శుక్రవారం, డిసెంబర్ 06, 2019
సమావేశానికి హాజరైన తెదేపా కార్యకర్తలు
కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రాన్ని ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో పూర్తిగా వైఫల్యం చెందాడని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా నేత గౌరు వెంకటరెడ్డి అన్నారు. కల్లూరు వక్కెరవాగు సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం తెదేపా పాణ్యం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ మల్లెల రాజశేఖర్, తెదేపా నేత వై.నాగేశ్వరరావు యాదవ్, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ పెరుగు పురుషోత్తమరెడ్డి, పరిశీలకుడు మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామ కమిటీల ఏర్పాటుకు ఈ నెల 30లోపు ప్రతి గ్రామం నుంచి 40 మంది పేర్లను ఇవ్వాలన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్తకు సముచిత న్యాయం కల్పిస్తామన్నారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలకు పార్టీలో పెద్ద పీట వేస్తామన్నారు. జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన ఉందని, సమస్యలను ఆయనతో విన్నవిద్దామన్నారు. ఈ సమావేశంలో తెదేపా కల్లూరు మండల కన్వీనర్ రామాంజనేయులు, మల్లెల పుల్లారెడ్డి, దేవేంద్రరెడ్డి, నియోజకవర్గ పరిధి నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, కల్లూరు పట్టణ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హంద్రీలో ఇసుక తవ్వకాలపై పోరాటం - గౌరు వెంకటరెడ్డి
కల్లూరు హంద్రీ నదిలో పరివాహక ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసి తరలించాలని చూస్తే సహించేది లేదని తెదేపా నేత గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఇసుకను తరలిస్తే సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే తాము వారి వెంట ఉంటామన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి - సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెదేపా జిల్లా అధ్యక్షుడు
గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. కేఈ కుటుంబం పార్టీ వీడుతున్నారని వస్తున్న వార్తలు అవాస్తవాలని, వారు పార్టీని వీడరని చెప్పారు.
తప్పుడు కేసులకు భయపడం - మల్లెల రాజశేఖర్, జడ్పీ మాజీ ఛైర్మన్
తమ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, బెదిరింపులకు గురిచేస్తే భయపడే ప్రసక్తే లేదని జడ్పీ మాజీ ఛైర్మన్ మల్లెల రాజశేఖర్ తెలిపారు. ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాష్ట్రంలో కార్మికులు అల్లాడుతున్నారని, కార్మికులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు