close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

టీకాలపై నిర్లక్ష్యం.. వెంటాడుతోంది అనారోగ్యం

పిల్లలకు పూర్తి స్థాయిలో ఇప్పించని తల్లిదండ్రులు

గర్భిణులు సైతం వెనకడుగు

ఆరు పీహెచ్‌సీల్లో మరోమారు మిషన్‌ ఇంద్రధనుష్‌

జిల్లాలో బీసీజీ వ్యాక్సిన్‌ వేసిన చిన్నారులు : 94 శాతం

మూడున్నర, తొమ్మిది నెలల టీకాలు వేసిన పిల్లలు : 89 శాతం

న్యూస్‌టుడే, వీరన్నపేట (మహబూబ్‌నగర్‌)

మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో చిన్నారికి టీకా వేస్తున్న సిబ్బంది

చిన్నారులకు వేసే టీకాలు ఎంత ఉపయోగకరమో అందరికీ తెలుసు. పిల్లల ఎదుగుదల సమయంలో రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఇవి దోహదం చేస్తాయి. కానీ పిల్లలకు వాటిని పూర్తిస్థాయిలో ఇప్పించడంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చూపుతున్నారు. గర్భిణులు సైతం టీకాలు వేయించుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. దాని ప్రభావం పిల్లలను జీవితాంతం వెంటాడుతుందన్న విషయాన్ని గుర్తించడం లేదు. కేసీఆర్‌ కిట్టు అమలు చేసిన తర్వాత గర్భిణులు టీకాలు తీసుకోవడంలో కొంత మార్పు వచ్చినా.. ఇంకా రావాల్సిన అవసరం ఉంది.. కొన్ని సంవత్సరాలుగా గర్భిణులు, చిన్నారులకు టీకాలు ఇచ్చేందుకు మిషన్‌ ఇంద్రధనుష్‌ అమలు చేస్తున్నా.. ప్రజల్లో ఆశించిన స్పందన కనిపించడం లేదు. దీంతో డిసెంబర్‌లో మరోమారు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వేలు సైతం ప్రారంభించారు.

టీకాలపై ప్రత్యేక కార్యక్రమం..

జిల్లాలో గతంలో టీకాలు వేసే కార్యక్రమం పూర్తిస్థాయిలో సాగలేదు. కేవలం 62 శాతం మంది పిల్లలకు మాత్రమే పూర్తిస్థాయిలో టీకాలు వేయించారు. తరవాత చేపట్టిన మిషన్‌ ఇంద్రధనుష్‌ ప్రత్యేక కార్యక్రమం ద్వారా పిల్లలతో పాటు గర్భిణులకు కూడా టీకాలు వేసేలా వైద్యారోగ్య శాఖ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. టీకాల ప్రాముఖ్యత గురించి గ్రామాల్లో ప్రచారం చేశారు. దీంతో ప్రస్తుతం టీకాలు తీసుకొనే వారి సంఖ్య 89 నుంచి 94 శాతం వరకు వచ్చింది. మిగిలిన వారికి కూడా టీకాలు వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వెనుకబడిన ఆరోగ్య కేంద్రాలపై దృష్టి..

జిల్లాలో సగటు కంటే కూడ తక్కువగా కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాల కార్యక్రమం కొనసాగింది. దీంతో ఈ ఏడాది వాటిలో మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి జడ్చర్ల మండలం గంగాపూర్‌, నవాబుపేట, పేరూర్‌, సీసీకుంట, బాలానగర్‌, కొత్లాబాద్‌ పీహెచ్‌సీలను ఎంపిక చేశారు. వాటి పరిధిలో కేవలం 80 నుంచి 90 శాతంలోపే టీకా కార్యక్రమం సాగింది. దీంతో పాటు మహబూబ్‌నగర్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సైతం మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమం అమలు చేయనున్నారు. ఈ మేరకు ఈ ప్రాంతాల్లో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఇంకా ఎంత మందికి టీకాలు వేయాల్సి ఉందో లెక్కలు తీస్తున్నారు.

పర్యవేక్షణ పెంచాలి..

జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో క్షేత్రస్థాయి సిబ్బంది అధికంగా ఉన్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు వారి పరిధిలో పిల్లలు, గర్భిణులకు టీకాలు వేశారా? లేదా? అని పర్యవేక్షించాలి. ఇటీవల కాలంలో అన్నీ ఆన్‌లైన్‌ చేసిన నేపథ్యంలో ఎవరెవరు టీకాలు వేసుకున్నారు? ఎవరు వేసుకోలేేదనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. వారు సకాలంలో టీకాలు వేసుకునే విధంగా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి నెల ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలి. ఫలితంగా ఎవరైన మరిచిపోయినా టీకాలు వేయించుకోవడానికి అవకాశం ఉంటుంది.

ప్రత్యేక కార్యక్రమం..: జిల్లాలోని ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మరోమారు మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమం నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే సిబ్బంది క్షేత్రస్థాయిలో టీకాలు తీసుకోని గర్భిణులు, పిల్లల వివరాలను సేకరిస్తున్నారు. టీకాలు వేయనివారికి, ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా టీకాలు ఇస్తాం.

- డా.ఉమ, జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.