close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

అంధులకు బాసట.. అవార్డుల బాట!

‘జాతీయ ఉత్తమ బ్రెయిలీ ప్రెస్‌’గా దేవనార్‌ ఫౌండేషన్‌ ఎంపిక
బ్రెయిలి లిపిలో వేలాది పుస్తకాల ప్రచురణ
ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి పురస్కారం అందుకోనున్న పాఠశాల కరస్పాండెంట్‌ జ్యోతిగౌడ్‌

బేగంపేట (అమీర్‌పేట), న్యూస్‌టుడే: ‘కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు...’ అంటూ ప్రకృతిలోని రమణీయతను, రంగుల లోకాన్ని అంధురాలైన తన భార్యకు వివరించే ప్రయత్నాన్ని పాటరూపంలో కళ్లకు కట్టారు ఓ సినీ గేయరచయిత. వాస్తవానికి చూపులేనివారిలో అధికంగా ఉండే సంగ్రహణశక్తి, సృజనాత్మకతకు కాసింత ప్రోత్సాహం తోడైతే ఎటువంటి విపత్కర పరిస్థిలులనైనా ఎదుర్కొంటూ.. రాణించగలరు. ఇదే ప్రయత్నాన్ని 28 ఏళ్లుగా కొనసాగిస్తున్న దేవనార్‌ ఫౌండేషన్‌ ఫర్‌ బ్లైండ్‌ ఎందరో అంధ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. హైదరాబాద్‌ నగరం బేగంపేటలోని మయూరి మార్గ్‌లో 1991-92లో నలుగురు విద్యార్థులతో ఏర్పాటైన ఈ పాఠశాలలో ప్రస్తుతం 550 మంది విద్యార్థులు 10+2 తరగతుల వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఒక్క చదువేకాదు వివిధ రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. తాజాగా దేశంలోనే ఉత్తమ బ్రెయిలీ ప్రింటింగ్‌ ప్రెస్‌ విభాగంలో 2019 సంవత్సరానికి దేవనార్‌ ఫౌండేషన్‌ ఎంపికైంది. ఈ మేరకు సంస్థ కరస్పాండెంట్‌ జ్యోతి గౌడ్‌ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు. అంధులైన విద్యార్థులకు చేయూతనివ్వడం కోసం దేవనార్‌ ఫౌండేషన్‌కు ఇప్పటి వరకు 9 సార్లు వివిధ రాష్ట్రపతుల ద్వారా పలు అవార్డులు దక్కడం విశేషం. సంస్థ వ్యస్థాపకులు ఎ.సాయిబాబాగౌడ్‌కు పద్మశ్రీ పురస్కారం వరించింది.

ఎల్‌కేజీ నుంచి ఇంటర్‌ వరకు.. వృత్తి పరంగా నేత్రవైద్య నిపుణులైన ఎ.సాయిబాబాగౌడ్‌ అంధులైన విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలనే కాంక్షతో దేవనార్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఆయన భార్య జ్యోతిగౌడ్‌ సహకారంతో బేగంపేటలో దేవనార్‌ అంధుల పాఠశాలను ఏర్పాటు చేశారు. తొలుత నలుగురు విద్యార్థులు మాత్రమే ఇక్కడ చేరారు. ఆ తరువాత సంస్థ చేస్తున్న కృషికి సుదూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా ఇక్కడి పాఠశాలలో చేరడం ప్రారంభించారు. విద్యార్థులందరికీ ఉచితంగా విద్య, భోజనం, వసతి సౌకర్యాలను కల్పించడంతో పాఠశాలకు దేశంలోనే గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ సిలబస్‌ను అనుసరించి విద్యార్థులకు  ఇక్కడ చదువు చెబుతుంటారు. అయితే సాధారణ విద్యార్థుల్లాచూపులేని వారు చదవలేరు కాబట్టి వారికి తొలుత ప్రత్యేకమైన బ్రెయిలీ లిపిలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. పాఠ్యాంశాలను బయటి బ్రెయిలీ ప్రింటింగ్‌ ప్రెస్‌లలో బ్రెయిలీ లిపిలో తర్జుమా చేసేవారు. అయితే ఈ వ్యవహారం ఖర్చుతో కూడుకున్నది కావడంతో 1998లో సొంతంగా బ్రెయిలీ ప్రింటింగ్‌ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. ఫౌండేషన్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన జ్యోతి గౌడ్‌ బ్రెయిలీ ప్రింటింగ్‌ ప్రెస్‌ బాధ్యతలు చేపట్టారు. పాఠ్యపుస్తకాలతోపాటు విద్యార్థులు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేలా అన్ని మత గ్రంథాలు, కథలు, నవలలు, మహనీయుల జీవిత చరిత్రలు బ్రెయిలీలో అనువదించారు.

