close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

బేగంపేట.. దోమలకు కోట!

నగరంలో ఇక్కడే మశకాల తీవ్రత అధికం
బోధకాలు, డెంగీ కారక దోమలకు ఆవాసంగా నాలా పరిసరాలు
దోమల సాంద్రత, రకాలను గుర్తిస్తున్న మస్కీట్‌ యంత్రం

బేగంపేట (అమీర్‌పేట), న్యూస్‌టుడే: డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ తదితర విషజ్వరాలు, వ్యాధులతో నగరవాసులను వణికిస్తున్న దోమలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయో తెలుసా? బేగంపేటలో.. అది కూడా బోధకాలు, మెదడు వాపు, డెంగీ వ్యాధి కారక దోమలు ఇక్కడ అధికం. నగరంలోనే దోమల సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతం కూడా బేగంపేటనే కావడం గమనార్హం. బేగంపేట బ్రాహ్మణవాడిలోని స్వామి రామానంద తీర్థ స్మారక కేంద్రం ఆవరణలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన మస్కీట్‌ యంత్రం తేల్చిన లెక్కలివి. దోమల రకాలు, వాటి సాంద్రతను తెలుసుకునేందుకు ట్రాక్‌ ఇట్‌ నౌ టెక్నాలజీస్‌తో కలిసి నగరంలోని బేగంపేట, బోరబండ, మలక్‌పేట, నాచారం, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు మస్కీట్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా దోమలను ఆకర్షించి, వాటి సాంద్రత, రకాలను లెక్కిస్తున్నారు. ఇలా లెక్కించగా బేగంపేట బ్రాహ్మణవాడిలో ఏర్పాటు చేసి మస్కీట్‌ యంత్రానికి చిక్కిన దోమలే అధికంగా ఉన్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 24 గంటల పాటు మస్కీట్‌ ద్వారా దోమలను ఆకర్షించగా బేగంపేటలో 200 వరకు గుర్తించారు. ఇది సాధారణం కంటే నాలుగు రెట్లు అధికం. ఆ తరువాతి స్థానాల్లో రోజుకు బోరబండలో 100కు పైగా, నాచారంలో 60కి పైగా, మలక్‌పేటలో 60 వరకు, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలంలో ఏర్పాటు చేసిన మస్కీటగ్‌ యంత్రంలో 40కి తక్కువగా దోమలు యంత్రానికి ఆకర్షితమయ్యాయి. యంత్రం ఏర్పాటు చేసిన ప్రాంతంలో చుట్టుపక్కల 250 మీటర్ల పరిధిలోని దోమలను అది ఆకర్షించగలదు. సుమారుగా పావుకిలోమీటరు ప్రాంతంలోని దోమల సాంద్రత లెక్కగట్టగలదు.

కూలెక్స్‌ దోమలు అధికం
బేగంపేటలో ఏర్పాటు చేసిన మస్కీట్‌ యంత్రానికి తొలి రెండు రోజులు ఈడిస్‌ ఈజిప్టితోపాటు మలేరియా కారక ఎనాఫిలిస్‌, బోధకాలు కారక క్యూలెక్స్‌ దోమలు పట్టుబడ్డాయి. ఆ తరువాత వరుసగా క్యూలెక్స్‌ దోమల గుంపును ఎక్కువగా గుర్తించారు. బేగంపేట నాలా పరివాహక ప్రాంతాలైన బ్రాహ్మణవాడి, మాతాజీనగర్‌, ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీ, అల్లంతోటబావి, ప్రకాష్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌, మయూరి మార్గ్‌లో దోమలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

వాసనకు ఆకర్షితం
శరీరం నుంచి వచ్చే చెమట వాసనను బట్టి దోమలు మనుషులను గుర్తిస్తుంటాయి. ఇందుకు అనుగుణంగానే మస్కీట్‌ యంత్రాల్లో జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న రసాయనాలను వినియోగిస్తుంటారు. అచ్చం మనిషి చెమట వాసన మాదిరిగానే మస్కీట్‌ యంత్రం వాసనను వెలువరిస్తుంది. 250 మీటర్ల పరిధిలో దీని ప్రభావం ఉంటుంది. దీంతో దోమలు యంత్రం ఉన్నచోట మనిషిగా భావించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గొట్టం ద్వారా దానికి అనుసంధానించిన పెట్టె(బాక్స్‌)లోకి చేరతాయి. ఇలా రోజుకు ఎన్ని దోమలు చొప్పున చిక్కుకున్నాయో లెక్కిస్తారు. మస్కీట్‌ యంత్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిప్‌, సెన్సార్ల ద్వారా యంత్రం ఉన్న చోటకు రాకుండానే ఎన్ని దోమలు చిక్కుకున్నాయి.. అందులో ఏఏ రకం ఉన్నాయనే విషయాన్ని కమాండ్‌ కంట్రోల్‌ కార్యాలయం నుంచే అంచనా వేసే వీలుంటుందని ట్రాక్‌ ఇట్‌ నౌ టెక్నాలజీస్‌ సంస్థ సీనియర్‌ ఎగ్జిక్యుటివ్‌ ఎంటమాలజిస్ట్‌ డా।। పటాన్‌ ఉస్మాన్‌ఖాన్‌ తెలిపారు.

గణాంకాల ఆధారంగా దోమల నిర్మూలన
మస్కీట్‌ యంత్రాల ద్వారా నమోదైన దోమల సాంద్రత, రకాల గణాంకాలను ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ అధికారులు పరిశీలిస్తుంటారు. వాటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో తిష్ఠవేసిన దోమలను నియంత్రించడం కోసం ఫాగింగ్‌ చేయడం, నాలాలు, కాల్వల్లో యాంటీ లార్వా మందు పిచికారీ చేయడం, చెత్తచెదారం తొలగించడం, రాలిన ఆకులను తొలగించడం తదితర చర్యలు చేపడుతుంటారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.