ఆదివారం, డిసెంబర్ 08, 2019
నారాయణగూడ, న్యూస్‌టుడే: 1970వ దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ స్కాలర్‌గా ఉండి, అక్కడి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై గొంతు విప్పిన జార్జిరెడ్డి, కమ్యూనిస్టు భావజాలంతో సాగించిన పోరాటంలో అసువులు బాశాడు. ఆయన జీవిత కథను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ‘జార్జిరెడ్డి’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం గురువారం హైదరాబాద్ నారాయణగూడలోని క్రైస్తవ శ్మశాన వాటికలో జార్జిరెడ్డి సమాధికి నివాళి అర్పించింది. కథానాయకుడు సందీప్ మాధవ్, దర్శకుడు బి.జీవన్‌రెడ్డి, నిర్మాత అప్పిరెడ్డి, అసోసియేట్ నిర్మాతలు సుధాకర్‌రెడ్డి యక్కంటి, సంజయ్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, నటులు సత్యదేవ్ కంచరాన, మనోజ్‌నందం ఇతర సాంకేతిక నిపుణులు శ్రద్ధాంజలి ఘటించారు.
జార్జిరెడ్డి ఆలోచన విధానమే మా సినిమా: దర్శకుడు బి.జీవన్‌రెడ్డి
నీతికి, నిజాయతీకి మారుపేరుగా ఉండి.. అన్యాయాలపై సమరశంఖం పూరించిన జార్జిరెడ్డి గురించి తెలుసుకున్నప్పుడు ముందు బాధపడ్డాను. అంతటి గొప్ప పోరాటయోధుడిని గురించి మనం మరిచిపోయామా అనిపించింది. అయిదేళ్ల క్రితం ఆయన గురించి పరిశోధన మొదలుపెట్టాను. ఆయన గురించి తెలుసుకున్న తరువాత అభిమానిగా మారిపోయాను. అడపాదడపా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి వెళ్లినప్పుడు ఆయన గుండెచప్పుడు వినిపించేది. మేము తీసిన జార్జిరెడ్డి సినిమాలో ఆ పోరాటయోధుడి ఆలోచన విధానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాం.
చరిత్రను వక్రీకరించలేదు.. జార్జిరెడ్డి చరిత్రను ఎక్కడా వక్రీకరించలేదు. ఎవరి మనోభావాలూ దెబ్బతీయలేదు. ఒకరిని కించపర్చడానికో, బాధపెట్టడానికో సినిమా తీయలేదు. కేవలం జార్జిరెడ్డి ఆలోచన విధానాన్ని, పోరాట పటిమను మాత్రమే తెరపైకి తీసుకొస్తున్నాం. సినిమాను అడ్డుకుంటామని చెబుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్ మా సినిమా చూడకుండానే మాట్లాడుతున్నారు.
సినిమా చూడకుండా వ్యాఖ్యలు వద్దు.. రాజ్యాంగానికి కట్టుబడే సినిమా తీశాను. సెన్సార్ బోర్డు ధ్రువీకరణ పత్రం జారీ చేసింది. ఈ సినిమా రాజ్యాంగబద్ధంగా ఉందని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి. ఎవరైనా సినిమాను చూడకుండా వ్యాఖ్యలు చేయకండి. ఎవరికైనా అనుమానాలుంటే, అభ్యంతరాలుంటే చెప్పండి మాట్లాడుకుందాం. మీరడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా.
తాజా వార్తలు
జిల్లా వార్తలు