close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

వినిపించేనా ఆకలి కేకలు

అయిదు నెలలుగా మూసి ఉన్న మెస్‌
తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థుల అవస్థలు
వసతి గృహాల్లో ప్రైవేటు వ్యక్తులు తిష్ఠ
ఈనాడు, హైదరాబాద్‌:

నెలలుగా మూసి ఉన్న భోజనశాల.. తాగడానికి లేని శుద్ధ జలాలు.. దోమలు కుట్టి రోగాల బారిన పడుతున్న విద్యార్థులు.. తెలుగు విశ్వవిద్యాలయం వసతిగృహాల్లో పరిస్థితి ఇది. ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం శూన్యం. నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థులకు నగరంలో రెండుచోట్ల వసతిని కల్పిస్తున్నారు. బాచుపల్లిలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తుండగా.. ఉస్మానియా వర్సిటీ పక్కన ఉన్న త్రివేణి హాస్టల్‌లో ఎంఫిల్‌, పీహెచ్‌డీ విద్యార్థులు ఉంటున్నారు. ఈ విద్యాసంవత్సరం మొదలైనప్పట్నుంచి వసతి గృహాల్లో మెస్‌ ప్రారంభం కాలేదు. బాచుపల్లిలో కాస్త ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ త్రివేణి వసతిగృహంలో నేటికీ మెస్‌ తెరుచుకోలేదు. ప్రైవేటు గదుల్లో ఉంటే ఆర్థికంగా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వర్సిటీ వసతిగృహాల్లో పేద విద్యార్థులు ఉంటున్నారు. కనీసం అక్కడ తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నెలకొంది. అయిదు నెలలుగా మెస్‌ తెరుచుకోకపోవడంతో విద్యార్థులు బయట హోటళ్లలో తినాల్సి వస్తోంది. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శుద్ధి యంత్రాలు లేకపోవడంతో తాగునీటికీ అలమటించాల్సిన పరిస్థితి. బాచుపల్లిలో సైతం తాగునీటి ట్యాంకర్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. త్రివేణి హాస్టల్‌ పరిస్థితి దారుణంగా మారింది. కిటికీలు విరిగిపోయి.. తలుపులు సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రేకులషెడ్డు పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ‘‘విద్యార్థుల సమస్యలపై పలుమార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోవడం లేదు. అయిదు నెలలుగా మెస్‌ లేకపోవడంతో తిండికి ఇబ్బందిగా ఉంది. వెంటనే వర్సిటీ అధికారులు స్పందించాలి’’ అని ప్రొగ్రెసివ్‌ విద్యార్థి సంఘం నాయకుడు కరుణాకర్‌ తెలిపారు.

ఇతరులే ఎక్కువ
త్రివేణి వసతిగృహాల్లో 25 మంది విద్యార్థులుంటే మరో 50 మంది వరకు ఇతరులే ఉంటున్నారు. ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ విద్యార్థులకు తోడు విద్యార్థులు కాని వారు అక్కడే స్థిరంగా ఉంటున్నారు. వాస్తవానికి వీరిని పలుమార్లు ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో వర్సిటీ అధికారులు పట్టించుకోవడం మానేశారు. దీనికితోడు విద్యార్థులు చెల్లించాల్సిన మెస్‌ బకాయిలు పేరుకుపోయాయని అధికారులు చెబుతున్నారు.

పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం
అలేఖ్య పుంజాల, రిజిస్ట్రార్‌
విద్యార్థుల వసతి సమస్యపై దృష్టి సారించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. సమస్యను ఇన్‌ఛార్జి ఉపకులపతికి వివరించాం. తాగునీరు, మెస్‌ వసతిని అందుబాటులోకి తీసుకువస్తాం. వర్సిటీలో ఆచార్యులు, బోధనేతర సిబ్బందికి రెండు, మూడు బాధ్యతలు నిర్వర్తిస్తుండటం ఇబ్బందిగా ఉంది. విద్యార్థులకు హాస్టల్‌ కేటాయింపులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు వ్యక్తులు ఉంటున్న విషయంపై కఠినంగా ఉండాలని నిర్ణయించాం.

అమ్మో.. చీఫ్‌ వార్డెన్‌ పోస్టా..?
వాస్తవానికి చీఫ్‌ వార్డెన్‌గా సీనియర్‌ ఆచార్యుడు ఉండటం అన్ని వర్సిటీల్లో ఆనవాయితీ. ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నం. సీనియర్‌ ఆచార్యులెవరూ చీఫ్‌ వార్డెన్‌గా ఉండేందుకు ముందుకు రావడం లేదు. వసతిగృహాల్లో బయట వారు ఎక్కువగా ఉండటంతో సమస్యలు పరిష్కరించేందుకు వర్సిటీ అధికారులు చొరవ చూపకపోవడంతో చీఫ్‌ వార్డెన్‌గా ఉంటే తమపై భారం పడుతుందన్న ఉద్దేశంతో వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం చీఫ్‌ వార్డెన్‌గా పరిపాలన వ్యవహారాలు పర్యవేక్షించే రిజిస్ట్రార్‌కు అప్పగించారు. దీంతో ఈయన పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం లేకుండాపోయింది. వాస్తవానికి బోధనవైపు ఉన్న ఆచార్యులకు బాధ్యతలు ఇవ్వకుండా పరిపాలనవైపు ఉన్న వారికి బాధ్యలు అప్పగించడం పైన వివాదం రేగింది. అయినప్పటికీ అధికారులు మాత్రం రెగ్యులర్‌ చీఫ్‌ వార్డెన్‌ను నియమించే విషయంపై దృష్టి సారించడం లేదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.