గురువారం, డిసెంబర్ 12, 2019
దోపిడీ కేసును ఛేదించిన బాలాపూర్ పోలీసులు
కర్మన్‌ఘాట్, న్యూస్‌టుడే: కేవలం 36 గంటల వ్యవధిలో ఓ దోపిడీ కేసును ఛేదించిన బాలాపూర్ పోలీసులు వాటి వివరాలను గురువారం వెల్లడించారు. వనస్థలిపురం ఏసీపీ జైరాంరెడ్డి..బాలాపూర్ సీఐ సైదులు, డీఐ సుధీర్కృష్ణతో కలిసి వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మీర్‌పేట పరిధిలోని సరళాదేవి ఎన్‌క్లేవ్‌కు చెందిన జంగమ సంతోష్ అనే వ్యక్తి బాలాపూర్ మండల ప్రాంతం గాయత్రి హిల్స్ కాలనీ వాసి అర్రగూడం కామేష్ వద్ద మూడేళ్ల క్రితం రూ. 25 లక్షలను అప్పుగా తీసుకున్నాడు. బడంగ్‌పేటలోని తన ఇంటి పత్రాలు కుదువపెట్టి తెచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమంటే ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ నెల 19న డబ్బులు ఇస్తానని కామేష్‌ను సంతోష్ కందుకూరుకు రమ్మన్నాడు. అతడు బయట ఉండటంతో తల్లి లక్ష్మమ్మను ఇంట్లో ఉంచిన పత్రాలను తీసుకుని రమ్మని చెప్పాడు. ఆమె కారులో డ్రైవర్‌తో పాటు ఆర్సీఐ రోడ్డులో కందుకూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో సంతోష్ సైతం కామేష్ తల్లి వెళ్తున్న కారులోనే వస్తానన్నాడు. అతడు మంగళవారంనాడు ఆర్సీఐ రోడ్డులోని పాఠశాల వద్ద కారు ఎక్కాడు. అది విమానాశ్రయం రోడ్డులోని ఓ రెస్టారెంట్ వద్దకు వెళ్లగానే, తాను ఉదయం నుంచి భోజనం చేయలేదని కొబ్బరి బోండాలు తేవాలని డ్రైవర్ అనిల్‌ను కోరాడు. అతడు కారు దిగి అవి తేవడానికి వెళ్లాడు. వెంటనే సంతోష్.. లక్ష్మమ్మను బెదిరించి, కారులోని ఓ బ్యాగులో ఉన్న ఇంటి ఒరిజనల్ పత్రాలతో పాటు రూ.10 లక్షలను తీసుకున్నాడు. కారు వెనకాలే ఏర్పాటు చేసుకున్న మరో బైక్‌పై ఎక్కి పరారయ్యాడు.
ఫిర్యాదు అందుకున్న బాలాపూర్ పోలీసులు బృందాలుగా ఏర్పడి సంతోష్ కోసం గాలింపు మొదలు పెట్టారు. బాలాపూర్ పరిధిలోని శివాజీచౌక్‌లో ఈ నెల 20న వాహనాల తనిఖీలు చేస్తుండగా, నిందితుడు దొరికాడు. అతడు దొంగిలించిన ఇంటి పత్రాలతో పాటు రూ.10 లక్షలను కూడా మీడియా ముందు పోలీసులు ప్రదర్శించారు. సంతోష్‌పై 420, 382 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసు సిబ్బందికి ఏసీపీ నగదు పురస్కారాన్ని అందజేశారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు