close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

కంటి చూపుపై స్మార్ట్‌ దెబ్బ!

ఇంటా బయటా సెల్‌ఫోన్లకే పరిమితం
పిల్లల నుంచి పెద్దల వరకు అదే సమస్య
సరోజినీదేవి ఆసుపత్రికి పెరుగుతున్న బాధితులు
ఈనాడు, హైదరాబాద్‌

చాలామంది గంటల తరబడి స్మార్ట్‌ ఫోన్లకు అతుక్కుపోవడం రకరకాల నేత్ర సమస్యలకు దారితీస్తోంది. పిల్లలకు, పెద్దలకు అదే సమస్యగా ఉంటోంది. పలువురు ఇంట్లో ఉన్నా, కార్యాలయాలకు వచ్చినా, ఏ మాత్రం సమయం దొరికినా చాలు.. ఫోన్లకే పరిమితమవుతారు. పిల్లలు అల్లరి చేయకుండా కొందరు తల్లిదండ్రులు వారి చేతిలో సెల్‌ఫోన్‌ పెట్టి తమ పనులు చూసుకుంటున్నారు. ఇంట్లో ఒక మూలకు చేరి ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుతుండటం పరిపాటి.

ఒక్క ఫోన్‌ మాత్రమే కాదు- ట్యాబ్‌, కంప్యూటర్‌, ఇలా ఎలక్ట్రానిక్‌ పరికరాలపై ఎక్కువ సమయం వెచ్చించడంతో ఇతర శారీరక, మానసిక సమస్యలు..కంటి ఇబ్బందులూ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో నెలకు 80-100 మంది ఈ తరహా సమస్యలతోనే చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇతర ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు నేత్ర సమస్యలతో వచ్చేవారి సంఖ్య కూడా పెరుగుతోందని చెబుతున్నారు.

పలు రకాల కంటి సమస్యలు...
ప్రస్తుతం ఎలక్ట్రానిక్‌ పరికరం లేని ఇల్లంటూ లేదు. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ఇంట్లో రెండు, మూడు ఫోన్లకు తక్కువ లేకుండా ఉన్నాయి. ఇవి చిన్న పిల్లలతో పాటు పెద్దలపైన విపరీత ప్రభావాన్ని చూపుతున్నాయి. స్కూల్‌ నుంచి పిల్లలు ఇంటికి వచ్చాక అల్లరి చేస్తుండటంతో చాలామంది తల్లిదండ్రులు తమ స్మార్ట్‌ ఫోన్‌ లేదా ట్యాబ్‌ను ఆడుకోవడానికి చేతిలో పెడుతున్నారు. పెద్దలూ సామాజిక మాధ్యమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. కార్యాలయాల్లో ఏ కాస్త సమయం దొరికినా వాటికే అంకితమవుతున్నారు. కొందరైతే బానిసలుగా మారుతున్నారు.పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండానే వారి ఫోన్లలో వివిధ రకాల గేమ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని మరీ గంటల తరబడి చూస్తున్నారు. దీంతో పిల్లలు, పెద్దల్లో వివిధ ఎలర్జీలు, డ్రై ఐస్‌ సమస్యలు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కళ్లలో మంట, దురద, కళ్లు ఎర్రగా మారడం, లైట్‌ను నేరుగా చూడలేకపోవడం తదితర లక్షణాలుంటాయి. ఇది తీవ్రమైన నేత్ర సమస్యలకు దారితీస్తోంది. స్మార్ట్‌ఫోన్లు,   ట్యాబ్‌లను వాడేప్పుడు వచ్చే తేజోవంతమైన కాంతి(బ్లూ రేస్‌) కంటి రెటీనాపై ఒత్తిడి తెస్తుంది. అలర్జీలు, డ్రైఐస్‌కు కారణమిదేనని కంటి ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
పిల్లలు, పెద్దల్లో కళ్లు ఎర్రబడటం, దురద, మంట లాంటి సమస్యలు మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువగా వేధిస్తుంటే వెంటనే నిపుణులకు చూపించాలి. అత్యంత జాగరూకతతో ఉండాలి.

ఈ జాగ్రత్తలు అవసరం
* నూతనంగా వచ్చే ఏ సాంకేతికతైనా అవసరాలు తీర్చడానికి మాత్రమే ఉపయోగపడాలి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ కూడా మనిషి జీవితంతో అంతలా పెనవేసుకుంది. ఫోన్ల వాడకంలో ఎవరికి వారు ఒక పరిమితి విధించుకోవాలి. సమాచారం తెలుసుకోవడం, మార్పిడి కోసమే వినియోగించాలి.
* అవసరమున్నా లేకున్నా అదేపనిగా సామాజిక మాధ్యమాలతో గడపటం మానుకోవాలి. ఇంటికి చేరాక అత్యవసర కాల్స్‌ మాట్లాడటం తప్ప, సామాజిక మాధ్యమాల్లో తలదూర్చక పోవడం ఉత్తమం.
* పడుకునేముందు ఫోన్లు వాడకపోవడం మంచిది. అదేపనిగా ఫోన్లు చూడటం వల్ల ఆ కాంతి కంటిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తద్వారా నిద్ర రాదు. తలను ఒక పక్కకు వంచి ఫోన్‌ చూడటం వల్ల మెడ, వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
* పిల్లలు ఏ అలవాటైనా తల్లిదండ్రులు లేదా పెద్దల నుంచే నేర్చుకుంటారు. స్మార్ట్‌ ఫోన్‌, ట్యాబ్‌లను వారికి ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలకు అసలు వాటిని అలవాటే చేయ కూడదని నిపుణులు చెబుతున్నారు.
* ఒకేచోట కూర్చొని చూడటం వల్ల కంటికే కాదు, శరీరానికీ ముప్పే. కదలకుండా కూర్చోవడంతో పిల్లలు, పెద్దల్లో శారీరక శ్రమ తగ్గి అది అధిక బరువుకు కారణమవుతోంది. ఇదే అనేక వ్యాధులకు హేతువు.
* ముఖ్యంగా స్కూళ్ల నుంచి వచ్చిన వెంటనే పిల్లలకు ఇంటా బయటా ఆటలు అలవాటు చేయాలి. ఆరోగ్యపరంగా ఇది ఎంతో మంచిది. శారీరక శ్రమ పెరిగి, ఫిట్‌నెస్‌ సంతరించుకుంటారు. చదువులో చురుకుగా ఉంటారు.
* పెద్దలు కంప్యూటరు, స్మార్ట్‌ ఫోన్లకు స్క్రీన్‌ గార్డ్స్‌, ప్రత్యేక కళ్లద్దాలు వాడటం వల్ల కొంతవరకు నేత్రసంబంధ ముప్పు నుంచి బయటపడవచ్చు.
* పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను 20 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇవ్వకూడదు.
*  పెద్దలు 20 నిమిషాలసేపు కంప్యూటర్‌ ముందు ఉంటే, తర్వాత 2 నిమిషాల పాటు కంటికి విశ్రాంతి ఇవ్వాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.