సోమవారం, డిసెంబర్ 09, 2019
సైదాబాద్, న్యూస్‌టుడే: ఇక్కడి భారతీయ వైద్య పరంపర సంస్థ (కేంద్రీయ ఆయుర్వేద విజ్ఞాన పరిశోధన పరిషత్ -ఆయుష్ మంత్రిత్వ శాఖ)కు చెందిన ప్రదర్శనశాలను పర్యాటక స్థలాల పట్టికలో చేర్చాలని ఇన్‌ఛార్జి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పీవీవీ ప్రసాద్ కోరారు. గడ్డిఅన్నారం పరిధి రెవిన్యూబోర్డ్ కాలనీలో ఉన్న సంస్థను పర్యాటక సంస్థ కమిషనర్ ఎ. దినకర్‌బాబు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శనశాలతో పాటు గ్రంథాలయం గురించి పలు అంశాలు పరిశీలించారు. సంస్థలో ఉన్న సౌకర్యాలు, వసతులు అడిగి తెలుసుకున్నారు. ప్రదర్శనశాల ప్రాముఖ్యాన్ని ప్రసాద్ వివరించారు. తెలంగాణ పర్యాటక శాఖకు సంబంధించిన పర్యాటక స్థలాల జాబితాలో చేర్చాలని ఆయనను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ సహాయ సంచాలకులు మాధవి, ఆయుర్వేద పరిశోధన అధికారి డాక్టర్ టి. సాకేత్ రామ్, గణాంక అధికారి డాక్టర్ అరుణాబ్ త్రిపాఠి, లైబ్రేరియన్ కె. శ్రీనివాసరావు, ప్రదర్శనశాల సంరక్షకులు మురళీ మనోహర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు