close

గురువారం, డిసెంబర్ 05, 2019

ప్రధానాంశాలు

సత్వరమే రుణం

వారంలోగా అందజేత

నేరుగా పొదుపు మహిళల ఖాతాలో జమ

బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలకు చెల్లు

నూతన విధానం అమల్లోకి

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

సమావేశంలో పొదుపు సంఘాల మహిళలు

ఇకమీదట నెలల తరబడి రుణం సొమ్ము బ్యాంకుల్లో పెండింగు ఉండకుండా కేవలం వారం రోజుల వ్యవధిలో నేరుగా సభ్యురాలి బ్యాంకు ఖాతాలో జమ చేసేలా సెర్ప్‌ ప్రణాళిక రూపొందించింది. దీనివల్ల పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన బాధలు తప్పనున్నాయి. మహిళలకు రుణాల అందజేతలో జాప్యాన్ని నివారించేందుకు నూతన విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీనివల్ల లక్ష మందికిపైగా ఊరట లభించనుంది. జిల్లాలో అమలు చేయనున్న కొత్త విధానంపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో 30 వేలకుపైగా కుటుంబాలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆసక్తిఉన్న రంగాల్లో ఉపాధి కల్పించి ప్రోత్సహించేందుకు పేదరిక నిర్మూలన సంస్థ ఏటా బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేస్తోంది. ఇందుకోసం లక్ష్యాన్ని ఖరారు చేసింది. ఆదాయం వచ్చే యూనిట్లతో వ్యాపారం, స్వయం ఉపాధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆసక్తి చూపిన సంఘాలకు డీఆర్‌డీఏ అధికారులు ఐకేపీ సీసీలు, వీఓఏల ద్వారా రుణాలను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో రుణ మంజూరు  ప్రక్రియను డీఆర్‌డీఏ అధికారులు పూర్తి చేసినప్పటికీ సొమ్ము అందించడంలో బ్యాంకుల్లో ఆలస్యం జరుగుతోంది. దీంతో సంఘాల్లోని అధ్యక్ష, కార్యదర్శులతోపాటు సభ్యులైన మహిళలు దస్త్రాలతో తరచూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గ్రామాల నుంచి రవాణా ఛార్జీలు భరించి పనులు మానుకొని వచ్చినా బ్యాంకుల్లో పడిగాపులు తప్పడం లేదు. మంజూరు చేసిన సొమ్ము చేతికి అందేందుకు నెలలతరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇదే అదునుగా కొందరు సిబ్బంది సంఘాల సభ్యురాళ్ల నుంచి వసూళ్లకు పాల్పడుతూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీనిని గుర్తించి ఇలాంటి సమస్యలకు అడ్డుకట్ట వేసేలా విధానాన్ని రూపొందించింది.

ఆన్‌లైన్‌లో వివరాల నమోదు

పొదుపు సంఘాల్లోని సభ్యులందరి బ్యాంకు ఖాతా, ఆధార్‌ సంఖ్య వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. సీసీలకు అందించిన ట్యాబ్‌ల్లో ఇవి ప్రత్యక్షం కానున్నాయి. వీటి ద్వారా తక్కువ సమయంలో రుణం పొందే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. పనితీరు ఆధారంగా అందించాల్సిన రుణాన్ని ముందుగానే అంచనావేసి ఖరారు చేయనుంది. ఇకమీదట ఆన్‌లైన్‌లో రుణం మంజూరుకు దరఖాస్తు చేసే వెసులుబాటు కల్పించింది. వారి విజ్ఞప్తిని పరిశీలించి బ్యాంకు అధికారులు ఆమోదం తెలిపి రుణ మొత్తాన్ని సంబంధిత సభ్యురాళ్ల ఖాతాల్లో వారంలోగా జమ చేయనున్నారు.

* తాండూరు మండలానికి రూ.5.20 కోట్ల రుణం మంజూరు చేశారు. ఇందులో రూ.4.11 కోట్లు మాత్రమే అందించారు. ఇంకా రూ.1.09 కోట్లు బ్యాంకుల వద్దే ఉండిపోయింది.●

* మోమిన్‌పేట మండలంలో రూ.2.97 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు రూ.1.73 కోట్లు ఇచ్చారు.

* దౌల్తాబాద్‌ మండలంలో రూ.5.72 కోట్లు మంజూరవగా రూ.3.50 కోట్లు ఇచ్చారు. రూ.2.22 కోట్లు బ్యాంకులకు పరిమితం అయ్యాయి.●

* బొంరాస్‌పేట మండలానికి రూ.5.93 కోట్లు మంజూరైతే ఇచ్చింది రూ.4.51 కోట్లు.

* బంట్వారం మండలానికి రూ.2.03 కోట్లు మంజూరు చేయగా పంపిణీ చేసింది కేవలం రూ.93 లక్షలు. మిగిలిన సొమ్ము పొదుపు మహిళలకు అందించాల్సి ఉంది.

వసూళ్లకు అడ్డుకట్ట

సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లోకి సొమ్ము జమ చేయడం ద్వారా కొందరు ఐకేపీ సిబ్బంది వివిధ ఖర్చుల పేరిట చేసే వసూళ్లకు అడ్డుకట్టపడనుంది. కొన్ని బ్యాంకులు వివిధ రకాల ఛార్జీలు, రుసుంల పేరిట కొంత సొమ్ము రాబట్టుకునేవి. ఇకమీదట ఇలాంటి ఛార్జీలు, రుసుల వివరాలు ట్యాబ్‌లలో ప్రత్యక్షం కానున్నాయి. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వసూలుచేసే ఛార్జీలపై ప్రశ్నించేందుకు తోడ్పడనుంది. దీంతో మహిళలకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. దస్త్రాలతో బ్యాంకుల వద్దకు తిరిగే వీల్లేకుండాపోనుంది. ఇప్పటికే స్త్రీనిధి రుణాలను 48 గంటల వ్యవధిలో అందించిన యంత్రాంగం తాజాగా బ్యాంకు లింకేజీ రుణాలను సైతం తక్కువ వ్యవధిలో అందించనుండటంతో మహిళలకు ఉపశమనం లభించనుంది. దీంతో ఉత్సాహంగా రుణాలు పొందేందుకు ఆస్కారమేర్పడుతుంది. తద్వారా మహిళలు మరింత ఆర్థిక ప్రగతి సాధించేందుకు దోహదపడనుంది.

వేగంగా రుణాల పంపిణీ: వీరయ్య, డీపీఎం, డీఆర్‌డీఏ.

సంఘాల్లోని పది మంది సభ్యులంతా బ్యాంకుల వద్దకు రోజులతరబడి తిరిగే పనిలేకుండా రుణాలు మంజూరు చేస్తాం. గ్రామ సమాఖ్యల్లోనే వీఓఏ, సీసీలు రుణం మంజూరుకు తీర్మానం చేసి ట్యాబ్‌లో నమోదు చేస్తారు. దీన్ని ఏపీఎంలు పరిశీలించి ఆమోదం తెల్పుతారు. ఆ తర్వాత బ్యాంకు అధికారులు సంఘం పేరిట రుణం మొత్తాన్ని నేరుగా సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తారు. సంఘం అధ్యక్షురాలు, రెండో అధ్యక్షురాలి చేతుల మీదుగా పంపిణీ చేసే వీల్లేకుండాపోతుంది. నూతన విధానం వల్ల మహిళలకు సమయం ఆదా అవడంతోపాటు రుణం పొందడం సులభంగా మారుతుంది. ●

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.