close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

నోటుపాట్లు

బ్యాంకుల్లో నగదు కొరత

పాతిక వేలు కూడా ఇవ్వలేని పరిస్థితి

ఖాతాదారులకు ఇబ్బందులు

న్యూస్‌టుడే, ఇందూరు సిటీ

‘నిజామాబాద్‌కు చెందిన రాజవ్వ కొడుకు గల్ఫ్‌లో ఉన్నారు. వారం కిందట ఈమె ఖాతాలోకి రూ.50వేలు పంపారు. ఈ డబ్బు తీసుకొనేందుకు రాజవ్వకు ఐదు రోజుల సమయం పట్టింది. మొదటి రెండ్రోజులు డబ్బులు లేవని తిప్పి పంపిన అధికారులు.. మూడ్రోజుల్లో రూ.50వేల మొత్తాన్ని విడతల వారీగా విత్‌డ్రా చేసి ఇచ్చారు.’

ఇలాంటి పరిస్థితి ఒక్క రాజవ్వది మాత్రమే కాదు. నిత్యం వేలాది మంది బ్యాంకు ఖాతాదారులది. ఆర్థిక మాంద్యం ప్రభావమా..? లేక బ్యాంకుల విలీన ప్రక్రియ పరిస్థితులా తెలియదు. పాతిక వేలు ఇవ్వాలన్నా బ్యాంకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. పలు బ్యాంకుల్లో నగదు లేవని ముందుగానే చెబుతున్నారు. కేవలం ఆన్‌లైన్‌లోనే ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నారు. రోజురోజుకీ నగదు కొరత పెరుగుతుండడంతో అధికారులు సైతం తల పట్టుకొంటున్నారు.

* 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు జరిగింది. మూడేళ్లు గడిచిన తర్వాత కూడా నోటు కష్టాలు వెంటాడడం సామాన్య ప్రజానీకాన్ని అష్టకష్టాలు పెడుతోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకు శాఖలు 258 ఉన్నాయి. సుమారు 11 లక్షల ఖాతాదారులు ఉన్నారు. అన్ని బ్యాంకుల్లో కలిపి సుమారు రూ.12వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.

* నోట్ల రద్దుకు ముందు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసే ఖాతాదారులు ఎక్కువ. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నగదు కొరత ఏర్పడడంతో విత్‌డ్రాలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫలితంగా బ్యాంకుల్లో డిపాజిట్లు సగానికి పైగా తగ్గిపోయాయి.

● కొత్తగా మార్కెట్లోకి రూ.2వేలు, రూ.500 నోట్లు అందుబాటులోకి తీసుకువచ్చినా వీటి కొరత కూడా ఉంది. రూ.2వేల నోట్లు బ్యాంకుల్లోనూ లేకపోయాయని పలువురు బ్యాంకర్లు చెబుతున్నారు.

విలీన నిర్ణయంతో..

పలు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం ప్రభావం జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. విలీనమయ్యే బ్యాంకుల్లో తమ ఖాతాలు ఏమైపోతాయని చాలా మంది గందరగోళానికి గురయ్యారు. ఉన్న నగదును విత్‌డ్రా చేసుకొని ఖాతాలను తొలగించుకుంటున్నారు. దీని ప్రభావంతో ఆయా బ్యాంకుల్లో నగదు కొరత తెరపైకి వచ్చింది.

* ఆర్థిక మాంద్యం ప్రభావం కూడా కొంత మేర ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో వివిధ రంగాల ద్వారా పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయని ఓ బ్యాంకు మేనేజరు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. దీంతో నగదు కొరత ఉంటోందని, చిన్నచిన్న విత్‌డ్రాలకు కూడా నగదు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు.

* నగదు కొరత వ్యక్తిగత, గృహ రుణాలపై ప్రభావం చూపుతోంది. రుణాలు తీసుకొనేందుకు ఆసక్తి ఉంటున్నా నగదు కావాలంటే బ్యాంకర్లు సమయం తీసుకొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నగదుని ఖాతాలకు మళ్లిస్తున్నారు.

* రూ.50వేలు పైబడి విత్‌డ్రా చేయాలంటే సంబంధిత బ్రాంచి మేనేజరు అనుమతి తప్పనిసరి చేశారు. పలు సందర్భాల్లో నగదు లేదని తెగేసి చెబుతున్నారు.

* డిజిటల్‌ లావాదేవీలు ప్రోత్సహించడంలో భాగంగా అంతంత మాత్రమే నగదు పంపిణీ అవుతోందని బ్యాంకర్ల ద్వారా సమాచారం. కానీ వ్యాపారులు మాత్రం డిజిటల్‌ లావాదేవీలు చేయట్లేదు. కేవలం మామూలు ఖాతాదారులు మాత్రమే నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్నారు.

అడ్డదారిలో కొందరికి..

పలు బ్యాంకర్ల తీరుపై ఖాతాదారులు పెదవి విరుస్తున్నారు. రూ.25వేలు ఇవ్వాలంటే ఒకటికి పదిసార్లు మామూలు ఖాతాదారులను తిప్పించుకొంటున్నారని, బడా ఖాతాదారులకు మాత్రం అడ్డదారిలో రూ.లక్షలు కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కరెంటు ఖాతాలు కలిగిన వారికి ఏకకాలంలో రూ.లక్షలు విత్‌డ్రా చేసి పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.