శుక్రవారం, డిసెంబర్ 06, 2019
రూ.వేయి కోట్లకు చేరువవడంతో ఆందోళన
ఆపసోపాలు పడుతోన్న జలమండలి
ప్రత్యేక టారిఫ్ అమలైతేనే ప్రయోజనం
ఈనాడు, హైదరాబాద్
జలమండలి చరిత్రలోనే పెద్ద ఎత్తున విద్యుత్తు బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ప్రస్తుతం రూ.950 కోట్లకు ఛార్జీల మొత్తం చేరింది. డిసెంబరు నాటికి ఇవి వేయి కోట్ల మార్కు దాటే ఆస్కారముంది. కృష్ణా మూడో దశ, గోదావరి తాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యుత్తు ఛార్జీలు బోర్డు నడ్డి విరుస్తున్నాయి. వచ్చే ఆదాయమంతా ఇందుకే సరిపోతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు రుణాల కోసం చూడక తప్పడం లేదు. నల్లా బిల్లులు, కొత్త కనెక్షన్ ఛార్జీలతో కలిపి నెలకు రూ.120 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇందులో రూ.75 కోట్లు కేవలం విద్యుత్తు బిల్లులు చెల్లించడానికే సరిపోతోంది. ఉద్యోగులు, సిబ్బంది జీతాలు ఇతర నిర్వహణ ఖర్చులు పోను...నెలనెలా రూ.20-30 కోట్లు లోటు మిగులుతోంది. వేరే దారిలేక విద్యుత్తు బిల్లుల్లో సగమే చెల్లిస్తున్నారు. మిగతాది బకాయిలు కింద పేరుకోవడంతో 18 శాతం వరకు జరిమానా పడుతోంది.
రాయితీకే ఇస్తూ.. తాను భరిస్తూ
వాస్తవానికి జలమండలి రాయితీ ధరకే ప్రజలకు తాగునీటిని అందిస్తోంది. కృష్ణా, గోదావరి నదుల నుంచి ముడినీటిని సేకరించి దానిని శుద్ధి చేసి గొట్టాల ద్వారా నగరానికి తరలించడానికి భారీగా వ్యయమవుతోంది. ప్రస్తుతం రోజూ 214 కోట్ల 76 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి వేయి లీటర్లకు రూ.45 వరకు ఖర్చు పెడుతున్నారు. అంతిమంగా ప్రజలకు అదే వేయి లీటర్ల నీటిని కేవలం రూ.10కే అందిస్తున్నారు. మురికివాడలు, బస్తీల్లో రూ.7 కే సరఫరా చేస్తున్నారు. కరెంటు ఛార్జీల్లో మాత్రం జలమండలికి ఎలాంటి రాయితీ దక్కడం లేదు. నీటి తరలింపు, సరఫరా కోసం నెలకు 11 కోట్ల యూనిట్లను వినియోగిస్తున్నారు. ప్రతి యూనిట్‌కు రూ.7 వంతున ఛార్జీలు చెల్లిస్తున్నారు. పీక్ అవర్‌లో అదనంగా యూనిట్‌కు రూపాయి వంతున వసూలు చేస్తున్నారు.
ఆ టారిఫ్ ఏమైంది?
ప్రభుత్వం గతంలో జలమండలి కోసం ప్రత్యేక టారిఫ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. కేబినెట్లోనే దీనిపై తీర్మానించి ఉత్తర్వులు జారీ చేశారు. 2017 ఏప్రిల్ నుంచి అమలు చేయాలని భావించినా ఇంతవరకు ఆ ఉత్తర్వులు ఆచరణలోకి రాలేదు. ప్రస్తుతం మెట్రో రైలుకు ప్రభుత్వం ప్రతి యూనిట్ విద్యుత్తును రూ.3.95కే అందిస్తోంది. ఇదే కేటగిరి టారిఫ్‌ను జలమండలికి వర్తింపచేయనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలి వరకు ఈఆర్సీకు ఛైర్మన్ లేకపోవడంతో ఈ దస్త్రం మూలన పడింది. దీంతో యథావిధిగా ఛార్జీల భారం తప్పడం లేదు. దాదాపు వేయి కోట్లకు చేరడంతో బకాయిలు చెల్లించాలని విద్యుత్తు శాఖ నుంచి నోటీసులు వస్తున్నాయి. జలమండలి అధికారులు నెలనెలా ఏదోలా సర్దుబాటు చేస్తున్నారు. ఒకవేళ బకాయిలను చూపించి విద్యుత్తు సరఫరా నిలుపుదల చేస్తే అంతిమంగా ప్రజలకు నీటి కష్టాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈఆర్సీకు కొత్త ఛైర్మన్ వచ్చిన నేపథ్యంలో దస్త్రం బూజు దులపాల్సిన అవసరం ఉంది. తక్షణమే కొత్త టారిఫ్ అమలు చేస్తే నెలకు రూ.30-35 కోట్ల వరకు భారం తప్పనుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు