలికలు ఉండగా, జిల్లాలోని 176 జి.ప.ఉ. పాఠశాలలు, 112 ప్రాథమికోన్నత, 750 ప్రాథమిక, 24 ఇతర పాఠశాలల్లో 1,21,758 మంది బాలబాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతియేటా పాఠశాల ప్రారంభమయ్యే జూన్‌ మాసంలో బడిబాట కార్యక్రమం నిర్వహించి బడీడు పిల్లలను బడిలో చేర్పించడం మంచి ఫలితాలు ఇచ్చింది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1500 మంది బడి మానేసిన పిల్లలను తిరిగి చేర్పించారు. వీరు కాకుండా వికారాబాద్‌లో 48 మంది, మర్పల్లిలో 66, మోమిన్‌పేటలో 28, తాండూర్‌లో 74, కోట్‌పల్లిలో 28, కోడంగల్‌లో 65, దౌల్తాబాద్‌లో 51, బొంరాస్‌పేటలో 46, బషీరాబాద్‌లో 52, యాలాల్‌లో 42, పెద్దెముల్‌లో 38, పరిగిలో 49, పూడూర్‌లో 38, కుల్కచర్లలో 78, దోమలో 45 మంది బాలకార్మికులు ఉన్నారు. ధారూర్‌, బంట్వారం మండలాలను బాలకార్మిక రహిత మండలాలుగా అధికారులు ప్రకటించారు.

ఆపరేషన్‌ స్మైల్‌ పథకం కింద విముక్తి పొందిన బాల బాలికలు (పాత చిత్రం)

ఈ రోజే ఎందుకంటే..?

బాలల కోసం 1946 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ‘యునిసెఫ్‌’ను స్థాపించింది. మానవతా దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ బాలలకు ఆయా దశల్లో ఉండాల్సిన హక్కులను రూపొందించి, వాటి పరిరక్షణ, పురోభివృద్ధి విషయంలో అన్ని దేశాల్లో కార్యక్రమాలు చేపట్టింది. బాలల ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేసింది. ఇలా మొత్తం 155 దేశాలకు విస్తరించిన ఈ సంస్థ కృషిని గుర్తించి 1989 నవంబరు 20న ఐక్యరాజ్య సమితి పూర్తి హక్కులకు ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి బాలల హక్కుల దినోత్సవం అమల్లోకి వచ్చింది.

బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడాలి..

అధికారులు బాల్య వివాహాలను ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగడం లేదు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చినా, రెండు రోజులు ఆగి రహస్యంగా పెళ్లిళ్లు జరుపుతున్నారు. ఈ వివాహాలకు అడ్డుకట్ట పడాలంటే చట్టాలను మరింత కఠినతరం చేయాలి.

వారోత్సవాల నిర్వహణ

బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14 నుంచే వారోత్సవాలని గ్రామీణాభివృద్ధి, కార్మిక, విద్యాశాఖల ఆధ్వర్యంలో పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో నిర్వహించారు.

1098కు సమాచారం ఇవ్వండి

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. నిర్మూలన జరగలేదు. ఆయా ప్రాంతాల్లో చిన్నారులు కార్మికులుగా పని చేస్తున్నా సంబంధిత అధికారులు దాడులు చేసి.. జరిమానాలు విధించి కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు తప్పితే పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెరాస ప్రభుత్వం ‘ఆపరేషన్‌ స్మైల్‌’, ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి తొలి దశలో 160 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించింది. ఎవరికైనా బాల కార్మికులు తారసపడితే టోల్‌ ఫ్రీ సంఖ్య 1098కు సమాచారం అందించాలన్న కనీస బాధ్యతను విస్మరించకుండా ఉంటే చాలు.. బాల కార్మికవ్యవస్థ నిర్మూలనకు సహకరించిన వారమవుతామన్నది గుర్తుంచుకోవాలి.

ఐరాస తీర్మానాలు ఇలా..

ఐక్యరాజ్య సమితి 1989 నవంబరు 20న ప్రపంచ బాలలకు 54 హక్కులను తీర్మానించింది. దీనిని 1992 డిసెంబరు 11న భారతదేశం ఆమోదించింది. ఇవి 18 ఏళ్ల లోపు బాలలందరికీ వర్తిస్తాయి. మొత్తం హక్కుల్లో ముఖ్యమైనవి నాలుగు. అవి..

* జీవించే హక్కు: తల్లి గర్భంలో ఉన్న దశ నుంచి సమగ్రంగా ఎదిగేందుకు ఉద్దేశించినది.

* రక్షణ హక్కు: కుల, మత, లింగ, వివక్షత, నిర్లక్ష్యం, దౌర్జన్యం, హింసాత్మక చర్యల నుంచి విముక్తి. అంటు వ్యాధులు, కరవు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించడం.

* అభివృద్ధి హక్కు: స్వయం సమృద్ధితో, శాంతి సామరస్యాలతో, గౌరవంగా తీర్చిదిద్ది, అభివృద్ధి సాధించడానికి ఉద్దేశించినది.

* భాగస్వామ్య హక్కు: తమకు సంబంధించిన అన్ని నిర్ణయాలు, కార్యక్రమాలు, సమావేశాలలో పాల్గొనేందుకు.


ఉచితంగా పౌష్టికాహారం పంపిణీ

- జ్యోత్స్న, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమాధికారిణి

జిల్లాలో స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐదు ప్రాజెక్టులు వికారాబాద్‌, తాండూర్‌, మర్పల్లి, పరిగి, కోడంగల్‌లలో ఉన్నాయి. వీటి పరిధిలో 1106 అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిలో ఆరేళ్లలోపు పిల్లలు 18,270 మంది పౌష్టికాహార లబ్ధి పొందుతున్నారు. చిన్నారులకు ఈ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చక్కటి అవకాశం కలిగింది. ఈ పౌష్టికాహారం తింటే ఎంతో మేలు.


వైద్య పరీక్షలూ నిర్వహిస్తాం

- డాక్టర్‌ దశరథ్‌నాయక్‌, జిల్లా వైద్యాధికారి

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. వైద్య సేవలను మరింత మెరుగుపర్చి నెలకోసారి పాఠశాలలకు వెళ్లి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.