close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

పాపికొండల్లా నల్లమల అందాలు.. కృష్ణమ్మ పరవళ్లు

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడి

కాటేజీలు, లాంచీ ప్రారంభం

సోమశిల వద్ద బోటింగు సదుపాయాల శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌..

చిత్రంలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి,

మాజీ మంత్రి జూపల్లి,  జడ్పీ ఛైర్‌పర్సన్లు స్వర్ణ సుధాకర్‌రెడ్డి, పద్మావతి తదితరులు

కొల్లాపూరు, న్యూస్‌టుడే : పాపికొండలను తలపించే విధంగా నల్లమల అందాలు, కృష్ణమ్మ పరవళ్లు, ప్రకృతి సోయగాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయని రాష్ట్ర పర్యటక, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. పర్యటకుల కోసం కృష్ణాతీరాన సోమశిలలో కాటేజీలు, కృష్ణానదిలో శ్రీశైలం లాంచీ ప్రయాణానికి ఏర్పాట్లు చేశామన్నారు. భవిష్యత్తులో దేశం నలుమూలలా తెలంగాణ టూరిజం బాగుందనే రోజు వస్తుందన్నారు. ఎకో టూరిజం కింద గురువారం కొల్లాపూర్‌ మండలం సోమశిలలో కృష్ణాతీరాన రూ.20 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన లాంచీ, కాటేజీలను మంత్రి ప్రారంభించారు. తర్వాత లాంచీలో సోమశిల, అమరగిరి, సిద్ధేశ్వరం తదితర ప్రాంతాలను వీక్షిస్తూ విలేఖరులతో మంత్రి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నాగార్జునసాగర్‌లో బౌద్ధవనం ప్రాజెక్టు ఏర్పాటు చేసి సాగర్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా కల్పించాలన్నారు. కొల్లాపూర్‌, అచ్చంపేట ప్రాంతాల్లోని కృష్ణాతీరాన, నల్లమలలో పలు పర్యటక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఆకట్టుకునేలా వసతులు కల్పిస్తున్నామన్నారు. పురాతన క్షేత్రాలను దర్శించుకొంటూ కృష్ణానదిలో విహరించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విదేశీయులు సైతం వచ్చేవిధంగా పర్యటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతిపక్షాలు విమర్శించడం మానుకోవాలన్నారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. పర్యటక రంగానికి సీఎం కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ కావాలన్నారు. పలు సాగు, తాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని పర్యటక హబ్‌గా మారుస్తామన్నారు. కృష్ణానదిపై వంతెన నిర్మాణంతో ఏపీ, తెలంగాణ ప్రాంతాల నడుమ రాకపోకలు, పర్యటక అభివృద్ధి సాధ్యమవుతాయని అన్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గతంలో కరవు, కాటకాలతో వలసల ప్రాంతంగా ఉన్న కొల్లాపూర్‌ను అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్‌ సహకారంతో పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ ఛైౖర్‌పర్సన్లు స్వర్ణ సుధాకర్‌రెడ్డి, పద్మావతమ్మ, పర్యటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి, ఎండీ మనోహర్‌రావు, కలెక్టర్‌ శ్రీధర్‌, ఆర్డీవో హనుమానాయక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు రాజేశ్వర్‌గౌడ్‌, విష్ణు, సోమశిల సర్పంచి మద్దిలేటి, నియోజకవర్గంలోని ఏడు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణానదిలో స్పీడ్‌బోటులో మంత్రి, ఎమ్మెల్యేలు విహరించారు. సింగోటంలోని జలాశయం కట్టపై కాటేజీలు, రత్నలక్ష్మి గుట్టపై వ్యూపాయింటును మంత్రి ప్రారంభించారు. శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయంలో పూజలు చేశారు. మాజీ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బీరం వర్గాల అనుచరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.