close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

గ్రామ ప్రథమ పౌరులే.. అక్రమాల్లో పాత్రధారులు

9 మంది సర్పంచులు, ఉప సర్పంచులు నిబంధనల ఉల్లంఘన
షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: చిన్న పదవి దక్కితే చాలు.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు సంపాదనకు ప్రజాప్రతినిధులు తెరతీస్తున్నారు. గుత్తేదారులు, స్థిరాస్తి వ్యాపారులతో చేతులు కలిపి నిబంధనలను వదిలేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలున్నాయి. నగర శివారు ప్రాంతాలు కావడంతో ఇక్కడి భూములకు విపరీతమైన ధర పలుకుతోంది. స్థిరాస్తి వ్యాపారులు విచ్చలవిడిగా లేఅవుట్లు వేస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. గండిపేట, హిమాయత్‌సాగర్‌ జలాశయాల చుటుపక్కల జీవో నం.111కు విరుద్ధంగా లేఅవుట్లు వేయడం లేదా కొత్తగా నిర్మాణాలు చేపట్టడం చేయకూడదు. దీన్ని పట్టించుకోకుండా అడ్డగోలుగా భూములను ప్లాట్లుగా మలచి స్థిరాస్తి వ్యాపారులు రూ.కోట్లు గడిస్తున్నారు. ఇందుకు స్థానిక సర్పంచులు తమ ‘వంతు’ సహకారం అందిస్తున్నారు. రియల్టర్ల నుంచి ముడుపులు తీసుకుని అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం- 2018 ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో రంగారెడ్డి జిల్లాలోని 9 మంది సర్పంచులు, ఉప సర్పంచులకు జిల్లా పంచాయతీ అధికారిణి పద్మజ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వీరంతా పది రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఇచ్చే వివరణతో సంతృప్తి చెందని పక్షంలో తదుపరి విచారణ చేపట్టి సస్పెండ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు సర్పంచి బల్వంత్‌రెడ్డిని నెల రోజుల కిందట కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. తాజాగా మరికొందరి అక్రమాలు వెలుగు చూసిన నేపథ్యంలో త్వరలో చర్యలు చేపట్టే వీలుంది.

నిబంధనల ఉల్లంఘన ఇలా..
* మొయినాబాద్‌ మండలం చిలుకూరు గ్రామంలో లేఅవుట్లు వేసినా సర్పంచి గునుగుర్తి స్వరూప పట్టించుకోకుండా వత్తాసు పలికారు. జీవో నం.111కు విరుద్ధంగా సర్వే నం.184, 185, 191, 192, 193, 258లో లేఅవుట్లు వేసినా అక్రమాలను అరికట్టాల్సిందిపోయి స్థిరాస్తి వ్యాపారులకు వత్తాసు పలకడంపై పంచాయతీ అధికారులు తాఖీదులు జారీ చేశారు.
* ఇదే మండలం తోల్కట్ట గ్రామంలోనూ అక్రమ లేఅవుట్లు, ఇళ్ల నిర్మాణానికి నిబంధనలను పక్కనపెట్టి స్థిరాస్తి వ్యాపారులతో చేతులు కలిపి సర్పంచి కనకమామిడి శ్రీనివాస్‌ అనుమతులు జారీ చేశారు. సర్వేనం.87, 135లో అక్రమ లేఅవుట్లను అరికట్టాల్సిన వ్యక్తే ఏకంగా అనుమతులు ఇవ్వడం గమనార్హం.
* కనకమామిడి సర్పంచి పట్లోళ్ల జనార్దన్‌రెడ్డి సైతం గ్రామంలోని సర్వేనం.81, 82, 100, 103లలో 32 ఎకరాల్లో వేసిన లేఅవుట్‌ వేయకుండా నిరోధించడంలో విఫలమయ్యారు. కనీసం పట్టించుకోకుండా వదిలేశారు.
* సురంగల్‌ సర్పంచి గడ్డం లావణ్య సైతం గ్రామంలోని సర్వేనం.34, 35, 36,48లలో 42ఎకరాల్లో వేసిన అక్రమ లేఅవుట్లను నిరోధించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నోటీసులు జారీ చేశారు.
* కందుకూరు మండలం పులి మామిడి గ్రామ సర్పంచి వత్తుల అనిత నిబంధనలను అతిక్రమించారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా చేపట్టిన పనులకు ఎలాంటి తీర్మానాలు, ఎంబీ రికార్డులు, రసీదులు, బిల్లులు లేకుండా ఆన్‌లైన్‌లో చెక్కులు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పంచాయతీ కార్యదర్శికి కనీసం సమాచారం ఇవ్వలేదు.
* మహేశ్వరం మండలం సిరిగిరిపూర్‌ సర్పంచి కాసుల సురేశ్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం వెనుక విభిన్న కారణం కనిపిస్తోంది. 30 రోజులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో చేసిన పనులకుగానూ ఓవైపు నిధులు వినియోగించుకుంటూ పంచాయతీలో రూ.20.22లక్షలు నిల్వ ఉంచుకుని.. నిధుల్లేవంటూ పత్రికల్లో తప్పుడు ప్రచారం సాగించారు.
* యాచారం మండలం మొండిగౌరెల్లి సర్పంచి బండమీది కృష్ణకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం వెనుక వాట్సాప్‌ ప్రచారం కావడం విశేషం. ఎంపీడీవోపై వాట్సాప్‌ గ్రూపులతోపాటు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడంతోపాటు పంచాయతీ కార్యదర్శికి సహకరించకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవమానకరరీతిలో ప్రవర్తిస్తుండడంతో ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని అధికారులు తాఖీదులు జారీ చేశారు.
* శంకర్‌పల్లి మండలం ఇర్రికుంట తండా ఉపసర్పంచి పి.లక్ష్మణ్‌ వ్యవహారశైలిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి సర్పంచి, కార్యదర్శి విధులకు ఆటంకం కలిగించినందుకు షోకాజ్‌ నోటీసులిచ్చారు.
* ఇదే మండలం మాసానిగూడలో చేసిన అభివృద్ధి పనులు, పంచాయతీ సిబ్బంది వేతనాలకు సంబంధించిన చెక్కులపై సంతకం చేయకపోవడంతో ఉపసర్పంచి పి.వెంకటేశ్వర్‌రెడ్డికి తాఖీదులు జారీ అయ్యాయి. దీనిపై ఇప్పటికే ఈయన సమాధానం ఇవ్వడంతో తదుపరి విచారణ చేసేందుకు చేవెళ్ల డీఎల్పీవోకు బాధ్యతలు అప్పగించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.