శుక్రవారం, డిసెంబర్ 13, 2019
కర్నూలు నేరవిభాగం న్యూస్‌టుడే : కర్నూలు మండలం ఇ.తాండ్రపాడుకు చెందిన బొగ్గుల మహబూబ్లాల్ (65) గురువారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం..స్థానిక రాయలసీమ ఆల్కాలీసు పరిశ్రమలో పనిచేసి ఐదేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. భార్య ఫాతిమాబీ క్యాన్సర్‌తో ఐదేళ్ల క్రితం చనిపోయారు. కుమారుడు జలీల్అహ్మద్ కర్నూలులో నివాసముంటూ తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా కేంద్రంలోని ఫ్యాక్టరీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. కుమార్తెను పగిడ్యాలకు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. ఇంటిని అద్దెకు ఇచ్చి సమీప మసీదులోనే నివాసముంటూ మౌజన్‌గా బాధ్యతలు నిర్వర్తించేవారు. అప్పుడప్పుడు కుమారుడు, కుమార్తె వద్దకు వెళ్లి వస్తూ ఒంటరి జీవితం గడిపేవారు. గురువారం మధ్యాహ్నం ప్రార్థనకు వచ్చిన మాలిక్‌బాషా..రక్తం మడుగులో శవమై ఉన్న మహబూబ్లాల్ను గుర్తించి అందరికీ సమాచారం ఇచ్చారు. సాయంత్రం కర్నూలు ఇన్‌ఛార్జి డీఎస్పీ బాబాఫకృద్దీన్, కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్ సీఐ ఓబులేషు, ఆధారాల సేకరణ బృందం సీఐ శివారెడ్డి, ఎస్సైలు ఖాజావలి, గోపాల్‌రెడ్డి ఘటనస్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు. ఒంటిపైన గాయాలు లేకపోవటంతో ముక్కు, నోరు నుంచి తీవ్రంగా రక్తస్రావం జరిగి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మహబూబ్లాల్ కుమారుడిని విచారించగా తనకు ఎవరిపైనా అనుమానం లేదని చెప్పారు. గతంలో మహబూబ్లాల్ డబ్బు రెండు సార్లు తస్కరణకు గురికావటం, ప్రార్థనా మందిరం నిర్వహణ విషయంలో స్వల్ప వివాదం ఉన్నట్లు ప్రచారం ఉండటంతో పలు అనుమానాలకు తావిచ్చింది. మృతదేహాన్ని శవపరీక్ష కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు జలీల్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు