close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

పట్టించుకోకుంటే.. పెడదారి!

పిల్లల ప్రవర్తనపై పరిశీలన అవసరం
తల్లిదండ్రులకు మానసిక నిపుణులు, పోలీసుల సూచన

‘‘యూట్యూబ్‌లో కిడ్నాప్‌ సినిమాలు చూశా... పిల్లలను కిడ్నాప్‌ చేస్తే వారు డబ్బులిస్తారని ఆ సినిమాల్లో ఉన్నాయి. కిడ్నాప్‌ ఎలా చేయాలో వివరంగా ఉంది... అదే విధానాన్ని అమలు చేశా.. రూ.3 లక్షలొస్తే ముంబయికి వెళ్లి జల్సాలు చేయాలనుకున్నా... స్కూల్‌కు వెళ్లినప్పుడు చదువుకొంటా... ఖర్చుల కోసం అమ్మానాన్నలను అడుగుతా... వాళ్లు డబ్బు ఇవ్వనందుకే నాకు తెలిసిన చిన్నారిని కిడ్నాప్‌ చేశా. ఇంతకు మించి నాకు వేరే ఆలోచన లేదు...’’

-మీర్‌పేట పోలీస్‌ ఠాణా పరిధిలో డబ్బు కోసం కిడ్నాప్‌ చేసి పోలీసులకు చిక్కిన బాలుడు(14) విచారణలో అన్నమాటలివి.

 

 

ఈనాడు, హైదరాబాద్‌

పధ్నాలుగేళ్లకే ఆ పిల్లాడు కిడ్నాపర్‌గా మారాడని తెలుసుకున్న పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇంతేకాదు... నగరంలో మైనర్లు నేరస్థులుగా మారుతున్నారని ఆందోళన చెందుతున్నారు... తల్లిదండ్రులు ప్రేమతో కూడిన గారాబం వల్లే వారి పిల్లలు పెడదారిలో వెళ్లేందుకు దోహదం చేస్తోందని పోలీసులు, మానసిక విశ్లేషకులు అంటున్నారు. ఇళ్లల్లో చిన్నచిన్న దొంగతనాలు చేయడం... పాఠశాలల్లో స్నేహితులను కొట్టడం... పదో తరగతిలోనే హుక్కా పీల్చడం... మత్తు పదార్థాలకు బానిసలవ్వడం వంటివి ఇందువల్లేనని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు.

 

అఘాయిత్యాలకు పాల్పడతారేమోనని..
టోలీచౌకీలో నివాసముంటున్న ఒక ప్రైవేటు ఉద్యోగి కుమారుడు ఇంటర్‌ తొలి సంవత్సరంలోనే మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. తల్లి ఎదురుగానే గంజాయి కోసం డబ్బు కావాలంటూ బెదిరించి తీసుకునేవాడు. ఆమె ఇవ్వకపోతే రాత్రివేళల్లో తండ్రి డెబిట్‌కార్డు తీసుకుని ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకునేవాడు. పరిస్థితి చేజారిపోతే ప్రమాదమని భావించిన ఆ కుర్రాడి తల్లిదండ్రులు ‘షి’బృందం సభ్యుల వద్దకు కొద్దిరోజుల క్రితం తీసుకువచ్చారు. ఆ కుర్రాడిని పోలీసులు విచారించగా... ఇంట్లో చదువు.. చదువు.. అంటూ అమ్మానాన్నలు అదేపనిగా అనడం, వారి బాధ తట్టుకోలేక చదువుకునేందుకు ఉపక్రమిస్తే అర్థం కాకకపోవడం వంటివి తనపై తీవ్రంగా ప్రభావం చూపించాయని చెప్పాడు. అనంతరం తల్లిదండ్రులను విచారించగా... తమకు ఒక్కడే కొడుకు ఉన్నాడని, చెడిపోతున్నానని తెలిసినా... గట్టిగా బెదిరిస్తే అఘాయిత్యం చేసుకుంటాడేమోనన్న భయంతో తాము మిన్నకుండి పోయామని వివరించారు.

పర్యవేక్షణ లేమి తల్లిదండ్రుల వైఫల్యమే..
-డాక్టర్‌ గీతా చల్లా
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా ప్రేమిస్తున్నారు. కష్టం అన్నది తెలీకుండా పెంచుతున్నారు. పట్టు తప్పుతున్నారని తెలిసినా పిల్లలను దండించడంలో వెనుకంజ వేస్తున్నారు. ఇది తల్లిదండ్రుల పెంపకంలో వైఫల్యమే.

అలకలు.. తీవ్ర నిరసనలు...
ఏడో తరగతి నుంచి ఇంటర్‌ చదువుకుంటున్న కొందరు విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద తీవ్ర నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. స్నేహితుల వద్ద ఖరీదైన కార్లున్నాయ్‌... కనీసం బైక్‌ కొనివ్వాలంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్నం తినకపోవడం, కళాశాలలకు వెళ్లబోమంటూ బెదిరిస్తున్నారంటూ తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు. తండ్రి కొడితే స్నేహితుల వద్దకు వెళ్లి వ్యసనాలను నేర్చుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇందులో 60శాతం మంది ఈవ్‌టీజర్లుగా మారుతున్నారని వివరించారు. కొందరు రోజూ సిగరెట్లు తాగడం, వారాంతాల్లో మద్యం పార్టీలు చేసుకుంటున్నారని తెలిపారు. కొందరు యువతులూ తల్లిదండ్రులను బెదిరించి డబ్బులు తీసుకుని స్నేహితురాళ్లతో కలసి సినిమాలు, షికార్లకు వెళ్తున్నారు. ఫేస్‌బుక్‌లో యువకులతో ఛాటింగ్‌ చేస్తున్నారు. హుక్కా కేంద్రాలకు వెళ్తూ మత్తును రుచిచూస్తున్నారని ‘షి’బృందం సభ్యులు వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.