శనివారం, డిసెంబర్ 07, 2019
ఝార్ఖండ్ జాంతారా ముఠా సభ్యుల తీరే వేరు
16 ఏళ్ల నుంచే సైబర్ మోసాలు
ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు
ఈనాడు, హైదరాబాద్: పొద్దునే లేస్తారు. చక్కగా తయారవుతారు. ఠంఛన్‌గా ద్విచక్రవాహనంపై బయలుదేరి అడ్డాకు చేరుకుంటారు. అక్కడి నుంచి అందరూ కలిసి బయలుదేరుతారు. వాళ్లంతా ఏ కార్యాలయానికో వెళ్తున్నారనుకుంటే పొరపడినట్లే. పక్కనే ఉన్న అడవుల్లోకి వెళ్తారు. చెట్ల కింద కూర్చుని సైబర్ వల విసురుతారు. సాయంత్రం ఇంటికి చేరుకుంటారు. ఎవరైనా వలలో చిక్కితే పండగ చేసుకుంటారు. పలు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పులు పెడుతున్న సైబర్ కేటుగాళ్లు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని జాంతార్ జిల్లాలో ఉన్నారు. వీరి తతంగాన్ని చూసి సైబరాబాద్ పోలీసులు ముక్కున వేలేసుకున్నారు.
చదువుకున్న ఒకరిద్దరే గురువులు!
జాంతారా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సైబర్ కేటుగాళ్ల ఇళ్లు దూరం దూరంగా విసిరేసినట్లుగా ఉంటాయి. 2 వేల నుంచి 3 వేల అడుగుల విస్తీర్ణంలో ఉండే ఇంటి చుట్టూ 8 అడుగుల నుంచి 10 అడుగుల ప్రహారీ ఉంటుంది. ఓ ప్రణాళిక ప్రకారం కాకుండా ఇష్టారీతిగా ఇళ్లను కట్టుకుంటారు. ముందు నుంచి పోలీసులు ముట్టడిస్తే జారుకునేందుకు వీలుగా ప్రతి ఇంటికి ఓ రహస్య తలుపుంటుంది. 16 ఏళ్ల ప్రాయం నుంచే రంగంలోకి దిగుతారు. ఈ ప్రాంతాల్లోని పురుషుల ప్రధాన వృత్తి సైబర్ మోసాలు. పదో తరగతి, అంతకంటే ఎక్కువ చదువుకున్నోళ్లను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. పోలీసులకంటే ముందుగానే మార్కెట్లోకొచ్చే సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధిస్తారు. ఆ ప్రాంతంలో ఒకరిద్దరు బాగా చదువుకున్న వ్యక్తులు ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తారు. ఎలా మోసాలకు పాల్పడ్డాలో వివరించి ఒక్కొక్క కేటుగాడి నుంచి కొంత కమీషన్ వసూలు చేసుకుంటారు.
మూడు నెలలకంటే ఎక్కువ చేయరు..!
ఒకే రకమైన మోసాన్ని మూడు నెలలకంటే ఎక్కువ చేయరు. అటు పోలీసులు, ఇటు ప్రజలకు మోసం గురించి అవగాహన రాగానే కొత్తదారులు వెతుక్కుంటారు. ఒకప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఓటీపీ మోసాలకు పాల్పడేవారు. ఇప్పుడు కొత్తగా గూగుల్ లింక్‌లను పంపించి ఖాతాల్లోని డబ్బులను స్వాహా చేస్తున్నారు. ఊర్లోకి కొత్త వ్యక్తులు వచ్చారంటే చాలు క్షణాల్లో సమాచారం చేరుతుంది. ఈ సమాచారాన్ని అందజేసేందుకు గ్రామ పోలీస్ అధికారి(చౌకీదార్)కి ప్రతినెలా కొత్త మొత్తాన్ని చెల్లిస్తారు. ఆహార్యం, మాట తీరు, ఎత్తు తదితర అంశాల ఆధారంగా కొత్త వ్యక్తులను ఇట్టే పసిగడతారు. ఊర్లో ఉన్నప్పుడు పట్టుకోవడం అసాధ్యం. పొలిమేరలు దాటాక మాటు వేసి పట్టుకోవాలి. లేదంటే అర్ధరాత్రి ఇంటికెళ్లి అదుపులోకి తీసుకోవాల్సిందే.
అంతా వాట్సాప్‌లోనే..
డబ్బు కాజేసే వ్యవహారంలో పక్కాగా వ్యవహరిస్తారు. మోసంలో పాలుపంచుకునే వ్యక్తులు ఒకరి ముఖం ఒకరు చూసుకోరు. అంతా వాట్సాప్‌లోనే నడిపింస్తారు. అవసరమైతే తప్ప ఫోన్లో మాట్లాడుకోరు. పని పూర్తి కాగానే పద్ధతి ప్రకారం ఎవరి వాటా వారికి అందుతుంది. పోలీసులకు దొరికినా డబ్బులు సీజ్ కాకూడదనే ఉద్దేశంతో సిమెంట్, ఇసుక, కంకర తదితర నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఒకవేళ ఇళ్లు పూర్తైతే బంగారంపై మక్కువ చూపిస్తారు. ఒక్కో వేలుకి ఒక్కో ఉంగరం పెట్టుకుంటారు. ఇంట్లో ఏసీలు, ఖరీదైన గృహోపకరణాలు కనిపిస్తాయి. విమానాల్లో ప్రయాణిస్తారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు