శుక్రవారం, డిసెంబర్ 13, 2019
● రైతుభరోసా వర్తించడం లేదంటూ ఆవేదన
తహసీల్దారు కార్యాలయంలో బైఠాయించిన రైతులు
సంజామల, న్యూస్టుడే : వైఎస్సార్ రైతు భరోసా పథకం వర్తించడం లేదంటూ పలువురు సన్నకారు రైతులు పురుగుమందు డబ్బాలతో తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్న ఘటన గురువారం జరిగింది. 5, 6, 7వ విడతల భూపంపిణీలో భాగంగా ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి భూములు ఇచ్చిందని, ఆ వివరాలను రెవెన్యూ అధికారులు అంతర్జాలంలో నుంచి తొలగించడంతో రైతు భరోసా వర్తించడం లేదని సంజామల మండలంలోని పేరుసోముల గ్రామానికి చెందిన సన్నకారు రైతులు వాపోయారు. పురుగుమందు డబ్బాలతో కార్యాలయం చేరుకొని ఇన్ఛార్జి తహసీల్దారు సురేంద్ర ఎదుట బైఠాయించారు. న్యాయం చేయకుంటే వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు. గ్రామానికి చెందిన కొందరి భూములకు డబ్బులు తీసుకుని అంతర్జాలంలో నమోదు చేయగా నిరుపేదలమైన తమ భూములను నమోదు చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సుమారు 20 మంది రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. 344.62 ఎకరాల్లో రైతులు సాగులో లేనట్లు గుర్తించామని, సాగులో ఉన్నది లేనిది పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదించి వారి నుంచి అనుమతులు రాగానే అంతర్జాలంలో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దారు వెల్లడించారు. త్వరలో చర్యలు తీసుకుంటామని అధికారి హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు