close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

నగరంపై సీఓపీడీ పంజా!

ధూమపానం చేసేవారికి పెనుముప్పు
వాయు కాలుష్యం కూడా కారణమే
అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన
20న ప్రపంచ సీఓపీడీ దినం
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో నిత్యం 150-170 మంది వస్తుంటారు. వారిలో దాదాపు 30 శాతం మంది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (సీఓపీడీ)తో బాధపడుతున్న వారే. వీరే కాకుండా ఏటా 10-15 శాతం మంది కొత్తగా సీఓపీడీ బారిన పడుతున్నారు. ఇందులో 25-35 మధ్య యువత ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్న వయస్సు నుంచే ధూమపానం చేయడం, పెరుగుతున్న వాయు కాలుష్యం ఈ రుగ్మతకు ప్రధాన కారణాలని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నెల 20న ప్రపంచ సీఓపీడీ దినం సందర్భంగా.. ఈ వ్యాధికి గల కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం..

శ్వాసకోశ సమస్యల్లో సీఓపీడీ చాలా తీవ్రమైనది. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే నిరంతరం ఔషధాలు వాడాలి. దీంతోపాటు అనేక జాగ్రత్తలు తప్పనిసరి. లేదంటే ప్రాణాలకే ముప్పు. మారుతున్న జీవనశైలిలో భాగంగా చాలామంది యువత పొగ తాగడానికి అలవాటు పడుతున్నారు. భవన నిర్మాణ రంగం, రసాయన పరిశ్రమలు, బియ్యం మిల్లులు, కాటన్‌, ఇటుక పరిశ్రమల్లో పనిచేసే వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సీవోపీడీ బారిన పడుతుంటారని వైద్యులు తెలిపారు. సిగరెట్‌ అలవాటు లేని వారూ ఈ వ్యాధి ముప్పు ఎదుర్కొంటున్నారు. ఇంటా, బయట సిగరెట్‌ పొగ పీల్చడం, వాయు కాలుష్యం బారిన పడటం ఇందుకు కారణాలు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, దగ్గు ఇతర లక్షణాలు సీఓపీడీలో సర్వసాధారణం. సుధీర్ఘ కాలం నిర్లక్ష్యం చేస్తే.. చివరికి గుండె ఆగిపోవడం, ఊపిరితిత్తుల కేన్సర్‌, ఊపిరితిత్తుల ధమనుల్లో అధిక రక్తపోటు, కుంగుబాటు లాంటి తీవ్రమైన అనారోగ్య ఇబ్బందులకు దారి తీస్తుంది.

వాయు కాలుష్యంతోనూ ముప్పే..
గ్రేటర్‌ వ్యాప్తంగా వాహనాల సంఖ్య 50 లక్షలకు దాటింది. వాటికి తోడు రోజూ రెండు వేల వాహనాలు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. దీంతో వాయు కాలుష్యం పెచ్చుమీరుతోంది. సికింద్రాబాద్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా కన్పిస్తోంది. ఇక్కడ వాయు కాలుష్యం కూడా ప్రమాదకరంగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిత్యం ట్రాఫిక్‌లో ఆరేడు గంటలపాటు తిరిగే వారు వాయు కాలుష్యం బారిన పడుతుంటారు. గాలిలో ఉన్న కార్బన్‌ మోకాక్సైడ్‌ ఇతర ప్రమాదకర రసాయన రేణువులు ముక్కు, నోటి ద్వారా ఊపిరితిత్తులకు చేరి సీఓపీడీ సమస్యకు కారణమవుతున్నాయి.


ప్రధాన కారణాలు...

* ధూమపానం
* వాయు కాలుష్యం
* జన్యు కారణాలు, వృద్ధాప్యం
* ఇతర ఊపిరితిత్తుల వ్యాధులు
* దీర్ఘకాలిక అస్తమా
* బాల్యంలో అంటువ్యాధులు సోకడం


తక్షణం పొగతాగడం మానేయాలి..
- డా.లతాశర్మ, పల్మనాలజిస్టు, కిమ్స్‌

సీఓపీడీ బారిన పడకుండా ఉండాలంటే తక్షణమే పొగతాగడం మానేయాలి. బయట కాలుష్యం బారిన పడకుండా చూసుకోవాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా మాస్క్‌ ధరించడం, హెల్మెట్‌ పెట్టుకోవడంతో కొంతవరకు వాయు కాలుష్యం నుంచి బయట పడవచ్చు. శౌచాలయాల శుభ్రతకు ఘాటైన యాసిడ్లు వాడటం, బెడ్‌షీట్లలో ఉండే దుమ్ము దూళి, ఇంట్లోకి గాలి, వెలుతురు రాకపోవడం కూడా ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతాయి. వ్యక్తిగత వాహనాలు పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు ప్రజా రవాణాను వినియోగించడం అవసరం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.