సోమవారం, డిసెంబర్ 09, 2019
దాడులను ఎదుర్కొనేందుకు ఒంటిపై వస్తువులే ఆయుధాలు
మానసిక స్థైర్యమే ప్రమాదాల నుంచి తప్పిస్తుంది
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
పాలిచ్చే తల్లి పాలించే రోజు వచ్చినా.. అన్ని రంగాల్లో మహిళలు సాధికారిత సాధిస్తున్నా.. మహిళలపై జరుగుతున్న దాడుల్లో మాత్రం ఏ మార్పు రావట్లేదు. లైంగిక, శారీరక, మానసిక వేధింపులు ఏమాత్రం తగ్గడం లేదు.. పసికందు నుంచి పండు ముసలి దాకా వయోభేదం లేకుండా ప్రతి స్త్రీ ఏదో ఓ చోట నిత్యం వేధింపులకు గురవుతూనే ఉంది.. ఇప్పుడు దాడులకు సైతం తెగిస్తున్న దుండగుల చేతిలో బలవుతూనే ఉంది. ఇటీవల నగరంలో ఎమ్మార్వో విజయారెడ్డి హత్య మహిళా ఉద్యోగుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది.. అయితే ఇలాంటి వేధింపుల నుంచి తప్పించుకునే శక్తి వారిలోనే ఉంది. మహిళ శారీరకంగా అబలే అయినా మానసికంగా సబలే.. దాడి సమయంలో కొంచెం సమయస్ఫూర్తి ప్రదర్శిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఆ ఆలోచనను అంతం చేద్దాం..!
ఎదుటి వ్యక్తి దాడి చేస్తున్నాడనే విషయం తెలియగానే నిశ్చేష్ఠులవుతారు మహిళలు.. దానికి కారణం మాకు ఎదురించే శక్తి లేదనే ఆలోచన మనసులో బలంగా ముద్రపడటం. అయితే పురుషులు శారీరకంగా బలవంతులైనప్పటికీ మానసికంగా మాత్రం మహిళలే బలవంతులు. క్షణాల్లో నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా స్త్రీలకే ఎక్కువుంటుందంటున్నారు నిపుణులు. దుండగుల దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు మహిళా ఉద్యోగులకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చేందుకు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం(ఎంసీహెచ్ఆర్డీ) అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు శిక్షణనిస్తుండగా ఇటీవలే 220మందికి శిక్షణ పూర్తయింది. మరో కొత్త బ్యాచ్‌తో శిక్షణ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక్కడ ప్రాక్టికల్ శిక్షణతో పాటు థియరీ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏడాదిలో 5వేల మందికి ఉద్యోగినులకు తర్ఫీదునివ్వాలని ఎంసీహెచ్ఆర్డీ నిర్ణయం తీసుకుంది.
త్రికరణ సూత్రం..
ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు మహిళలకు మూడు సూత్రాలు ఉపయోగపడతాయి.
* వేగం : దుండగుడు ఏం చేయబోతున్నాడో క్షణాల్లో పసిగట్టాలి.. వేగంగా స్పందించి తప్పించుకునే ఆలోచన చేయాలి.
* నియంత్రణ : దాడి జరిగాక కిందపడకుండా శరీరాన్ని స్వీయ నియంత్రణ చేసుకోవాలి. భయం రానివ్వకుండా మనసును నియంత్రించుకోవాలి.
* ఎదురుదాడి : స్వీయ నియంత్రణ చేసుకుంటూనే దుండగున్ని ప్రతిఘటిస్తూ.. ఎదురుదాడి చేయాలి. అందుకు పరిసరాలే ఆయుధాలవ్వాలి.
ఇవీ మీకు రక్షణే..