ఫౌండేషన్‌ కృషికి అంతర్జాతీయ గుర్తింపు
దేవనార్‌ ఫౌండేషన్‌ అందిస్తున్న కృషికి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభిస్తోంది. సంస్థలో జరిగే వివిధ కార్యక్రమాలకు విదేశీయులు ఎందరో హాజరవుతుంటారు. కాగా సంస్థ వ్యవస్థాపకులు సాయిబాబాగౌడ్‌కు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు లభించింది. ఇక సంస్థకు వివిధ సందర్భాల్లో 9 సార్లు రాష్ట్రపతుల చేతుల మీదుగా ఉత్తమ సేవా రంగంలో అవార్డులు దక్కాయి. ఆలిండియా సైన్స్‌ కాంగ్రెస్‌ ద్వారా రెండుసార్లు జాతీయ అవార్డులు దేవనార్‌ ఫౌండేషన్‌ సొంతమయ్యాయి. ఇతరత్రా అవార్డులు అనేకం వచ్చాయి.

ఉత్తమ బ్రెయిలీ ప్రింటింగ్‌ ప్రెస్‌-2019
దేవనార్‌ ఫౌండేషన్‌ ఫర్‌ బ్లైండ్‌ ద్వారా జ్యోతిగౌడ్‌ నిర్వహిస్తున్న బ్రెయిలీ ప్రింటింగ్‌ ప్రెస్‌కు దేశంలోనే ఉత్తమ బ్రెయిలీ ప్రింటింగ్‌ ప్రెస్‌-2019గా గుర్తింపు లభించింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబరు 3వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి ఆమె అవార్డును అందుకోనున్నారు. అంధ విద్యార్థులకు ఉపయోగపడే వేలాది పుస్తకాలను ఆమె బ్రెయిలీలోకి అనువదించారు. దీంతో పాటు బ్రెయిలీ లిపిలో అనువదించిన వివిధ పుస్తకాలను దేశంలోని అన్ని ప్రాంతాల్లోని గ్రంథాలయాలకు అందించారు.

ప్రైవేట్‌ సంస్థల్లోని ఖాళీల భర్తీకి ఉద్యోగ మేళా నేడు
విజయనగర్‌కాలనీ, న్యూస్‌టుడే: ప్రైవేట్‌ సంస్థల్లోని వివిధ ఉద్యోగాల భర్తీకి బుధవారం మిని ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. మార్కెటింగ్‌ ఏజెంట్లు, టీం లీడర్‌ సేల్స్‌, హెల్పర్లు, సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్‌లు, అకౌంటెంట్లు, కస్టమర్‌కేర్‌ ఎగ్జిక్యూటీవ్‌లు, బ్రాంచి రిలేషన్‌ ఆఫీసర్లు తదితర ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఎంబీఏ కలిగిన 18 నుంచి 35 సం.మధ్య ఉన్న అభ్యర్థులు తగిన ధ్రువపత్రాలతో నేరుగా ఉద్యోగ మేళాకు హాజరుకావచ్చన్నారు. ఇతర     వివరాలకు విజయనగర్‌కాలనీలోని జిల్లా ఉపాధి    కల్పన కార్యాలయంలో లేదా ఫోన్‌ నం.8247656356లో సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.