close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

రద్దీ లేకుండా.. ఉపాధి పోకుండా

వీధివ్యాపారుల కోసం పట్టణాల్లో ప్రత్యేక ప్రణాళిక

మూడు జోన్లుగా ప్రధాన వీధుల విభజన

గద్వాల, అయిజలో అధికారుల కసరత్తు ప్రారంభం

న్యూస్‌టుడే, గద్వాల కలెక్టరేట్‌

పాత బస్టాండులో రోడ్డు పక్కన పండ్లు అమ్ముకుంటున్న మహిళలు..

పట్టణాల్లో రహదారుల వెంట తోపుడుబండ్లు, కింద కూర్చుని అమ్మకాలు సాగించేవారితో తరచూ ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన - నేషనల్‌ అర్బన్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌(డీఏవై-ఎన్‌యూఎల్‌ఎం), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సంయుక్త ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పురపాలికల్లో చేస్తున్న ఏర్పాట్లపై ‘న్యూస్‌టుడే’ కథనం.

జోన్ల ఎంపికకు సర్వే చేస్తున్న పురపాలిక, పోలీసు శాఖల అధికారులు

దేశంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో వీధి వ్యాపారులకు ప్రణాళికను అమలు చేయటం 2016లోనే ప్రారంభమైంది. తాజాగా తెలంగాణలోని అన్ని పురపాలికల్లో వీధి వ్యాపారులకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. గద్వాల పురపాలికలో కొత్త బస్టాండ్‌, కృష్ణవేణి చౌరస్తా, పాత బస్టాండ్‌ సర్కిల్‌, కూరగాయల మార్కెట్‌తోపాటు మెయిన్‌ బజార్‌లో ఎక్కువగా తోపుడుబండ్లపై, రహదారుల వెంబడి వ్యాపారాలు చేసుకునేవారు ఉన్నారు. సోమవారం సంత నిర్వహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది జనం గద్వాలలో సరకులు కొనేందుకు, అమ్మేందుకు వస్తుంటారు. ఈ సమయంలో ప్రధాన రహదారుల్లో వీధి అమ్మకాలతో ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. జిల్లాకేంద్రంలో తోపుడుబండ్లపై అమ్మకాలు చేసేవారు 525 మంది ఉన్నట్లు మెప్మా అధికారుల సర్వేలో తేలింది. కాలానుగుణంగా రోడ్లు వెంట పండ్లు, తదితరాలు అమ్ముకునేవారు మరో వందకు పైగా ఉంటారని అంచనా. అయిజ వాణిజ్యకేంద్రం కావడంతో అక్కడ కూడా వీధివ్యాపారులు ఉన్నారు.

గద్వాలలో ప్రధాన రహదారిపై తోపుడుబండ్లపై చిరు వ్యాపారాలు

జోన్ల విభజన ఇలా.. : వీధి అమ్మకాలు చేసుకునేవారితో ఇప్పటికే పుర అధికారులు సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళిక గురించి వివరించారు. పోలీస్‌శాఖ పురపాలిక అధికారులతోపాటు చిరు వ్యాపారులు, ఎన్‌జీవో ప్రతినిధులతో కలిపి ప్రణాళిక అమలుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. గురువారం అధికారులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరిగి ఎక్కడెక్కడ ఏ జోన్‌ ఏర్పాటు చేయాలో పరిశీలించారు. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే రద్దీ ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించి వీధి అమ్మకాలకు అనుమతించరు. రహదారుల పక్కన ఫుట్‌పాత్‌ స్థలం ఎక్కువగా ఉన్న చోట్లను గ్రీన్‌ జోన్లుగా పేర్కొంటూ అక్కడ క్రమపద్ధతిలో వీధి వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతిస్తారు. అండర్‌ జోన్‌లో వాహనాల్లో వ్యాపారాలు చేసుకునేవారికి నిర్ణీత సమయాల్లో మాత్రమే నిర్దేశించిన చోట్ల అమ్మకాలకు అనుమతిస్తారు. అయిజలోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తారు.

వ్యాపారులు సహకరించాలి : పట్టణాల్లో వీధి వ్యాపారులందరూ సహకరిస్తేనే ప్రణాళిక అమలు సులువవుతుంది. రహదారులపై వీధి అమ్మకాలు చేసుకునేవాళ్లందరికీ గుర్తింపుకార్డులు ఇస్తాం. ఏయే వ్యాపారాలు ఎక్కడ చేస్తే బాగుంటుందో కూడా కమిటీ సూచిస్తుంది. జోన్ల ఎంపిక పూర్తిచేశాక మా పట్టణ ప్రణాళిక సిబ్బంది పటం తయారుచేస్తారు. ఆమోదం కోసం సీడీఎంఏకు పంపుతాం. జిల్లాలో కొత్త పురపాలికలైన అలంపూర్‌, వడ్డేపల్లిలో ప్రణాళిక అమలు ఆవశ్యకతను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

- నర్సింహ, కమిషనర్‌, గద్వాల పురపాలిక

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.