* కరాటే నేర్చుకోండి..: ఇది మహిళలకు ఆత్మరక్షణ సాధనం. కరాటేలు, థైక్వాండో ఎందుకనే మాటలు పట్టించుకోవద్దు. మారుతున్న సమాజంతో పాటు పెరుగుతున్న దాడుల నుంచి తనకు తాను కాపాడుకునే మార్గాన్ని ఇవి నేర్పిస్తాయి. కాళ్లను, వేళ్లను ఉపయోగించే ఎదుటి వ్యక్తిని ఎదుర్కోవడం నేర్చుకోవచ్చు.
* ఆర్చరీ..: ఈ విలువిద్య ఎదురుగా నిలిచన దుండగున్ని గురిచూసి కొట్టడాన్ని నేర్పిస్తుంది. చేతిలో, పరిసరాల్లో ఉన్న వస్తువులను ఉపయోగిస్తూ ప్రమాదాల నుంచి తప్పించుకోవడమెలా చెబుతుంది..
* డ్రైవింగ్..: ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు డ్రైవింగ్ తప్పనిసరి. ఓ బండి నడిపే మెలకువలు తెలిసిన వారు ప్రమాదాల నుంచి క్షణాల్లో తప్పించుకునే తెగువ, సమస్యల్ని చేదించే విధానం నేర్చుకుంటారు.
ఏం చేయాలి మరి..!
పనిచేసే కార్యాలయానికో.. కాలేజీకి వెళ్లే సమయంలోనో దుండగులు దాడికి తెగబడుతుంటారు. ఇలాంటి సమయంలో చాలామంది మహిళలు భయంతో కళ్లు మూసుకుంటారు. ఇదే ప్రధాన సమస్య. ప్రత్యర్థి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తేనే దానికి పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఓ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు చేతిలో ఉన్న వస్తువుల్ని ఆయుధంగా వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* ఆగంతకుడు ముందు నిలిచినప్పుడు.. ఎదుర్కొనేందుకు ఏ ఆయుధం అక్కర్లేదు.. మీ ఒంటిపై ఉన్న వస్త్రమే మీ కరవాలం.. మీ బల్లపై ఉన్న పెన్ను, తలలో ఉన్న పిన్ను చేతిలోని కత్తులు.. చేతిలో ఉన్న గొడుగు, చేతి గోర్లు, గాజులు ఇవే పదునైన ఆయుధాలు.. ప్రమాదం నుంచి బయట పడేసే మార్గాలు.
తక్షణ ఆయుధం పెప్పర్‌స్ప్రే
చుట్టూ ఎవరున్నా లేకున్నా తనను తాను రక్షించుకునేందుకు స్త్రీకి ఉన్న ప్రధాన ఆయుధం మనోధైర్యమైతే.. తక్షణ ఆయుధం పెప్పర్‌స్ప్రే.. ఎదుటివారి ముఖంపై పెప్పర్ స్ప్రే ప్రయోగం చేయడం ద్వారా వారికి ఊపిరాడకుండా చేయొచ్చు.
ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి..
- లక్ష్మీ, ఆత్మరక్షణ శిక్షకురాలు
ఆడవాళ్ల శక్తిని తక్కువ చేస్తుండటమే దాడులకు ప్రధాన కారణం. ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి. మానసికంగా ధైర్యంగా ఉండి తక్షణం తప్పించుకునే ఆలోచనలు చేయాలి. ప్రతి వస్తువును ఆయుధంగా వాడుకోవచ్చు. వాటితోనే ప్రత్యర్థిని ఎదురించొచ్చు. ఆ మెలకువల కోసం ఆత్మరక్షణ విద్యలో శిక్షణ తీసుకోవడం ఉత్తమం.
నగర పోలీసులను సంప్రదించొచ్చు.
తక్షణమే 100కి డయల్ చేయడం ప్రథమ మార్గం వివరాలను మూడు కమిషనరేట్లకు వాట్సాప్ చేయొచ్చు..
రాచకొండ : 9490 617111
సైబరాబాద్ : 94906 17444
హైదరాబాద్ : 94906 16555
తాజా వార్తలు
జిల్లా వార్తలు