close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

నుమాయి‘ష్‌’

నిర్వహణలో ఎవరి పెత్తనం వారిదే
అగ్నిమాపకశాఖ అనుమతి ఇవ్వకుండానే ఏర్పాట్లు
స్టాల్స్‌ నిర్వహణకు 30-40శాతం ధరల పెంపు
ఉన్నతాధికారుల ఆగ్రహం
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, అబిడ్స్‌:

వందలాది దుకాణాలు..రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలు.. లక్షల సంఖ్యల సందర్శకులు.. హైదరాబాద్‌ మహానగరంలో షాపింగ్‌మాళ్లు,ప్రదర్శన కేంద్రాలు అన్నీ నిత్యం రద్దీగా ఉంటాయి. వారాంతపు సమయంలో కిక్కిరిసిపోయేంతగా కొనుగోలుదారులు పోటీపడతారు. ఇలాంటి ప్రదేశాల్లో భద్రత గాల్లో దీపంలా మారుతోంది. ఏదైనా ఘటన జరిగినపుడు హడావుడి చేసే యంత్రాంగం ఆ తరువాత చేతులెత్తేస్తోంది. ఉన్నతస్థాయి పైరవీలు, పలుకుబడి ఉన్న పెద్దల జోక్యంతో నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. గతేడాది నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగిన అగ్నిప్రమాదం ఆస్తినష్టాన్ని మిగిల్చింది. ప్రాణనష్టం సంభవించకపోవటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ప్రదర్శనల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీచేశారు. కానీ ఆచరణలో పర్యవేక్షణ మరిచింది. ఫలితంగా ప్రదర్శనల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

కన్నెత్తి చూడని యంత్రాంగం
నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నుమాయిష్‌ 2020 ప్రదర్శనకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.2.1కోట్ల వ్యయంతో భూగర్భ విద్యుత్తు తీగలు, లక్షన్నర లీటర్ల నీటిసంపు, అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే మంటలను అదుపు చేసేందుకు అనువుగా పైపులను ఏర్పాటు చేస్తున్నారు. అఖిల భారతీయ ప్రదర్శనకు దేశం నలుమూలల నుంచి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతుంటారు. రోజూ లక్ష మంది సందర్శకులు వస్తుంటారు. కాగా ఈ ఏడాది ప్రదర్శన నిర్వహణకు ముందుగానే చేపట్టాల్సిన చర్యలను స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు కేటాయించాలని ఉత్తర్వులో పేర్కొంది. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం నాలుగు నెలల క్రితమే స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎగ్జిబిషన్‌ సొసైటీ నిర్వాహకులు మాత్రం కొద్దిరోజులు ముందుగా అగ్నిమాపక నిబంధనల అమలుకు శ్రీకారం చుట్టారు. కేవలం పదిరోజుల వ్యవధిలో పనులు పూర్తిచేస్తామని వారం రోజుల కిందట మీడియా సమావేశంలో వెల్లడించారు. కానీ ఇప్పటికీ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. అగ్నిప్రమాదం జరిగినపుడు ఆగమేఘాల మీద పరుగులు పెట్టించి నిబంధనలు రూపొందించిన అధికార యంత్రాంగం ఇప్పటి వరకూ అటువైపు కన్నెత్తి చూడకపోవటం గమనార్హం.

అనుమతి ఉన్నట్టా.. లేనట్టా!
జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పోలీసు నాలుగు శాఖల నుంచి ప్రదర్శనకు అనుమతులు తప్పనిసరి. ప్రభుత్వం రూపొందించిన నియమావళిని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎగ్జిబిషన్‌ సొసైటీ నిర్వాహకులు చెబుతున్నారు. అన్ని శాఖల నుంచి అనుమతులు కూడా వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే నమ్మకంతో అనుమతులు రాకుండానే స్టాల్స్‌ ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గతేడాది వరకూ ఒక్కో స్టాల్‌కు రూ.35,000 వరకూ ఉండే ధరను ఈ ఏడాది రూ.50,000 పెంచారు. ఇవేకాకుండా ప్రత్యక్ష వేలంపాట ద్వారా మరికొన్ని వ్యాపార దుకాణాలను కేటాయిస్తారు. వాస్తవానికి ప్రదర్శన నిర్వహించే ప్రదేశం కేవలం 1700-1800 వరకు దుకాణాల ఏర్పాటుకు సరిపోతుందని అధికారులు అంచనా వేశారు. కానీ నిర్వాహకులు అనధికారికంగా 2500-2900 దుకాణాలకు అనుమతులు ఇస్తున్నట్టు అగ్నిప్రమాద సమయంలో అధికారులు గుర్తించారు. ఈ మేరకు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి కూడా అందజేసినట్లు సమాచారం. నిబంధనలు అమలు చేయకుండానే దుకాణాల ఏర్పాటుకు రుసుం స్వీకరించటం, ప్రదర్శన సమయం ముందుగానే ప్రకటించటాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అనుమతులు లేకుండానే నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరించటంపై ప్రభుత్వానికి సమాచారం అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆస్తికి భద్రత.. ప్రాణాలకు రక్షణ
భారీసంఖ్యలో ప్రజలు గుమిగూడే సందర్భాల్లో ప్రజాభద్రతకు నిర్వాహకులు చేపట్టాల్సిన ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది. మత, సాంస్కృతిక సమావేశాలు, ప్రదర్శనలు, క్రీడాపోటీలు, వినోద కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలు తదితర ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీచేశారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. అగ్నిప్రమాద నివారణ, భద్రత, రక్షణకు నిర్వాహకులు తీసుకున్న చర్యలను ఆయా విభాగాలు అధికారులు వేర్వేరుగా అనుమతులు కేటాయించాల్సి ఉంది. వీటిపై రెండు నెలల వ్యవధిలో జిల్లా అధికారులతో ఉన్నతాధికారులు నాలుగైదుసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. నుమాయిష్‌ 2020 విషయంలో నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.