శుక్రవారం, డిసెంబర్ 06, 2019
రాజధానిలో లింగ నిర్ధరణ దందా
కుటుంబాల నుంచి రూ.25-50వేలు వసూళ్లు
కొందరు వైద్యులు, ఆటోడ్రైవర్లు, రిప్రజెంటేటివ్‌ల కుమ్మక్కు
పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు
బిడ్డ కడుపులో ఉండగానే ఆడా మగ అని నిర్ధరించడం చట్టరీత్యా నేరం. జైలుశిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. నర్సింగ్‌హోం, ఆసుపత్రి అనుబంధ ల్యాబ్‌ను కూడా సీజ్ చేస్తారు. గ్రేటర్లో పలుచోట్ల చట్టానికి తూట్లు పొడుస్తున్న విషయం తాజా తనిఖీల్లో బయటపడింది.
ఈనాడు, హైదరాబాద్
రాజధానిలో నయా దందా ఇది. అమ్మ బొజ్జలో హాయిగా నిదురపోయే పసికందులకు బతుకే లేకుండా చేసే అడ్డగోలు వ్యాపార పర్వమిది. ‘పుట్టబోయే బిడ్డ ఎవరో తెలుసుకోవాలనుకుంటే తాము సూచించిన నగదు చేతిలో పెడితే చాలని..తెలిసిన వైద్యులు అసలు విషయం చెప్పేస్తారంటూ గర్భిణులను లక్ష్యంగా చేసుకుని కొందరు మధ్యవర్తులు ఈ తంతు నడిపిస్తున్నారు. అవసరమైతే గర్భస్రావం చేయించేందుకూ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా చైతన్యపురి పోలీసులు, రాచకొండ షీ బృందం సంయుక్తంగా నిర్వహించిన డెకాయి ఆపరేషన్‌లో అత్తాపూర్‌లోని ఉషోదయ ఆసుపత్రిలో నిర్వహిస్తోన్న లింగ నిర్ధరణ పరీక్షలు దందా బయటపడింది. ఈ క్రమంలో నగరంలో పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.
మాట కలిపి...
పుట్టబోయేది ఆడబిడ్డో.. మగబిడ్డో అని తెలుసుకోవాలనే కుతూహలం కొందరు తల్లిదండ్రులలో ఉండడం కేటుగాళ్లకు వరంగా మారింది. పలువురు మెడికల్ రిప్రజెంటేటివ్‌లు, ఆటో డ్రైవర్లు, వైద్యులు, ఆసుపత్రుల సిబ్బంది ముఠాగా ఏర్పడుతున్నారు. రిప్రజెంటేటివ్‌లు తరచూ వైద్యులను కలుస్తుంటారు. ఆ క్రమంలోనే పరీక్షలకొచ్చే గర్భిణులతో మాట కలుపుతున్నారు.తమ దందాకు ఇబ్బంది ఉండదని నమ్మకం కుదిరిన తర్వాత గర్భిణుల ఫోన్ నంబర్, చిరునామా తీసుకుంటున్నారు. ఒకట్రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి ఆరోగ్యమెలా ఉందంటూ ప్రశ్నిస్తారు. మీ కుటుంబ సభ్యులను కలిసేందుకు ఎప్పుడు వీలవుతుందని అడిగి ఆ సమయానికి ఇంటి ముందు వాలిపోతారు. ఇబ్బంది రాకుండా లింగ నిర్ధరణ చేయించే పూచీ మాదంటూ ఒప్పిస్తారు. ఆర్థిక పరిస్థితిని బట్టి రూ.25-50వేల వరకు వసూలు చేస్తారు. ముందుగా 50 శాతం తీసుకుంటారు. ప్రాంతం, ఆసుపత్రి, వైద్యుల వివరాలను గోప్యంగా ఉంచుతారు.
ఆటోలో తీసుకెళ్లి
అనుకున్న రోజు ఇంటి ముందు ఆటో వాలిపోతుంది. డ్రైవర్ గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్తారు. బీహెచ్ఎంఎస్, ఆర్ఎంపీ వైద్యుల సహకారంతో శివారు ప్రాంతాల్లోని స్కానింగ్ కేంద్రాలలో పరీక్షలు నిర్వహించి పుట్టబోయేదెవరో చెప్తారు. రూ.10-20వేలు అదనంగా ఇస్తే మరో క్లినిక్‌కు తరలించి గర్భస్రావం చేయిస్తారు. ఆట్రో డ్రైవర్లకు రూ.2వేల నుంచి రూ.3వేలు, డాక్టర్లకు రూ.10-15వేల వరకు ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా బదిలీ చేస్తారు.
నిబంధనలకు నీళ్లు...
* గ్రేటర్‌వ్యాప్తంగా 2 వేల వరకు స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో అనేకం ఏటా రెన్యువల్ చేసుకోవడం లేదు. అధికారులు చర్యలు తీసుకోవాలి.
* ప్రతి కేంద్రంలో బోర్డులు, రికార్డులు పక్కాగా నిర్వహించాల్సి ఉన్నా కానరావడంలేదు. ః సనత్‌నగర్, అమీర్‌పేట, మెహిదీపట్నం, నాంపల్లి ప్రాంతాల్లోని కొన్ని ల్యాబ్‌లలో లింగనిర్ధరణ పరీక్షలు జరుగుతున్నట్లు గతంలోనే బయటపడింది. ఇలాంటి కేంద్రాలు వేరే పేర్లతో మళ్లీ తెరుచుకుంటున్నాయి.
* వివిధ స్కానింగ్ కేంద్రాల నుంచి స్థానిక వైద్య ఆరోగ్య సిబ్బందికి నెలానెలా ముడుపులు అందుతున్నాయనేది బహిరంగ రహస్యం. మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారనే ఆరోపణలూ సరేసరి..
* పోలీసులు తరచుగా డెకాయి ఆపరేషన్లు నిర్వహించాలని, అక్రమ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు