close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

సంపూర్ణ ఆరోగ్యానికి సలక్షణ ఆహారం!

అందుబాటులో అలనాటి ధాన్యం
అరుదైనవి పండిస్తున్న యువకుడు
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

రాజులు యుద్ధాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకున్నారో తెలుసా..?
దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి తిండి తినాలి?
పూర్వం మన పెద్దలు తీసుకున్న ఆహారమేంటి..?
ఇవన్నీ తెలుసుకొని.. ఆరోగ్యకరమైన ఆహారమైతే పాటించాలని అందరికీ ఉంటుంది. కానీ.. వాటి గురించి తెలుసుకునేందుకు చాలా మంది సమయం వెచ్చించరు. నగరానికి చెందిన ఓ కృషీవలుడు మన పూర్వీకులు వాడిన ఆహార ధాన్యాలను వెతికి నేటి తరానికి పరిచయం చేస్తున్నాడు. వాటి విశేషాలను తెలుసుకొని సంరక్షిస్తున్నాడు.

 

నగరానికి చెందిన కృషీవలుడు శివప్రసాద్‌ శంషాబాద్‌లో భూమిని లీజుకు తీసుకుని సేంద్రియ పద్ధతిలో అరుదైన ధాన్యం రకాలు పండిస్తునారు. మన పూర్వీకులకు ప్రధానాహారమైన 450 రకాల వరి విత్తనాలను సంరక్షిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ కావాల్సిన వారికి పంపిణీ చేస్తున్నారు. ‘మన ఊరు-మన విత్తనం’ పేరుతో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ధాన్యం మార్కెట్లో విక్రయిస్తూ.. విత్తనాలు రైతులకు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. సాగు చేయడమే కాదు.. ఒక్కో వాటి చరిత్ర, వాటిలోని పోషకాలు, ఎవరు ఆహారంగా తీసుకుంటే మేలు.. అనే కోణంలో శోధించి మరీ పండిస్తున్నారు.

వయసును బట్టి తిండి..
వయసును బట్టి ఆహారం తీసుకుంటాం. చిన్నపిల్లలు, యుక్తవయసు, వృద్ధాప్యంలో ఏ రకం బియ్యం వాడాలో ఎప్పుడో మన పెద్దలు నిర్ణయించారు.
* చిన్నపిల్లలకు మైసూర్‌ మలిగే, మైసూర్‌ సన్న రకాలను ఆహారంగా అందించాలి.
* గర్భిణులకు, ప్రసవం అయిన తర్వాత తల్లికిపాలు పడటానికి ‘అందేమోహర్‌’ రకం తీసుకోవడం మంచిది.
* యుక్త వయసులో ఉన్నవారు ‘మప్పిలై సాంబ’ను ఎక్కువగా తినాల్సి ఉంటుంది.
* రక్తహీనత తగ్గడానికి, రక్తవృద్ధి ‘రక్తశాలి’ రకం మేలు చేస్తుంది.

నవారా బియ్యం (ఎర్రబియ్యం)

ఇది ఔషధ గుణాలున్న బియ్యం. వ్యవసాయ శాస్త్రవేత్తలే నిర్ధరించారు. కేరళలో ఆయుర్వేద వైద్యంలో ఈ నవారా బియ్యాన్ని ఔషధాల తయారీలో వాడుతున్నారు. దీనికి మధుమేహాన్ని తగ్గించే గుణం ఉంది. ఇందులో పీచుపదార్థం ఎక్కువ. దీన్నే రెడ్‌రైస్‌ అనీ పిలుస్తారు.

బ్లాక్‌రైస్‌.. (క్యాన్సర్‌ బ్లాక్‌రైస్‌)

కాలాబట్టి, కాలాబట్‌, కాలావట్టి అనే మూడు రకాలు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. నెమ్మదిగా జీర్ణమవుతాయి. రాజులు యుద్ధాలకు వెళ్లేటప్పుడు తీసుకునే వారని ఆహార నిపుణులు చెబుతున్నారు.  క్యాన్సర్‌ బ్లాక్‌రైస్‌ అని పేరుంది వీటికి.

కులాకర్‌.. (గర్భిణులకు మేలు)

కులాకర్‌, గుర్మటియా, లోహాంబి వంటి బియ్యం రకాల్లో ఐరన్‌ శాతం ఎక్కువ. గర్భవతులు ఆహారంగా తీసుకునేవారు.  ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోని గిరిజనులు ఆహారంగా తీసుకుంటారు.

రోగాలకు చెక్‌ పెట్టేందుకే..
- శివప్రసాద్‌

శంషాబాద్‌లో 2013-14 నుంచి ‘మన ఊరు- మన విత్తనం’ కార్యక్రమంలో భాగంగా సాగు చేస్తున్నాం. పూర్వం ప్రజలు ఇటువంటి వీటినే ఆహారంగా తీసుకున్నారు. వీటితో కొత్త రోగాలకు చెక్‌ పెట్టొచ్చు. అందుకే  పరిశోధన చేసి 450 రకాల పాత వరి విత్తనాలు అందుబాటులోకి తెచ్చాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతుల ద్వారా వీటిని సాగు చేస్తున్నాం.

మితంగా తీసుకుంటే మేలు

- సుజాత స్టీఫెన్‌, పోషకాహార నిపుణురాలు

మన తాత, ముత్తాతలు తిన్నటువంటి ఆహారం తీసుకోవడం మంచిదే. పాలిష్‌ బియ్యానికి అలవాటు పడిన వారు ఉన్నట్లుంటి ఒకే సారి ఆ ధాన్యాలకు అలవాటుపడకపోవచ్చు. అందులో పీచు అధిక మొత్తంలో ఉంటుంది. మొదట్లో మితంగా తీసుకోవాలి. శరీరం అలవాటు పడిన తర్వాత కావాల్సినంత తీసుకుంటే మేలు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.